అపార్ట్‌మెంట్ నాణ్యతపై అనుమానాలు
ఏడంతస్తుల భవనం కూలిన ఘటన
జయదర్శిని రెసిడెన్సీపై పడిన శిథిలాలు
సీఎంసీ నివేదిక అనుకూలంగా వస్తేనే ఊరట
లేనిపక్షంలో భవనం ఖాళీ చేయాల్సిందే
హైదరాబాద్: అంజయ్యనగర్‌లో 50 గజాల విస్తీర్ణంలో చేపట్టిన భవనం పేకమేడలా కుప్పకూలి పక్కనున్న జయదర్శిని రెసిడెన్సీపై పడటంతో ఆ అపార్ట్‌మెంట్ నాణ్యతపై అనుమానాలు నెలకొన్నాయి. నాణ్యత ప్రమాణాలు పాటించి జయదర్శిని రెసిడెన్సీ నిర్మాణం చేపట్టారని చెబుతున్నప్పటికీ ఐదో అంతస్తుపై ఉన్న స్లాబ్ ధ్వంసం కావడంతో పార్కింగ్‌లోని రెండు పిల్లర్లకు నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.
శిథిలాలను పూర్తిగా తొలగించిన అనంతరం సీఎంసీ నుంచి నిపుణులైన ఇంజినీర్లు పిల్లర్ల నాణ్యతను పరిశీలించనున్నారు. వారిచ్చే నివేదిక ఆధారంగానే తదుపరి రెసిడెంట్స్ నిర్ణయాన్ని తీసుకుంటారు. భవనం కూలి మీద పడటంతో ఐదు ఫ్లాట్లలో మాస్ట్ బెడ్ రూమ్‌లు, బాత్ రూమ్‌లు, కిచెన్‌లు, పార్కింగ్‌లోని పిల్లర్లు, ఐదో అంతస్తులోని స్లాబ్ దెబ్బతిన్నాయి. ముందు జాగ్రత్త చర్యగా హైడ్రా, పోలీసు అధికారులు 10 సీ బ్లాక్‌లో 10 ఫ్లాట్లను, బి బ్లాక్‌లోని మరో 10 ఫ్లాట్లను ఆదివారం ఖాళీ చేయించారు.


