కొండా సురేఖ ఇష్యూ.. రేవంత్‌ కీలక భేటీ! | Revanth Reddy's Crucial Meet: Konda Surekha Row Takes Centre Stage | Sakshi
Sakshi News home page

కొండా సురేఖ ఇష్యూ.. రేవంత్‌ కీలక భేటీ!

Aug 24 2026 10:29 AM | Updated on Aug 24 2026 10:46 AM

Revanth Reddy's Crucial Meet: Konda Surekha Row Takes Centre Stage

సాక్షి, హైదరాబాద్‌: విదేశీ పర్యటన రద్దు తర్వాత హైదరాబాద్‌కు తిరిగొచ్చిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. రాష్ట్ర కాంగ్రెస్‌లో నెలకొన్న పరిణామాలపై దృష్టి సారించారు. సాయంత్రం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆయన సమావేశం కానున్నారు. ఈ భేటీలో మంత్రి కొండా సురేఖ వ్యవహారం, పార్టీలో క్రమశిక్షణ అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించడంతో సీఎం రేవంత్‌రెడ్డి తన విదేశీ పర్యటనను కుదించుకుని లండన్‌ నుంచి తిరిగి వచ్చారు. అమెరికా పర్యటనకు రాజకీయ అనుమతి లభించలేదని కేంద్ర విదేశాంగ శాఖ వెల్లడించగా.. కాంగ్రెస్‌ పార్టీ ఈ పరిణామాలపై తీవ్రస్థాయిలో మండిపడింది. దీనిపై తిరిగి వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతానని సీఎం రేవంత్‌ అన్నారు. 

ఇక రాష్ట్ర కాంగ్రెస్‌లో మంత్రి కొండా సురేఖ ఫ్యామిలీ వ్యవహారం కూడా చర్చనీయాంశంగా మారింది. కొండా సురేఖ కూతురు సుస్మిత పటేల్‌(చిట్టక్క) సీఎం రేవంత్‌ రెడ్డికి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడడాన్ని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తట్టుకోలేకపోతున్నారు. కూతురి వ్యాఖ్యలను ఖండించకపోగా.. నాకేం సంబంధం అన్నట్లు సురేఖ మాట్లాడటాన్ని కూడా అంగీకరించడం లేదు. ఇప్పటికే ఈ విషయమై క్రమశిక్షణా కమిటీకి వాళ్లంతా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సీఎంతో తమ అభిప్రాయాలను పంచుచుకోనున్నారు. 

మరోవైపు.. కొండా సురేఖ ఎపిసోడ్‌తో పాటు వనపర్తిలో చిన్నారెడ్డి-ఎమ్మెల్యే మేఘారెడ్డి, ఆదిలాబాద్‌ నేతలు కంది శ్రీనివాస్‌రెడ్డి-అల్లూరి సంజీవరెడ్డి గొడవ, అలాగే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యవహారంపై కూడా చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇటు.. కూతురు కొండా సుస్మిత వ్యాఖ్యలతో కొండా సురేఖ చిక్కుల్లో పడ్డారు. వివరణ కోరుతూ పీసీసీ ఆమెకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. దీంతో ఆమె నిన్న బెంగళూరు వెళ్లి ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గేను కలిశారు. గంట పాటు వీళ్ల మధ్య భేటీ జరిగింది. మరోవైపు ఈ పరిణామాల మధ్య మంత్రి కొండా సురేఖ ఇవాళ సీఎంను కలుస్తారనే ప్రచారం సాగుతోంది. తన శాఖ సమీక్ష కోసం ఆమె సచివాలయానికి చేరుకునే అవకాశం ఉంది.

దీంతో ఈ వరుస భేటీలపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. సాయంత్రం ప్రజాప్రతినిధులతో సమావేశం అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. ఆయన స్పందిస్తారనే ఆసక్తి నెలకొంది.

ఇదీ చదవండి: కొండా ఫ్యామిలీ వ్యవహారం.. ఏం చేస్తే ఏమవునో?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement