మూడు నెలలు రాపిడో నడిపాడు.. చివరికి షాకింగ్‌ నిజం తెలుసుకున్నాడు! | Bengaluru College Student Works As Rapido Driver For 3 Months, Learns The Hidden Struggles Of Gig Workers, Post Went Viral | Sakshi
Sakshi News home page

మూడు నెలలు రాపిడో నడిపాడు.. చివరికి షాకింగ్‌ నిజం తెలుసుకున్నాడు!

Aug 20 2026 8:22 AM | Updated on Aug 20 2026 9:10 AM

Bengaluru College Student Works As Rapido Driver For 3 Months

కాలేజీకి సెలవులు వచ్చాయి.. స్నేహితులు సరదాగా గడిపితే.. అతడు మాత్రం బైక్‌ స్టార్ట్‌ చేశాడు. బ్యాగ్‌లో పుస్తకాలకు బదులు ఫోన్‌ పెట్టుకున్నాడు.. క్లాస్‌రూమ్‌ బదులు బెంగళూరు రోడ్లపైకి వచ్చాడు. మూడు నెలలు రాపిడో కెప్టెన్‌గా పనిచేశాడు. రోజుకు రూ.1,200 వరకు సంపాదించాడు. కానీ చివరికి అతడు తెలుసుకున్నది సంపాదన లెక్క కాదు.. గిగ్‌ వర్కర్ల జీవితంలో దాగున్న అసలు కష్టం!

బెంగళూరుకు చెందిన ఓ బీబీఏ రెండో సంవత్సరం విద్యార్థి మొదట్లో రాపిడో యాప్ విధానం, డిమాండ్ ఎక్కడ ఎక్కువగా ఉంటుందో అర్థం కాలేదని చెప్పాడు. అయితే కొద్ది రోజుల్లోనే ప్రయాణికుల డిమాండ్ ఎక్కువగా ఉండే ప్రాంతాలను గుర్తించి, తన ఆదాయాన్ని పెంచుకున్నట్లు వివరించాడు. సాధారణంగా ఉదయం 8 గంటలకు పని ప్రారంభించి సాయంత్రం 4.30 గంటల వరకు పనిచేసేవాడినని తెలిపాడు. మంచి రోజుల్లో ఇంధన ఖర్చులు, ఇతర ఖర్చులు మినహాయించకముందు సుమారు రూ.1,200 వరకు సంపాదించేవాడినని పేర్కొన్నాడు.

"నాకు ఇది మంచి సైడ్ హసల్‌గా అనిపించింది. కానీ ఇదే పనిపై ఆధారపడి జీవించే గిగ్ వర్కర్ల పరిస్థితి గురించి కూడా ఆలోచించేలా చేసింది. ఆ గంటల్లో నేను పెద్దగా విరామాలు కూడా తీసుకోలేదు" అని విద్యార్థి తన పోస్టులో రాశాడు.

మధ్యాహ్నం సమయంలో రైడ్లు తక్కువగా వచ్చినప్పుడు అదనపు ఆదాయం కోసం ఫుడ్ డెలివరీలు కూడా చేసినట్లు చెప్పాడు. కొన్ని సందర్భాల్లో రెస్టారెంట్‌లో ఆర్డర్ వెంటనే సిద్ధమవుతుందని, మరికొన్ని సార్లు 20 నుంచి 25 నిమిషాలు వేచి ఉండాల్సి వచ్చేదని వివరించాడు.

మూడు నెలల పాటు బెంగళూరులోని మెజెస్టిక్, రైల్వే స్టేషన్లు, రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఎక్కువగా పని చేశానని తెలిపాడు. ఆటో డ్రైవర్లు తనను చూసి అసహనం వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నప్పటికీ, ఎవరూ తనను బెదిరించలేదని చెప్పాడు.

తన సంపాదన వివరాలను చూపించేందుకు రాపిడో ఆదాయ డ్యాష్‌బోర్డ్ స్క్రీన్‌షాట్‌లను కూడా పంచుకున్నాడు. మే నెలలో 96 ఆర్డర్లు పూర్తి చేసి రూ.5,650 సంపాదించాడు. జూన్‌లో ఆదాయం పెరిగి రూ.16,660కి చేరింది. జూలైలో 233 రైడ్లు పూర్తి చేసి రూ.14,222 సంపాదించినట్లు తెలిపాడు.

"ఇది కేవలం రోజుకు రూ.1,200 సంపాదించడం గురించి కాదు. గిగ్ వర్కర్ల జీవితం ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా తెలుసుకున్నాను. వేచి ఉండటం, ఇంధన ఖర్చులు, ఆదాయంలో అనిశ్చితి, ప్లాట్‌ఫామ్ నిబంధనలు, కస్టమర్ల సమస్యలు, రెస్టారెంట్లలో ఎదురయ్యే ఇబ్బందులు, నిరంతరం పని చేయాలనే ఒత్తిడి అన్నీ అర్థమయ్యాయి" అని విద్యార్థి పేర్కొన్నాడు.

ఈ పోస్టు వైరల్ కావడంతో సోషల్ మీడియాలో పలువురు అతడిని ప్రశంసించారు. గిగ్ వర్కర్ల కష్టాలను అర్థం చేసుకునేలా తన అనుభవాన్ని వివరించాడని అభినందించారు.

ఒక నెటిజన్ స్పందిస్తూ, "మీ అనుభవాన్ని చాలా చక్కగా వివరించారు. ఈ అనుభవాన్ని నేర్చుకునే అవకాశంగా తీసుకోవడం అభినందనీయం" అని వ్యాఖ్యానించాడు.

మరో వ్యక్తి మాట్లాడుతూ, "క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్లు చేసే సమయంలో డెలివరీ వ్యక్తి వచ్చినప్పుడు డబ్బు సిద్ధంగా ఉంచండి. వారికి సమయం చాలా విలువైనది" అని పేర్కొన్నాడు.

మరో నెటిజన్ తన అనుభవాన్ని పంచుకుంటూ, తాను కూడా బీబీఏ చదివే సమయంలో రాపిడోలో పనిచేశానని, ఉదయం 7 నుంచి 11 గంటల వరకు, మళ్లీ సాయంత్రం 4 నుంచి రాత్రి 9 వరకు పని చేసి రోజుకు సుమారు రూ.1,500 వరకు సంపాదించేవాడినని తెలిపాడు. తర్వాత ఆ పని మానేశానని చెప్పాడు.

ఈ విద్యార్థి అనుభవం ద్వారా గిగ్ ఎకానమీలో పనిచేసే వారి ఆదాయం మాత్రమే కాకుండా, వారు ఎదుర్కొనే శ్రమ, సమయ ఒత్తిడి, అనిశ్చిత పరిస్థితులు కూడా వెలుగులోకి వచ్చాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement