అందానికి నగలు అవసరమా? ఈ సుభాషితం ఏం చెబుతుందంటే.. | True Beauty Is In Good Words Kindness And Generosity | Sakshi
Sakshi News home page

అందానికి నగలు అవసరమా? ఈ సుభాషితం ఏం చెబుతుందంటే..

Sep 29 2026 8:05 AM | Updated on Sep 29 2026 9:36 AM

True Beauty Is In Good Words Kindness And Generosity

సౌందర్యం అంటే కన్ను, ముక్కుతీరు బాగుండటం, శరీర రంగు బాగుండటం, ఆకర్షించే రూపం కలిగి ఉండటం అని పైకి తోచే అర్థం. ఇది బాహ్య సౌందర్యం. కానీ, మంచి మాటలు వినటం వల్ల చెవికి అందం వస్తుంది.

అంతేగానీ అందమైన, ఖరీదైన కుండలాలు పెట్టుకోవటం వల్ల రాదు. చక్కనైన, ఆకర్షణీయమైన బంగారు కంకణాలు ధరించటం వల్ల చేతికి అందం రావచ్చునేమోగానీ ఆ చేయి అవసరార్థులకు ఉచిత రీతిన దానం చేసినప్పుడు ఆ చేయి అందం ద్విగుణీకృతం, త్రిగుణీకృతం అవుతుంది. తమ దగ్గరున్నది ఇతరులకు ఇవ్వటంలో అంతులేని తృప్తి, ఆనందం, మానసిక ప్రశాంతత లభిస్తాయి. బలి, కర్ణుడు, రంతిదేవుడు వంటివారు తమ దానాలతో అటువంటి తృప్తి, ఆనందం పొందినవారే. ఆనందం ఉన్నప్పుడు సౌందర్యం ఇనుమడిస్తుంది.

గంధపు పూతలు, పన్నీటి జలాలతో దేహం కాంతిమంతంగా ఉంటుంది. ఆ దేహం గల మనసులో సాటివారి పట్ల దయ, కరుణ ఉంటే ఆ దేహం మరింత ప్రకాశిస్తుంది. పరోపకారం, మంచితనం అనే గుణాల వల్ల ముఖం తేజోమంతంగా ఉంటుంది. అదే సహజ సౌందర్యం. బాహ్య రూపం కన్న అంతర్గతమైన ఈ లక్షణాలే మనిషికి అందాన్నిస్తాయని ‘శ్రోత్రం శృతే నైవ నతు కుండలేన’ అనే ప్రసిద్ధ సంస్కృత సుభాషితం చెపుతుంది.

మంచి మాటలు, సంస్కారవంతమైన మాటలు, చక్కని మాటతీరు మంచి వ్యక్తిత్వానికి నిదర్శనం. ఆవేశంలో, తీవ్రమైన కోపంలో కూడా సంయమనం పాటించి, మాటను నియంత్రించుకుని వ్యక్తం చేసేవారికి వాక్‌ భూషణమే నిజమైన భూషణం. కృత్రిమమైన అలంకారాలు, పైపై మెరుగులు సహజ సౌందర్యానికి సాటి రావు.
– డా. చెంగల్వ రామలక్ష్మి

ఇదీ చదవండి: హృదయ సామ్రాజ్ఞి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement