మరోసారి ఫూలన్‌ | Canadian director Richie Mehta brought her story back to screen as Phoolan | Sakshi
Sakshi News home page

మరోసారి ఫూలన్‌

Sep 30 2026 4:07 AM | Updated on Sep 30 2026 4:07 AM

Canadian director Richie Mehta brought her story back to screen as Phoolan

ఆ బందిపోటు రాణిని చరిత్ర మర్చిపోలేదు. ప్రజలు మర్చిపోలేదు. ఆమె పోరాటానికి బొమ్మా బొరుసూ ఉన్నాయి. ఆమె జీవితానికి మంచీ చెడూ ఉన్నాయి. శేఖర్‌ కపూర్‌ తీసిన ‘ఫూలన్‌ దేవి’తర్వాత ఇన్నేళ్లకు కెనెడియన్‌ దర్శకుడు రిచీ మెహతా ఆమె కథను మళ్లీ ‘ఫూలన్‌’గా తెరపైకి తెచ్చాడు. ఈ దేశంలో ఆడపిల్లలపై దాడులు ఇంకా ఆగలేదు. కులం పేరుతో వేధింపులు ఇంకా ఉన్నాయి. అవి ఉన్నంతకాలం ఫూలన్‌ స్క్రీన్‌లైఫ్‌ ఉంటుంది. టొరెంటో ఫెస్టివల్‌లో స్టాండింగ్‌ ఒవేషన్‌ పొందిన ఈ సినిమా అమేజాన్‌లో రానుంది.

‘మేము ఫూలన్  ను ఎక్కడా జాలిపడాల్సిన బాధితురాలిగా చూపించలేదు. ఆమె ఒక శక్తిమంతమైన తిరుగుబాటుదారు. ‘నిర్భయ’ ఘటన తర్వాత కూడా మన సమాజంలో మహిళలపై హింస మారలేదు. అందుకే ఈ కథ ఇప్పుడు ప్రపంచానికి చెప్పడం చాలా అవసరం అనుకున్నాను’ అన్నారు దర్శకుడు రిచీ మెహతా. 

‘ఢిల్లీ క్రైమ్‌’, ‘పోచర్‌’ సిరీస్‌ ద్వారా గుర్తింపు పొందిన ఈ కెనెడియన్‌ దర్శకుడు ఫూలన్‌ను మళ్లీ తెర మీద చూపగలనా లేదా అనే నిర్ణయానికి ఐదేళ్ల సమయం తీసుకున్నారు. ఫూలన్‌ ఆత్మకథ ‘ఐ, ఫూలన్‌: ది ఆటోబయోగ్రఫీ ఆఫ్‌ ఇండియాస్‌ బాండిట్‌ క్వీన్‌’ ఆయన మనసు మార్చింది. ‘ఆ పుస్తకం చదివాక ఫూలన్‌ తనను తాను ఎలా శక్తిమంతం చేసుకుందో ఈ తరానికి చెప్పాలనుకున్నాను’ అన్నారు.

దాదాపు కొత్తవాళ్లతో రిచీ మెహతా తీసిన ‘ఫూలన్‌’ ఇటీవల టొరెంటో ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రేక్షకులను, విమర్శకులను విపరీతంగా ఆకట్టుకుంది. అమేజాన్‌లో త్వరలో విడుదల కానుంది.

పిడకలు కొట్టిన చేతులు
చంబల్‌లోయలో పిడకలు కొట్టి జీవనం సాగించక తప్పనిస్థితిలో ఉన్న కుటుంబంలో పుట్టిన ఫూలన్‌ దేవి కథ దేశానికే కాదు ప్రపంచానికి కూడా ఒక పెద్ద రాజకీయ, సాంస్కృతిక ప్రహేళిక. కులం, ధనం, అధికారం ఎలా పీడన సాగిస్తుందో దాని నుంచి తిరుగుబాటు ఎలా చెలరేగుతుందో ఫూలన్‌ దేవి కథ చెప్తూనే ఉంటుంది. దురదృష్టవశాత్తూ ఆమె జీవించి ఉండగా ఆమెను బాధ పెట్టిన కాలం ఇంకా ఉంది.

ఆ పరిస్థితులు ఇంకా అలాగే ఉన్నాయి. ఆమెలా తిరుగుబాటు చేయదగ్గ స్థితి స్త్రీలకు ఎదురవుతూనే ఉంది. అందుకే ఫూలన్‌ దేవి కథ మళ్లీ మళ్లీ ప్రజల ముందుకు వస్తూనే ఉంది. చిన్న వయసులో పెళ్లి, ఆ తర్వాత బందిపోట్ల కిడ్నాప్, వైవాహిక జీవితంలో హింస, పై కులాల హింస... వీటన్నింటినీ తట్టుకుని బదులుగా రక్తమార్గం ఎంచుకుని చివరకు మెయిన్‌ స్ట్రీమ్‌ పాలిటిక్స్‌లోకి వచ్చినా 37 ఏళ్ల వయసులో హత్యకు గురయ్యి లోకాన్ని వీడాల్సి వచ్చింది. ఒక వర్గానికి ఆమె ‘దుర్గా మాత’. మరో వర్గానికి ‘క్రూరమైన బందిపోటు’. కాని వాస్తవం పూర్తిగా అటుగాని ఇటుగాని ఉండదు. మధ్య  పొరల్లో దాగి ఉంటుంది. 

ఇంట్లో చెప్పకుండానే...
‘ఫూలన్‌’ పాత్ర కోసం పెద్ద ఎత్తున ఆడిషన్స్‌ జరిగాయి. మధ్యప్రదేశ్‌ ప్రాంతానికి చెందిన అమ్మాయిలకు స్క్రీన్‌టెస్ట్‌ జరిగింది. ఝాన్సీకి చెందిన స్నేహకుమారి కూడా ఆడిషన్‌ ఇచ్చింది. అయితే సెలెక్ట్‌ కాలేదు. ఆడిషన్‌లో చేసిన తప్పులను సరి చేసుకొని నెల తర్వాత మళ్లీ వీడియో రికార్డు చేసి పంపితే ఈసారి సెలెక్ట్‌ అయ్యింది. స్నేహకుమారిది పేద కుటుంబం. తల్లిదండ్రులు నిరక్షరాస్యులు. ఇలా ఫూలన్‌దేవి పాత్ర కోసం వెళుతున్నానని చెప్తే వాళ్లు భయపడతారని చెప్పకుండా షూటింగ్‌కు వెళ్లింది స్నేహకుమారి. ఆమెకు అన్నయ్య, వదినలే తోడు నిలిచారు.

అయితే ఫూలన్‌గా ఆమె నటించిన తీరు ఇప్పుడు ఆమెకు అంతర్జాతీయ గుర్తింపు తెస్తోంది. తూటాల పట్టీ ఉన్న ఖాకీ యూనిఫామ్, తలకు ఎర్రవస్త్రం, చేతిలో తుపాకీ... ఫూలన్‌ దేవి రూపం ఎన్నాళ్లయినా చెరపలేనిది. 

ఏనాడో బతికి, ఏనాడో చనిపోయిన ఫూలన్‌ ఇంకా ఎందుకు మనల్ని వెంటాడుతోంది? ఎందుకంటే ఆమె కథ కేవలం ఒక వ్యక్తి కథ కాదు. అధికారం, కులం, లింగ వివక్ష అనే చట్రాల మధ్య నలిగిన ప్రతి ఆడపిల్ల కథ. 11 ఏళ్లు జైలు, రెండుసార్లు ఎంపీ, 2001లో ఢిల్లీలో హత్య... ఆమె జీవితం అన్నీ మలుపులే. అందుకే ఆమె జీవితంలోని రెండు రోజులు కూడా ఒక సినిమాగా మారి ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది. ఆమె ఇప్పటికీ సంచలనమే, ఇప్పటికీ స్ఫూర్తే.             

48 గంటల కథ
రిచీ మెహతా ‘ఫూలన్‌’లో ఫూలన్‌దేవి జీవితం మొత్తం చూపలేదు. ఫూలన్‌దేవి తన మీద జరిగిన సామూహిక అత్యాచారానికి బదులుగా 1981 ఫిబ్రవరి నాటి బెహ్మయ్‌ ఊచకోతలో పాల్గొందని ఒక అభియోగం. ఆమె బృందం ఆ రోజు చేసిన హత్యాకాండలో 20 మంది మృతి చెందారు. వారిలో అత్యధికులు ఠాకూర్లు. దాంతో ప్రభుత్వం మీద తీవ్ర ఒత్తిడి వచ్చింది. 

సాక్షాత్తు ప్రధాని ఇందిర జోక్యం చేసుకోవడంతో మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌ పోలీసులు బలగాలు వేలాదిగా ఆమెను వెతికాయి. అలాంటి సందర్భంలో (1981 మార్చి 31 కావచ్చు) ఒక చిన్న ఊరిలో దాదాపు వందల మంది పోలీసులు ఆమెను చుట్టుముట్టారు. అయితే కేవలం ఇద్దరు సహాయకులతో ఆమె తప్పించుకుందనీ ఆ సందర్భంలో ఆమె చేసిన 48 గంటల పోరాటం మాత్రమే ఈ సినిమా కథగా చూపానని దర్శకుడు తెలియజేశారు.

  – కె.    

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement