ములుగు జిల్లా: మేడారం సమ్మక్క – సారలమ్మ మహా జాతరలో భక్తులు సమర్పించిన మిశ్రమ బంగారం, వెండి కానుకల లెక్కింపు మంగళవారం పూర్తయింది. హనుమకొండ ఎస్‌టీఓలో భద్రపరిచిన ఆరు ట్రంకు బాక్సులను ధార్మిక భవన్‌కు తీసుకువచ్చి రెండు రోజులపాటు లెక్కించారు. 1994, 1996, 2000 జాతరలకు చెందిన మిశ్రమ వెండి బాక్సులు, 2004, 2006, 2008, 2010, 2012 జాతరలకు సంబంధించిన మిశ్రమ బంగారం, వెండి బాక్సులను తెరిచి లెక్కించారు.
ఈ సందర్భంగా బంగారం, వెండి కాని వస్తువులను వేరు చేసి స్వచ్ఛతను నిర్ధారించారు. అధికారిక లెక్కల ప్రకారం మిశ్రమ బంగారం 2 కిలోల 882 గ్రాముల 500 మిల్లీగ్రాములు, మిశ్రమ వెండి 183 కిలోల 561 గ్రాములుగా తేలింది. 20 కిలోల స్క్రాప్‌తో కలిపి మొత్తం వెండి 203 కిలోల 561 గ్రాములుగా నమోదైనట్లు మేడారం ఈఓ వీరస్వామి తెలిపారు. కాగా, ఇంకా ఆరు జాతరల ట్రంక్ బాక్సుల లెక్కింపు చేయాల్సి ఉంది.


