నిజామాబాద్‌: సుధాకర్‌ మృతితో భీమ్‌గల్‌లో హైటెన్షన్‌ | Tea Stall Owner Sudhakar Suicide In Nizamabad | Sakshi
Sakshi News home page

నిజామాబాద్‌: సుధాకర్‌ మృతితో భీమ్‌గల్‌లో హైటెన్షన్‌

Oct 6 2026 9:02 AM | Updated on Oct 6 2026 9:02 AM

Tea Stall Owner Sudhakar Suicide In Nizamabad

సాక్షి, నిజామాబాద్‌: పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్న టీ స్టాల్‌ నిర్వాహకుడు పొలాస సుధాకర్‌ మృతి చెందడంతో భీమ్‌గల్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసుల వేధింపుల కారణంగానే సుధాకర్‌ ఈ తీవ్ర నిర్ణయానికి పాల్పడ్డారని కుటుంబ సభ్యులు, బీఆర్‌ఎస్‌ నేతలు ఆరోపిస్తుండగా.. ఈ ఘటనలో పోలీసుల తప్పేమీ లేదని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి మంగళవారం భీమ్‌గల్‌ బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో పట్టణంలో ఉత్కంఠ నెలకొంది.

భీమ్‌గల్‌ పట్టణంలోని పాత బస్టాండ్‌ సమీపంలో సుధాకర్‌ టీ స్టాల్‌ నిర్వహించేవారు. రాత్రి వేళల్లోనూ వ్యాపారం చేస్తున్నారంటూ పోలీసులు పలుమార్లు హెచ్చరించారని, ఇప్పటికే మూడుసార్లు జరిమానా విధించారని కుటుంబ సభ్యులు తెలిపారు. తాజాగా మరోసారి జరిమానా విధించడంతోపాటు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి సంతకం చేయాలని, కోర్టుకు వెళ్లి జరిమానా చెల్లించాలని పోలీసులు సూచించినట్లు చెప్పారు. దీంతో మనస్తాపానికి గురైన సుధాకర్‌ సోమవారం ఉదయం పోలీస్‌స్టేషన్‌ ఆవరణలోనే ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్నారు. పోలీసులు, అక్కడున్న ఇతరులు వెంటనే మంటలు ఆర్పి ఆస్పత్రికి తరలించారు.

పోలీసులపై కుటుంబం ఆరోపణలు
సుధాకర్‌ను పోలీసులు పదేపదే ఇబ్బందులకు గురిచేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఇతర దుకాణాలు రాత్రివేళల్లో తెరిచి ఉన్నప్పటికీ తన స్టాల్‌పైనే ఎందుకు చర్యలు తీసుకుంటున్నారని సుధాకర్‌ ప్రశ్నించేవారని తెలిపారు. ఘటన అనంతరం కుటుంబ సభ్యులు పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఆందోళనకు దిగారు. ఎస్సై తిరుపతిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

పోలీసుల వాదన ఏంటి?
మరోవైపు ఈ ఘటనలో పోలీసుల తప్పేమీ లేదని సీపీ సాయి చైతన్య ప్రకటించారు. సుధాకర్‌పై నిబంధనల మేరకే కేసు నమోదు చేశామని, రాత్రి విధుల్లో భాగంగానే పోలీసులు చర్యలు తీసుకున్నారని తెలిపారు. ఈ అంశంపై పోలీసుల వివరణ, బాధితుడి కుటుంబం చేస్తున్న ఆరోపణలకు భిన్నంగా ఉండటంతో ఘటనపై పూర్తిస్థాయి విచారణ అవసరమనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

‘ఎస్సై వేధింపులే కారణం’
మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి మాత్రం సుధాకర్‌ ఆత్మహత్యాయత్నానికి భీమ్‌గల్‌ ఎస్సై తిరుపతి వేధింపులే కారణమని ఆరోపించారు. ఎస్సైపై గతంలోనూ పలు ఆరోపణలు చేసినా చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. సీపీ పోలీసుల ప్రమేయం లేదని చెప్పడం బాధ్యతారాహిత్యమని విమర్శించారు. ఎస్సైపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

బంద్‌తో హైటెన్షన్‌
సుధాకర్‌ మృతికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో భీమ్‌గల్‌ బంద్‌కు పిలుపునిచ్చారు. ప్రజలు, వ్యాపార వర్గాలు బంద్‌కు సహకరించాలని వేముల ప్రశాంత్‌రెడ్డి కోరారు. దీంతో బంద్‌ నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఘటనపై కుటుంబ సభ్యులు, వివిధ పార్టీల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement