అమెరికాలో క్లాస్‌ యాక్షన్‌.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లపై ఒత్తిడి! | HDFC Bank Stock Crashes After US Lawsuit What Investors Must Know | Sakshi
Sakshi News home page

అమెరికాలో క్లాస్‌ యాక్షన్‌.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లపై ఒత్తిడి!

Aug 27 2026 12:46 PM | Updated on Aug 27 2026 12:58 PM

HDFC Bank Stock Crashes After US Lawsuit What Investors Must Know

భారతీయ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు అమెరికాలో చోటుచేసుకున్న పరిణామాలతో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. బ్యాంక్‌తో పాటు దాని టాప్ ఎగ్జిక్యూటివ్‌లపై న్యూయార్క్ కోర్టులో ‘క్లాస్‌ యాక్షన్‌’ సెక్యూరిటీస్ దావా నమోదవడంతో మదుపర్ల సెంటిమెంట్‌ దెబ్బతింది. జులై 17, 2023 నుంచి మే 26, 2026 మధ్య కాలంలో బ్యాంక్ అమెరికన్ డిపాజిటరీ షేర్లు కొనుగోలు చేసిన ఇన్వెస్టర్ల తరఫున ఈ పిటిషన్‌ దాఖలైంది.

ఈ వ్యాజ్యంలో బ్యాంక్ సీఈఓ శశిధర్ జగదీశన్, సీఎఫ్‌ఓ శ్రీనివాసన్ వైద్యనాథన్‌ల పేర్లను నిందితులుగా చేర్చారు. మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎంఎస్‌ఆర్‌డీసీ) నుంచి భారీ కార్పొరేట్ డిపాజిట్లను ఆకర్షించేందుకు సాధారణ సేవింగ్స్ రేటు (3.5%) కంటే అధికంగా 6.01% వడ్డీని ఆఫర్ చేశారనేది ప్రధాన ఆరోపణ. అదనంగా చెల్లించిన ఈ మొత్తాన్ని నిబంధనలకు విరుద్ధంగా మార్కెటింగ్ ఖర్చులు (సుమారు రూ.45 కోట్లు) కింద దాచిపెట్టారని, తద్వారా నికర వడ్డీ ఆదాయాన్ని తప్పుగా చూపించారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ కేసులో లీడ్ ప్లాంటిఫ్‌గా చేరేందుకు ఇన్వెస్టర్లకు అక్టోబర్ 13, 2026 వరకు గడువు ఉంది.

బ్యాంకు స్పందన

అయితే ఈ ఆరోపణలపై హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ స్పందిస్తూ అమెరికా మార్కెట్లలో షేరు ధర తగ్గినప్పుడు ఇలాంటి క్లాస్‌ యాక్షన్‌ దావాలు సర్వసాధారణమని కొట్టిపారేసింది. ఈ పిటిషన్‌లో ఎటువంటి వాస్తవం లేదని, ఈ వ్యవహారంపై న్యాయస్థానంలో పోరాడతామని స్పష్టం చేసింది. ఇటీవలే బ్యాంక్ గిఫ్ట్ సిటీ బ్రాంచ్ ద్వారా 1.75 బిలియన్‌ డాలర్ల నోట్ల జారీని విజయవంతంగా పూర్తి చేసిందని, ఫండమెంటల్స్ బలంగా ఉన్నాయని తెలిపింది.

ఈ పరిణామాల నేపథ్యంలో బీఎస్‌ఈలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేరు ధర 2 శాతానికి పైగా క్షీణించి ఒత్తిడికి లోనైంది. ఎల్‌ఐసీ తన వాటాను పెంచుకోవడానికి ఆర్‌బీఐ ఆమోదం లభించడం సానుకూలాంశమైనప్పటికీ కార్పొరేట్ గవర్నెన్స్ ఆందోళనల కారణంగా సమీప భవిష్యత్తులో షేరు పరిమిత శ్రేణిలోనే కదిలే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇదీ చదవండి: ఒక్కరోజులో మారిన బంగారం ధరలు.. తులం ఎంతంటే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement