ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా గంగోత్రి నీటి సీసాల బట్వాడా
ఉత్తర్‌కాశీలో ప్రత్యేక బాటిలింగ్ ప్లాంట్ ఏర్పాటు చేసిన తపాలా శాఖ
శ్రావణమాసంలో 20 లక్షల సీసాలు సరఫరా టార్గెట్
సాక్షి, హైదరాబాద్: తపాలా గంగాజలం... ఇప్పుడు మన దేశంలోనే కాదు..విదేశాల్లోని భారతీయుల ఇళ్లకూ బట్వాడా అవుతున్న పూజా నీళ్లు. హిమాచల్‌ప్రదేశ్‌లోని గంగోత్రి వద్ద గంగానది నుంచి సేకరించిన నీటిని శుద్ధి చేసి కోరుకున్న భక్తుల ఇళ్లకు భద్రంగా చేరుస్తోంది. ఇందుకోసం ఏకంగా సొంతంగానే బాటిలింగ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసి, ఇప్పుడు దాన్ని తపాలా సేవల్లో ముఖ్యమైందిగా మార్చుకుంది. ఈ శ్రావణమాసంలో 20 లక్షల గంగా జలం నీటి సీసాలను ప్రపంచవ్యాప్తంగా బట్వాడా చేయాలనుకుంటోంది. పోస్టల్ డిపార్ట్‌మెంట్ ఈ క్రియాశీల ‘సర్వీసు’వెనుక హైదరాబాద్ తపాలా అధికారుల ఓ చిన్న ప్రయోగం ప్రేరణగా నిలవటం విశేషం.
⇒ తపాలా కార్యాలయంలో 250 మి.లీ. పరిమాణంలోని నీటి సీసా ధర రూ.30. దీన్ని ఇంటికి తెప్పించుకోవాలంటే రూ.121 పోస్టల్ చార్జీ అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
⇒ రెండు సీసాలతో కూడిన ప్యాక్ ఆర్డర్ ఇస్తే చార్జి రూ.201
⇒ నాలుగు సీసాల ప్యాక్ పోస్టల్ చార్జి రూ.321
గోదావరి పుష్కరాలతో...: అది 2015... గోదావరి పుష్కరాలను నాటి రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. అయితే గోదావరికి చాలా దూరంలో ఉన్న వారు... 12 ఏళ్లకోసారి వచ్చే పవిత్ర పుష్కర స్నానాలు చేయలేకపోతున్నామన్న ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని గమనించిన నాటి తెలంగాణ సర్కిల్ తపాలాశాఖ అధికారులు, గోదావరి నీటిని శుద్ధి చేసి సీసాల్లో నింపి అలాంటి వారి ఇళ్లకే చేర్చే ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
దీనికి అనూహ్య స్పందన వచ్చింది. ఏడున్నర లక్షల ఆర్డర్లు రావటం విశేషం. విదేశాల నుంచి కూడా భక్తులు తపాలా ద్వారా ఈ సీసాలను ఆర్డర్ ఇచ్చారు. అప్పట్లో ఈ నిర్ణయాన్ని తపాలాశాఖ ఉన్నతాధికారులు అభినందించారు. గోదావరి నీటిని భక్తులకు బట్వాడా చేసినట్టుగానే గంగానది నీటిని అందిస్తే ప్రజల్లో తపాలాశాఖకు ఆదరణ పెరుగుతుందని నిర్ణయించి వెంటనే దాన్ని అమలులోకి తెచ్చారు. ఇందుకోసం అధికారులు గంగానది నీటిని కూడా సరఫరా ప్రారంభించారు.
గంగోత్రి నుంచి ఇంటి గడప వరకు..
హైదరాబాద్‌లో ఒక చిన్న ప్రయోగంగా మొదలైన ఈ సేవ, ఇప్పుడు దేశవ్యాప్తంగా 4,116 పోస్టాఫీసుల్లో అందుబాటులో ఉంది. తొలుత గంగోత్రి, రిషికేశ్‌ల నుంచి గంగానది నీటిని సేకరించి 250 మి.లీ. పరిమాణంలోని సీసాల్లో నింపి తపాలా కార్యాలయాల్లో అమ్మకానికి పెట్టింది. తర్వాత గంగోత్రి నుంచి మాత్రమే నీటి సేకరణను పరిమితం చేసింది. హిమాచల్‌ప్రదేశ్‌లోని ఉత్తర్‌కాశీలో ప్రత్యేకంగా గంగాజల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది.
అయితే, ఇది సాధారణ తాగునీటిగా వాడేందుకు కాదన్న సంకేతాలనైతే ఇచ్చింది. ఉత్తర్‌కాశీలోని బాట్లింగ్ ప్లాంట్ సామర్థ్యం 8 గంటల ఒక షిఫ్ట్‌కు 6,400 బాటిళ్లు (1,600 లీటర్లు). ఈ లెక్కన ఏడాదికి 23 లక్షలకు పైగా బాటిళ్లు ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. తాజాగా శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని తెలంగాణ వ్యాప్తంగా ఎంపిక చేసిన పోస్టాఫీసుల్లో ఆ సీసాలను అందుబాటులో ఉంచారు.


