విటమిన్లు తగ్గితే మతిమరుపే? | Vitamin Deficiency Memory Loss Brain Health In Elderly Study | Sakshi
Sakshi News home page

విటమిన్లు తగ్గితే మతిమరుపే?

Aug 18 2026 8:01 AM | Updated on Aug 18 2026 8:01 AM

Vitamin Deficiency Memory Loss Brain Health In Elderly Study

బీపీ, షుగర్‌తోపాటు మెదడుకూ ప్రమాదమే

విటమిన్‌–డి, బీ–కాంప్లెక్స్‌ లోపమే కారణం

వృద్ధులపై ఐసీఎంఆర్‌–ఎన్‌ఐఎన్‌ పరిశోధన

వయసు పైబడు తున్న కొద్దీ వచ్చే జ్ఞాపకశక్తి సమస్యలకు, శరీరంలో ఉండే కొన్ని ముఖ్యమైన విటమిన్ల స్థాయిలకు మధ్య అత్యంత బలమైన లంకె ఉందా? అవుననే చెబుతోంది ఐసీఎంఆర్‌–జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్‌) తాజా అధ్యయనం. వృద్ధుల్లో రక్తంలోని విటమిన్‌ స్థాయిలు తగ్గడం వల్ల మెదడు పని తీరు మందగించి మతిమరుపు లేదా జ్ఞాపకశక్తి తగ్గే తొలి దశ వచ్చే ప్రమాదం ఉందని తేలింది.

అంత ర్జాతీయ మెడికల్‌ జర్నల్‌ ’న్యూట్రియెంట్స్‌’లో ప్రచురితమైన ఈ ప్రత్యేక అధ్యయనంలో భాగంగా హైదరాబాద్‌కు చెందిన 55–85సంవత్సరాల మధ్య వయసు గల 184 మంది వృద్ధులపై క్షేత్ర స్థాయిలో పరిశోధనలు జరిపారు. ఇందులో తేలిన షాకింగ్‌ నిజం ఏమిటంటే.. వీరిలో 36.4% మంది అప్పటికే జ్ఞాపకశక్తి తగ్గే ఈ తొలి దశ బారిన పడినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.

విటమిన్ల లోపమే శాపమా?
జ్ఞాపకశక్తి సమస్యలతో బాధపడుతున్న వృద్ధుల రక్త నమూనాలను పరీక్షించినప్పుడు వారిలో డీ, బీ1, బీ2, బీ6, బీ9, బీ12 విటమిన్‌ స్థాయిలు చాలా తక్కువగా ఉన్నట్లు తేలింది. ముఖ్యంగా డీ, బీ2, బీ9 విటమిన్లలో లోపాలు వీరిలో అత్యధికంగా కనిపించాయి. శరీరంలో విటమిన్‌–డీ, బీ6 స్థాయిలు సమృద్ధిగా ఉన్నవారిలో ఆలోచనా శక్తి, మానసిక పనితీరు, మెదడు చురుకుదనం చాలా మెరుగ్గా ఉన్నట్లు పరిశోధకులు కనుగొన్నారు.  అలాగే, జ్ఞాపకశక్తి సమస్యలు ఉన్న వృద్ధుల్లో కేవలం విటమిన్ల లోపమే కాకుండా, రక్తంలో చక్కెర స్థాయిలు, బీపీ కూడా చాలా ఎక్కువగా ఉన్నట్లు గమనించారు. అందువల్ల మధుమేహం, రక్తపోటు ఉన్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలని ఈ అధ్యయనం సూచిస్తోంది.

ముందస్తు జాగ్రత్తలు
వృద్ధాప్యంలో కేవలం వ్యాధుల నియంత్రణపైనే కాకుండా పోషకాహార భద్రతపై కూడా సమానంగా దృష్టి పెట్టాలని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. శరీరంలో తగినంత మొత్తంలో సూక్ష్మపోషకాలు ఉండేలా చూసుకోవడం, వయసు పైబడుతున్న వారిలో ప్రారంభ దశలోనే పోషకాహార లోపాలను గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని ఎన్‌ఐఎన్‌ బయోకెమిస్ట్రీ విభాగం అధిపతి, పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త డాక్టర్‌ జి.భానుప్రకాశ్‌ రెడ్డి తెలిపారు. మెదడు చురుకుదనాన్ని నిలుపుకుంటూ ఆరోగ్యకర వృద్ధాప్యాన్ని ఆస్వాదించడానికి ముందస్తు పోషకాహార పరీక్షలు, సకాలంలో తీసుకునే సమతుల్య ఆహారం ఎంతగానో దోహదపడతాయని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement