సడన్‌ హార్ట్‌ ఎటాక్‌.. ముందస్తు సంకేతాలివేనా? | World Heart Day: Young Age Heart Attack Causes, Warning Signs | Sakshi
Sakshi News home page

సడన్‌ హార్ట్‌ ఎటాక్‌.. ముందస్తు సంకేతాలివేనా?

Sep 29 2026 1:11 PM | Updated on Sep 29 2026 1:16 PM

World Heart Day: Young Age Heart Attack Causes, Warning Signs

అవయవ ఆరోగ్యంపై అశ్రద్ధతోనే హృదయ వేదన

వయసుతో నిమిత్తం లేకుండా గుండెజబ్బులు

పెరుగుతున్న గుండె సంబంధిత రోగుల సంఖ్య

ముప్పు ముంచుకొచ్చేవరకూ ఉండొద్దంటున్న కార్డియాలజిస్టులు

నేడు ప్రపంచ గుండె దినోత్సవం

మానవ శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవం హృదయం.. అయితే అవయవ ఆరోగ్యంపై అశ్రద్ధతోనే హృదయం ఒత్తిడి, వేదనకు గురవుతోంది.. అవయవ ఆరోగ్యంపై చాలామంది అశ్రద్ధ వహిస్తుంటారు. ఫలితంగా గుండెపోటు మరణాలు చోటు చేసుకుంటున్నాయి. వయసుతో నిమిత్తం లేకుండా గుండెజబ్బులు చోటు చేసుకుంటున్నాయి.. ఫలితంగా గుండె సంబంధిత రోగుల సంఖ్య పెరుగుతోంది.

అయితే ముప్పు ముంచుకొచ్చే వరకూ వేచి ఉండొద్దని కార్డియాలజిస్టులు అంటున్నారు.. గుండె ఆరోగ్యంపై ప్రజలను చైతన్యపరిచేలా ఏటా సెప్టెంబర్‌ 29న ప్రపంచ హృదయ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఒకప్పుడు వయస్సు పైబడిన వారిలో మాత్రమే కనిపించే గుండెపోటు... ప్రస్తుతం చిరు ప్రాయంలో ఉన్న వారిలోనూ బహిర్గతమవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. మానసిక ఒత్తిడి, మద్యపానం, మారిన ఆహారపు అలవాట్లే ఇందుకు కారణంగా వైద్య నిపుణులు చెప్తున్నారు. అంతేకాక కరోనా విపత్కర పరిస్థితుల తర్వాత ఈ కేసుల సంఖ్య పెరిగినట్లు పేర్కొంటున్నారు.

పెరుగుతున్న బాధితులు..
గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారి సంఖ్య క్రమేణా పెరుగుతున్నట్లు ఇటీవలి అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాలతో పోల్చుకుంటే పట్టణ ప్రాంతాల్లో గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారి సంఖ్య అధికంగా ఉన్నట్లు అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.

మారిన అలవాట్లతో ముప్పు..
ఆధునిక సాంకేతికత పెరిగిన ప్రస్తుత రోజుల్లో శారీరక శ్రమ పూర్తిగా తగ్గిపోయింది. యాంత్రిక జీవనానికి అలవాటు పడడంతో ప్రతి ఒక్కరిలోనూ మానసిక ఒత్తిళ్లు అధికమయ్యాయి. పట్టుమని 15 ఏళ్లు కూడా దాటకుండానే బీపీ, షుగర్, ఊబకాయం వంటి సమస్యలు చుట్టుముడుతున్నాయి. అయితే శారీరకంగా ఎంతో ఫిట్‌గా ఉన్న వారు కూడా గుండెపోటు బారిన పడుతుండడం మరింత ఆందోళనకరం. గుండె పనితీరు తెలుసుకునేందుకు ఏడాదికి ఒక్కసారైనా వైద్యు లను సంప్రదించాలని నిపుణులు చెప్తున్నారు.

ముందుగా గుర్తించడం కష్టం 
గుండె జబ్బు మన శరీరంలో ఉన్నా.. ముందస్తుగా గుర్తించలేనంత నిశ్శబ్దంగా ఉంటుంది. ధూమపానం, మద్యపానం, జంక్‌ ఫుడ్‌కు దూరంగా ఉండడం మంచిది. క్రమం తప్పకుండా సరైన వ్యాయామం చేస్తుండాలి. ఛాతీలో బరువు, ఒత్తిడి, నొప్పి, ముఖ్యంగా నడిచేటప్పుడు, పని చేసినప్పుడు గుండెలో మంటగా అనిపిస్తే జాగ్రత్త పడాలి. ఆకస్మాత్తుగా ఆయాసం, విపరీతమైన చెమటలు, వికారం, తల తిరగడం, స్పృహ తప్పడం, తీవ్రమైన నీరసం కూడా గుండెపోటుకు సంకేతాలు కావచ్చు. గుండె సహాయం కోరే వరకూ వేచి ఉండకుండా ఏడాదిలో ఒకట్రెండు సార్లు వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి.

చిన్నవయసులోనే గుండెపోటుతో చనిపోతున్న వారి సంఖ్య  ఇటీవలి కాలంలో బాగా పెరిగిపోయింది. చలాకీగా తిరుగుతూ.. పైకి బాగా కన్పించేవారు సైతం ఉన్నట్టుండి గుండెపోటుకు గురవుతున్నారు. జీవనశైలి మార్పులు, సరైన అవగాహనతోనే ఇలాంటి పరిస్థితిని అధిగమించవచ్చునని వైద్యనిపుణులు చెబుతున్నారు.

– డాక్టర్‌ జి. ప్రదీప్‌కృష్ణ, కార్డియాలజిస్ట్, అనంతపురం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement