హైదరాబాద్: ప్రభుత్వ పథకాలపై తెలంగాణ హైకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబాకర్ పథకాలపై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు.. వాటికి సంబంధించిన చెక్కులను ఎమ్మెల్యేలు ఇవ్వడమేంటని ప్రశ్నించింది.
దీనికి సంబంధించిన చెక్కులను అధికారులు ఇవ్వకుండా ఎమ్మెల్యేలు ఇవ్వడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు ఈ చెక్కుల పంపిణీ అంశంలో సంబంధిత అధికారులు ఏం చేస్తున్నారని హైకోర్టు ప్రశ్నించింది. అదే సమయంలో దివ్యాంగులకు ఇచ్చే ఆర్థికసాయం కొనసాగించేందుకు అనుమతించిన తెలంగాణ హైకోర్టు.. జీవో నంబర్ 4పై ఉన్న స్టేను ఎత్తివేసింది.
కాగా, ఈ నెల ఆరంభంలో ఉచిత పథకాలపై తెలంగాణ హైకోర్టు పలు ప్రశ్నలు లేవనెత్తిన సంగతి తెలిసిందే. ఆగస్టు 7వ తేదీన ఒక కేసు విచారణ సందర్భంగా.. కోటీశ్వరులు కూడా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందుతున్నారని వ్యాఖ్యానించింది. రైతుల కోసం అమలు చేసిన రైతుబంధు వంటి పథకాలలోనూ సంపన్నులు లబ్ధి పొందిన విషయాన్ని కోర్టు ప్రస్తావించింది. నిజంగా అవసరం ఉన్నవారికి ప్రభుత్వ సాయం అందాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.
ఇక ఆగస్టు 20వ తేదీన కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబాకర్ పథకాలపై హైకోర్టు విచారణ సందర్భంగా నిధుల విడుదల అంశానికి సంబంధించి స్టేను ఎత్తివేయడానికి నిరాకరించింది. నిధుల విడుదలపై ఉన్న స్టేను తొలగించాలంటూ ప్రభుత్వం చేసిన అభ్యర్థనను తోసిపుచ్చిన న్యాయస్థానం, రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా ఈ పథకాలకు సంబంధించి చెక్కులను ఎమ్మెల్యేలు ఇవ్వడాన్ని ప్రధానంగా తప్పుబట్టిన న్యాయస్థానం.. అది రాజకీయ జోక్యమే అవుతుందని హెచ్చరించింది.
ఇవి కూడా చదవండి:
ఉచిత పథకాలు కోటీశ్వరులకూ అవసరమా?
‘నా అమెరికా పర్యటన రద్దు.. తెలంగాణ ప్రజలకే అవమానం’


