breaking news
Delivery bikes
-
మూడు నెలలు రాపిడో నడిపాడు.. చివరికి షాకింగ్ నిజం తెలుసుకున్నాడు!
కాలేజీకి సెలవులు వచ్చాయి.. స్నేహితులు సరదాగా గడిపితే.. అతడు మాత్రం బైక్ స్టార్ట్ చేశాడు. బ్యాగ్‌లో పుస్తకాలకు బదులు ఫోన్ పెట్టుకున్నాడు.. క్లాస్రూమ్ బదులు బెంగళూరు రోడ్లపైకి వచ్చాడు. మూడు నెలలు రాపిడో కెప్టెన్‌గా పనిచేశాడు. రోజుకు రూ.1,200 వరకు సంపాదించాడు. కానీ చివరికి అతడు తెలుసుకున్నది సంపాదన లెక్క కాదు.. గిగ్ వర్కర్ల జీవితంలో దాగున్న అసలు కష్టం!బెంగళూరుకు చెందిన ఓ బీబీఏ రెండో సంవత్సరం విద్యార్థి మొదట్లో రాపిడో యాప్ విధానం, డిమాండ్ ఎక్కడ ఎక్కువగా ఉంటుందో అర్థం కాలేదని చెప్పాడు. అయితే కొద్ది రోజుల్లోనే ప్రయాణికుల డిమాండ్ ఎక్కువగా ఉండే ప్రాంతాలను గుర్తించి, తన ఆదాయాన్ని పెంచుకున్నట్లు వివరించాడు. సాధారణంగా ఉదయం 8 గంటలకు పని ప్రారంభించి సాయంత్రం 4.30 గంటల వరకు పనిచేసేవాడినని తెలిపాడు. మంచి రోజుల్లో ఇంధన ఖర్చులు, ఇతర ఖర్చులు మినహాయించకముందు సుమారు రూ.1,200 వరకు సంపాదించేవాడినని పేర్కొన్నాడు."నాకు ఇది మంచి సైడ్ హసల్గా అనిపించింది. కానీ ఇదే పనిపై ఆధారపడి జీవించే గిగ్ వర్కర్ల పరిస్థితి గురించి కూడా ఆలోచించేలా చేసింది. ఆ గంటల్లో నేను పెద్దగా విరామాలు కూడా తీసుకోలేదు" అని విద్యార్థి తన పోస్టులో రాశాడు.మధ్యాహ్నం సమయంలో రైడ్లు తక్కువగా వచ్చినప్పుడు అదనపు ఆదాయం కోసం ఫుడ్ డెలివరీలు కూడా చేసినట్లు చెప్పాడు. కొన్ని సందర్భాల్లో రెస్టారెంట్లో ఆర్డర్ వెంటనే సిద్ధమవుతుందని, మరికొన్ని సార్లు 20 నుంచి 25 నిమిషాలు వేచి ఉండాల్సి వచ్చేదని వివరించాడు.మూడు నెలల పాటు బెంగళూరులోని మెజెస్టిక్, రైల్వే స్టేషన్లు, రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఎక్కువగా పని చేశానని తెలిపాడు. ఆటో డ్రైవర్లు తనను చూసి అసహనం వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నప్పటికీ, ఎవరూ తనను బెదిరించలేదని చెప్పాడు.తన సంపాదన వివరాలను చూపించేందుకు రాపిడో ఆదాయ డ్యాష్‌బోర్డ్ స్క్రీన్షాట్లను కూడా పంచుకున్నాడు. మే నెలలో 96 ఆర్డర్లు పూర్తి చేసి రూ.5,650 సంపాదించాడు. జూన్‌లో ఆదాయం పెరిగి రూ.16,660కి చేరింది. జూలైలో 233 రైడ్లు పూర్తి చేసి రూ.14,222 సంపాదించినట్లు తెలిపాడు."ఇది కేవలం రోజుకు రూ.1,200 సంపాదించడం గురించి కాదు. గిగ్ వర్కర్ల జీవితం ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా తెలుసుకున్నాను. వేచి ఉండటం, ఇంధన ఖర్చులు, ఆదాయంలో అనిశ్చితి, ప్లాట్‌ఫామ్ నిబంధనలు, కస్టమర్ల సమస్యలు, రెస్టారెంట్లలో ఎదురయ్యే ఇబ్బందులు, నిరంతరం పని చేయాలనే ఒత్తిడి అన్నీ అర్థమయ్యాయి" అని విద్యార్థి పేర్కొన్నాడు.ఈ పోస్టు వైరల్ కావడంతో సోషల్ మీడియాలో పలువురు అతడిని ప్రశంసించారు. గిగ్ వర్కర్ల కష్టాలను అర్థం చేసుకునేలా తన అనుభవాన్ని వివరించాడని అభినందించారు.ఒక నెటిజన్ స్పందిస్తూ, "మీ అనుభవాన్ని చాలా చక్కగా వివరించారు. ఈ అనుభవాన్ని నేర్చుకునే అవకాశంగా తీసుకోవడం అభినందనీయం" అని వ్యాఖ్యానించాడు.మరో వ్యక్తి మాట్లాడుతూ, "క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్లు చేసే సమయంలో డెలివరీ వ్యక్తి వచ్చినప్పుడు డబ్బు సిద్ధంగా ఉంచండి. వారికి సమయం చాలా విలువైనది" అని పేర్కొన్నాడు.మరో నెటిజన్ తన అనుభవాన్ని పంచుకుంటూ, తాను కూడా బీబీఏ చదివే సమయంలో రాపిడోలో పనిచేశానని, ఉదయం 7 నుంచి 11 గంటల వరకు, మళ్లీ సాయంత్రం 4 నుంచి రాత్రి 9 వరకు పని చేసి రోజుకు సుమారు రూ.1,500 వరకు సంపాదించేవాడినని తెలిపాడు. తర్వాత ఆ పని మానేశానని చెప్పాడు.ఈ విద్యార్థి అనుభవం ద్వారా గిగ్ ఎకానమీలో పనిచేసే వారి ఆదాయం మాత్రమే కాకుండా, వారు ఎదుర్కొనే శ్రమ, సమయ ఒత్తిడి, అనిశ్చిత పరిస్థితులు కూడా వెలుగులోకి వచ్చాయి. -
10 వేలకుపైగా ఉద్యోగాలు...ఈవెన్ కార్గోతో హీరో ఎలక్ట్రిక్ జోడీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డెలివరీ సేవల్లో ఉన్న ఈవెన్ కార్గోతో హీరో ఎలక్ట్రిక్ చేతులు కలిపింది. ఇందులో భాగంగా 2025 నాటికి 10,000 మందికిపైగా మహిళలను ఈవెన్ కార్గో వేదికపైకి తీసుకు వచ్చేందుకు హీరో ఎలక్ట్రిక్ సాయం చేస్తుంది. హైదరాబాద్, ముంబై, ఢిల్లీతోపాటు ఇతర ప్రధాన నగరాల్లో ఎలక్ట్రిక్ వాహనాలను సమకూరుస్తారు. ఈవెన్ కార్గో డెలివరీ ప్రతినిధులుగా పూర్తిగా మహిళలే ఉండడం విశేషం. పేద కుటుంబాలకు చెందిన మహిళలను ఎంపిక చేసి, శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలను కల్పిస్తోంది. చదవండి: ప్రభుత్వ రంగ బ్యాంకులపై ఆర్థిక శాఖ కీలక నిర్ధేశం..! -
హోండా ఫోర్జా 300 డెలివరీలు ప్రారంభం
ముంబై: ప్రముఖ స్కూటర్ తయారీ కంపెనీ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) తన ఫ్లాగ్షిప్ ప్రీమియం మిడ్–సెగ్మెంట్ ద్విచక్ర వాహనం ‘ఫోర్జా 300’ డెలివరీలను ప్రారంభించింది. సంస్థకు చెందిన బిగ్ వింగ్ వ్యాపార విభాగం.. తొలి విడత కింద నాలుగు స్కూటర్లను కస్టమర్లకు మంగళవారం అందజేసింది. ఈ సందర్భంగా హెచ్ఎంఎస్ఐ సేల్స్ అండ్ మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ యాద్విందర్ సింగ్ గులేరియా మాట్లాడుతూ.. ‘వినియోగదారుల నుంచి వచ్చిన విశేష స్పందన చూసి డెలివరీలను ఆరంభించాం. యూరో–5 ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న వెర్షన్‌ను 2021 ఆర్థిక సంవత్సరంలో అందుబాటులోకి తీసుకుని వస్తాం’ అని వెల్లడించారు. నూతనతరం అవసరాలకు తగిన స్కూటర్‌ను అందించడంలో భాగంగా ప్రీమియం మిడ్–సెగ్మెంట్ డెలివరీలను ప్రారంభించినట్లు సంస్థ ప్రెసిడెంట్, ఎండీ మినోరు కటో అన్నారు. -
కరుణ చూపి... కడుపు నింపి
కొన్ని శునకాలు రాజభోగం అనుభవిస్తాయి. వాటి అదృష్టానికి అబ్బురపడిపోతాం. కొన్ని శునకాలను మాత్రం ఎవరూ పట్టించుకోరు. వాటి ఆలనాపాలనా ఎవరికీ పట్టదు. అందుకే వీధి కుక్కలు వీధికుక్కలుగానే ఉండిపోతాయి. కొన్ని సంవత్సరాల క్రితం ఒక వీధికుక్క దీనస్థితిని చూసి, దాన్ని ఇంటికి తెచ్చుకున్నారు అంజలి కకటి. ఆ తరువాత కూడా గాయపడిన మరో శునకాన్ని ఎక్కడో చూసి ఇంటికి తెచ్చుకున్నారు. ఆ సమయంలోనే దీనస్థితిలో ఉన్న వీధి శునకాల కోసం ఏదైనా చేయాలని ఆలోచించారు అంజలి. ఆ ఆలోచనల్లో నుంచి పుట్టిందే ‘ఈచ్ వన్ ఫీడ్ వన్’ అనే స్వచ్ఛంద సంస్థ. దక్షిణ ఢిల్లీలో ఏర్పాటైన ఈ ఎన్జీవో ‘డెలివరీ బైకు’ అనే సరికొత్త విధానంతో వీధిశునకాలకు ఆహారం అందిస్తుంది. బెక్‌పై ఉన్న వ్యక్తికి ఎక్కడ వీధిశునకాలు కనిపించినా తన దగ్గర ఉన్న ఆహారాన్ని అందించి వాటి ఆకలి తీరుస్తాడు. ఎఫ్ఐఎస్ గ్లోబల్ సొల్యూషన్స్ మేనేజర్‌గా పని చేస్తున్న అంజలి తన జీతంలో 80 శాతాన్ని ‘ఈచ్ వన్...’ కోసం వినియోగిస్తు న్నారు. తనకు తెలిసిన మిత్రుల నుంచి కూడా నిధులు సేకరిస్తున్నారు. ‘ఈ నెల ఇంత బడ్జెట్’ అని ఏ నెలకు ఆ నెల అనుకుంటున్నప్పటికీ... ఎవరో ఒకరు ఏదో ఒకరోజు గాయపడిన శునకాన్ని తీసుకువస్తుంటారు. ఇలా ఆకస్మికంగా వచ్చిన శునకాలతో ఖర్చు పెరుగుతుండడాన్ని గమనించిన అంజలి ‘ఎమర్జెన్సీ ఫండ్’ ఏర్పాటు చేశారు. కేవలం ఢిల్లీలోనే కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాలలో కూడా వీధిశునకాల కోసం తనవంతుగా ఏదైనా చేయాలనుకుంటున్నారు అంజలి. పక్షవాతానికి గురైన ఒక వీధిశునకానికి రకరకాలుగా సపర్యలు చేసి, అది మళ్లీ పరుగెత్తేలా చేశారు. ఈ ఆనందం తనకు ఎప్పటికప్పుడు ఉత్తేజాన్ని ఇస్తుంది అంటారు. గాయపడిన శునకాలను గుర్తించడానికి సహాయబృందాలను, తక్షణ వైద్యసేవలు అందించడానికి మినీ అంబులెన్స్‌లను కూడా ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నారు అంజలి.కెరీర్లో పరుగులు తప్పా మరో ఆలోచన లేని యుతకు అంజలి ఆదర్శంగా నిలిచారు.


