గురుశిష్య సంబంధం.. | Guru Shishya Bond Ramakrishna Vivekananda Spiritual Life Lessons | Sakshi
Sakshi News home page

గురుశిష్య సంబంధం..

Sep 30 2026 8:04 AM | Updated on Sep 30 2026 8:04 AM

Guru Shishya Bond Ramakrishna Vivekananda Spiritual Life Lessons

జ్యోతిర్మయం

భారతీయ సంస్కృతిలో శిష్యుడు గురువు పట్ల అత్యంత వినయాన్ని కనబరచటం కనబడుతుంది. కానీ కొంతమంది ప్రఖ్యాత గురుశిష్యుల విషయంలో భిన్నమైన ధోరణిని కూడా మనం చూడవచ్చు. రామకృష్ణ పరమహంస – వివేకానందలను చూస్తే ‘గురువు’నన్న ఆధిక్యతను రామకృష్ణుడు కనబరచినట్టుగానీ, ’శిష్యుడ’నన్న విధేయతను వివేకానంద చూపినట్టుగానీ లేదు. ‘నువ్వు చెప్పిందంతా నమ్మటానికి, నువ్వు చెప్పినట్లంతా చేయటానికి నేను రాలేదు’ అని వివేకానందుడు అనేవాడు.

‘కంసాలి బంగారు నాణ్యతను ఎలా పరీక్షించి నిర్ణయిస్తాడో, నీవు అలాగే పరీక్షించు నా మాటల్ని’ అని రామకృష్ణుడు చెప్పేవాడు. ఒకోసారి వాదించుకునేవారు. ఒకోసారి అలిగి మాట్లాడుకునేవారు కారు. ఒకోసారి వివేకానందుని ఎదుట రామకృష్ణుడే చేతులు జోడించి నిల్చునేవారు. ‘నీవు అలా చేస్తే లోకులు నిన్ను పిచ్చివాడు అంటారు చూడు’ అని వివేకానందుడు వారించేవాడు. వారిద్దరి మధ్య ప్రేమ, అభిమానం లేదనగలమా? వారిని గురుశిష్యులుగా అంగీకరించక ఉండగలమా?

తావో మతానికి చెందిన ప్రముఖ గురువు లావోజు. ఆయన వద్దకు చువాంజు వచ్చాడు. ‘నీవు నాకు శిష్యుడిగా ఉండటానికి వచ్చావా లేక గురువుగా ఉండటానికి వచ్చావా?’ అన్నాడు లావోజు. ‘గురువు, శిష్యుడు అనే ఆ చెత్త మాటల్ని కట్టిపెట్టి మనమిద్దరం కలిసి ఉండలేమా?’ అన్నాడు చువాంజు. లావుజు నవ్వి ‘చాలా మంచి మాట చెప్పావు. అలాంటి వారే నాకు ఇష్టం, అట్లే ఉందాం’ అన్నాడు. చువాంజు వెంటనే లావోజు పాదాలకు నమస్కరించాడు.

‘ఏమి చేస్తున్నావ్‌?’ అన్నాడు లావోజు. ‘మీ కాళ్లకు నమస్కరించాలని అనిపించింది, నమస్కరించాను. దానికి వినయం, విధేయత లాంటి పేర్లు పెట్టాల్సిన పనిలేదు. ఏమి చేయాలనిపిస్తే అలా చేస్తాను. సాక్షులుగా మనమిద్దరం దాన్ని గమనిద్దాం అంతే’ అన్నాడు చువాంజు. (పుట 314, గ్లింప్సెస్‌ ఆఫ్‌ ఎ గోల్డెన్‌ చైల్డ్‌హూడ్‌– ఓషో)
– రాచమడుగు శ్రీనివాసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement