గర్భంతో రేస్‌లో పాల్గొనొచ్చా? నిపుణులు ఏం చెబుతున్నారంటే? | Pregnancy Fitness Hyrox Race Exercise Safety For Women | Sakshi
Sakshi News home page

గర్భంతో రేస్‌లో పాల్గొనొచ్చా? నిపుణులు ఏం చెబుతున్నారంటే?

Sep 30 2026 9:03 AM | Updated on Sep 30 2026 9:58 AM

Pregnancy Fitness Hyrox Race Exercise Safety For Women

ప్రతీకాత్మక చిత్రం (ఏఐ ఫోటో)

ప్రెగ్నెన్సీ ఫిట్‌నెస్‌

గర్భవతులు వేగంగా నడవకూడదు, పరుగెత్తకూడదు.. ఎక్కువ శ్రమ చేయకూడదు అంటుంటారు. అలాంటి ఆలోచనలను, మాటలను బ్రేక్‌ చేస్తూ ఏడునెలల గర్భంతో కఠినమైన హైరాక్స్‌ రేస్‌ను ఛాలెంజింగ్‌గా తీసుకొని పూర్తి చేసింది 37 ఏళ్ల జెన్నీఫర్‌. గర్భవతులు కూడా కఠినమైన వ్యాయామాలు చేయవచ్చు అని నిరూపించింది. ఆమె ఫిట్‌నెస్‌ ప్రెగ్నెన్సీ గురించి కొందరు అభినందించగా, మరికొందరు విమర్శిస్తున్నారు. కొందరు ప్రశ్నలు అడుగుతున్నారు. గర్భధారణ సమయంలో వ్యాయామాలు, రేస్‌ల్లో పాల్గొనవచ్చా?! నిపుణులు ఏమంటున్నారంటే...

పదిహేనేళ్లుగా ఫిట్‌నెస్‌ రంగంలో కొనసాగుతున్న జెన్నీఫర్‌ పుట్టి పెరిగింది కోల్‌కతాలో. ఫిట్‌నెస్‌ స్టూడియోని నడుపుతూ కోచ్‌గా కూడా వ్యవహరిస్తోంది. ఇప్పటివరకు కఠినమైన ‘హైరాక్స్‌’ రేసులో ఐదుసార్లు పాల్గొంది. ఈ రేస్‌ రన్నింగ్, కఠినమైన జిమ్‌ వర్కౌట్స్‌తో కలిపి ఉంటుంది.

ఇందులో 8 కిలోమీటర్ల రన్నింగ్‌తో పాటు 8 రకాల ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌లను పూర్తి చేయాలి. దీనిలో రోయింగ్, స్లైడ్‌ పుష్‌లు, బర్ఫీ బ్రాడ్‌ జంప్స్, పెద్ద పెద్ద బరువులు మోసుకుంటూ నడవడం, పరుగెత్తడం, ఆ వెంటనే బరువులతో మళ్లీ వర్కౌట్స్‌ చేయడం.. ఇలా ఈ రేస్‌ కొనసాగుతుంది. ఇటీవల ముంబైలో జరిగిన ఈ హైరాక్స్‌ రేసులో ఏడునెలల గర్భంతో జెన్నీఫర్‌ పాల్గొనడమే కాకుండా, అనుకున్న టైమ్‌లో సవాల్‌ను పూర్తిచేసి వార్తల్లో నిలిచింది.

వ్యక్తిని బట్టి మారుతాయి..
''ప్రెగ్నెన్సీ రోజుల్లో చురుగ్గా ఉండటం వల్ల సాధారణ ప్రసవం అయ్యే అవకాశం ఉంది. వారంలో 150 నిమిషాలు ఏరోబిక్‌ వ్యాయామాలు చేయవచ్చు. వాకింగ్, స్విమ్మింగ్, తక్కువ శ్రమ ఉండే వ్యాయామాలు, యోగా చేయడం మంచిదే. ప్రీ నేటల్‌ ఎక్సర్‌సైజులు, అలాగే ప్రసవం జరిగే చివరి వారాల్లో పెల్విక్‌ ఫ్లోర్‌ వ్యాయామాలు కూడా చెబుతాం. అయితే, అది కూడా ఆ మహిళ ఆరోగ్యం, గర్భధారణ పరిస్థితి, గతంలో ఆమెకు ఉన్న ఫిట్‌నెస్‌ స్థాయి, రక్తస్రావం అవడం, గర్భస్రావాల రిస్క్, ప్లాసెంటా స్థాయి, యుటెరస్‌ లో లేయరింగ్‌ ... ఇవన్నీ పరిగణలోకి తీసుకొని సూచనలు చేస్తాం.''

– డాక్టర్‌ శిరీషారెడ్డి, గైనకాలజిస్ట్‌

అవగాహన తప్పనిసరి..
''గర్భం దాల్చినా, అనారోగ్యం ఉన్నా... వ్యాయామం లేదా ఇతరత్రా ఫిట్‌నెస్‌ కాంటెస్ట్‌లలో పాల్గొనవచ్చు. అయితే ప్రెగ్నెంట్‌ అవక ముందు కూడా తగినంత ప్రాక్టీస్‌ ఉండాలి. అలా కాకుండా ఎవరో చేశారు కదా అని తామూ చేయవచ్చునని అనుకోకూడదు. నటి సమంత మయోసైటిస్‌ని ఎదుర్కొన్నారు. ఆ వ్యాధితో పోరాడుతూ కూడా వ్యాయామం మానలేదు.

ప్రస్తుతం ప్రెగ్నెంట్‌ అయ్యారు కూడా.  ఆఫీస్‌ వర్క్‌ ఎంత రొటీన్‌గా చేస్తామో.. అలాగే ప్రెగ్నెన్సీ తర్వాత కూడా యోగా, మారథాన్‌  రన్నింగ్, స్విమ్మింగ్, ... వంటివి చేయవచ్చు. దీని వల్ల అదనపు లాభం ఏమిటంటే కడుపులో ఉన్న బిడ్డకు కూడా శిక్షణ ఇవ్వవచ్చు. అయితే గైనకాలజిస్ట్‌ , ఫిట్‌నెస్‌ ట్రై నర్‌ల పర్యవేక్షణ, సలహా సంప్రదింపులు కూడా అవసరమే.''
– సౌమ్య కస్తూరి, ఫిట్‌నెస్‌ కన్సల్టెంట్, ఫిజియో థెరపిస్ట్‌ 

గర్భవతుల్లో ఎవరు జాగ్రత్తగా ఉండాలంటే... 
జెన్నీని స్ఫూర్తిగా తీసుకొని ఆరోగ్యంగా, చురుగ్గా ఉండటానికి ప్రయత్నించడం మంచిదే. కానీ, ఆమెలా ప్రతి గర్భిణీకీ అదే తరహా వ్యాయామం సాధ్యమవుతుందని కాదు. గర్భధారణకు ముందు నుంచే ఫిట్‌నెస్‌ ట్రైనింగ్‌ చేస్తున్న మహిళ శరీరం, మొదటిసారి వ్యాయామం మొదలుపెట్టే మహిళ శరీర సామర్థ్యం ఒకేలా ఉండదు.

హైరాక్స్‌ రేస్‌లో జెన్నీఫర్‌

  • హైరిస్క్‌ ప్రెగ్నెన్సీ, కొన్ని ప్లాసెంటా సమస్యలు, నిర్దిష్ట రక్తపోటు సమస్యలు, ప్రీ టర్మ్‌ లేబర్‌ పెయిన్స్, నిరంతర బ్లీడింగ్‌.. వంటి పరిస్థితుల్లో వ్యాయామంపై వైద్యుల ప్రత్యేక సూచన తప్పనిసరి.

  • గర్భవతులకు ఓ మోస్తరు శారీరక కదలికలు ఉండాలి. వ్యాయామం, యోగా చేస్తుండగా బ్లీడింగ్, కడుపునొప్పి,  ఛాతీనొప్పి, తల తిరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, పిండం కదలికలు తగ్గడం వంటి లక్షణాలు ఏవి కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించాలి.

కాపీ క్యాట్‌ కావద్దు..
సెలబ్రిటీలు లేదా ఫిట్‌నెస్‌ ఇన్‌ ఫ్లుయెన్సర్లు గర్భధారణ సమయంలో చేసే వర్కౌట్స్‌ను చూసి వాటిని అనుసరించడం సరికాదు. నిపుణుల సూచన కూడా ఇదే. ప్రెగ్నెన్సీ ఫిట్‌నెస్‌ అనేది ఎవరికి వారికి పూర్తిగా వ్యక్తిగతమైనది. ఒకరికి వాకింగ్‌ సరిపోవచ్చు. మరొకరికి స్విమ్మింగ్‌ లేదా తేలికపాటి స్ట్రెంగ్త్‌ ట్రైనింగ్‌ వ్యాయామాలు సరిపోవచ్చు.

ఇప్పటికే ఫిట్‌గా ఉన్న మహిళకు కొన్ని మోడర్న్‌ వ్యాయామాలను మార్పులతో కొనసాగించే అవకాశం ఉండొచ్చు. కానీ ప్రతి సందర్భంలోనూ తల్లి, బిడ్డ ఆరోగ్య పరిస్థితే ఇందులో ప్రధానమైనది. గర్భంతో ఉన్నప్పుడు కూడా చురుకుగా ఉండటానికి ప్రయత్నించాలి. అంతేకానీ సామర్థ్యాన్ని నిరూపించుకోవాలనే ఒత్తిడి సరైనది కాదు.

గర్భంతో ఉన్నప్పుడు చురుగ్గా ఉండటానికి ఇలాంటి వార్తలను స్ఫూర్తిగా తీసుకోవచ్చు. కానీ, ఎవరో చేశారు కదా అని ప్రతి గర్భిణీ అదే స్థాయిలో వ్యాయామం చేయాలనుకోవడం సరైనది కాదు. ప్రెగ్నెన్సీ ఫిట్‌నెస్‌లో ‘ఎంత ఎక్కువ వ్యాయామాలు చేశాం’ అనేది కాదు.. ‘మన శరీరానికి ఆ వ్యాయామం ఎంత సురక్షితం’ అనేదే గ్రహించాలి.
– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి

ఇదీ చదవండి: ఐటీ ఉద్యోగం వదలి ఆటో డ్రైవర్‌గా మహిళా టెకీ..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement