రామగిరి (నల్లగొండ): జానపద పాటలు, కూచిపూడి నాట్యంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో విశేష గుర్తింపు పొందిన నల్లగొండకు చెందిన నాగదుర్గ వెండితెరపై వరుస అవకాశాలతో దూసుకుపోతున్నారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘ఇడుపు కాయితం’ సినిమా షూటింగ్ ఇటీవల పూర్తయి విడుదలకు సిద్ధం కాగా.. తాజాగా ‘శనార్తి’ చిత్రంలో నటించేందుకు అంగీకరించారు.
జానపద గీతాల ద్వారా తన అభినయం, హావభావాలతో ప్రేక్షకులను అలరించిన నాగదుర్గ ఇప్పుడు పూర్తిస్థాయి సినీ నటిగా మారుతున్నారు. ఇప్పటికే ఆమె నటించిన ఇడుపు కాయితం చిత్రీకరణ పనులు పూర్తయి, విడుదల దశకు చేరుకున్నాయి. మరోవైపు కొత్త ప్రాజెక్ట్ శనార్తి సినిమాకు నాగదుర్గ పచ్చజెండా ఊపారు. కథాంశం, తన పాత్రకు ప్రాధాన్యం ఉన్న నేపథ్యంలో ఈ చిత్రంపై ఆమె ఎంతో ఆశలు పెట్టుకున్నారు. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్న శనార్తి సినిమాతో ఆమె కెరీర్‌లో మరో కీలక ఘట్టం మొదలవనుంది.
కళాసేవలోనూ ముందుంటూ...
ఒకవైపు జానపద పాటలు, యూట్యూబ్ ఇన్‌ఫ్లుఝెన్సర్‌గా, మరోవైపు సినిమా షూటింగ్‌లతో ఎంత బిజీగా ఉన్నా.. నాగదుర్గ తన మూలాలను, కళాసేవను మర్చిపోలేదు. పాట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో కూచిపూడిలో పీజీ పూర్తి చేసిన ఆమె, భవిష్యత్‌లో పీహెచ్‌డీ చేయాలనే లక్ష్యంతో ఉన్నారు. నల్లగొండలో నాగదుర్గ నాట్యాలయం పేరుతో కూచిపూడి శిక్షణ కేంద్రాన్ని నిర్వహిస్తూ, విద్యార్థులకు నాట్యం నేర్పిస్తూ వారాంతాల్లో స్వస్థలానికి వచ్చి కళాభివృద్ధికి పాటుపడుతున్నారు.
కూచిపూడి నుంచి మొదలైన పయనం
ఉమ్మడి నల్లగొండ జిల్లా అడ్డగూడూరు నాగదుర్గ స్వస్థలం. ఉద్యోగరీత్యా తల్లిదండ్రులు నల్లగొండలో స్థిరపడ్డారు. నాగదుర్గ పదో తరగతి వరకు నల్లగొండలో చదువుకుని, హైదరాబాద్‌లో ఇంటర్, బీఎస్సీ పూర్తి చేశారు. చిన్ననాటి నుంచే నృత్యంపై ఉన్న మక్కువతో కూచిపూడిలో శిక్షణ తీసుకున్నారు. 2021లో ‘తిన్నాతీరం పడతలే’ జానపద పాటతో నటనలోకి అడుగుపెట్టిన ఆమె. నాలుగేళ్ల వ్యవధిలో సుమారు 300 జానపద పాటల్లో నటించి యూట్యూబ్‌లో కోట్లాది వ్యూస్, 100 మిలియన్ మార్క్‌ను అందుకున్నారు. శాస్త్రీయ నృత్యం నుంచి జానపదంలోకి వచ్చి, ఇప్పుడు వరుస సినిమాలతో వెండితెరపై తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమయ్యారు.


