ప్రాంటిజ్: గుజరాత్‌లోని ప్రాంటిజ్ తాలూకాలో ఐఐఎఫ్‌ఎల్ ఫైనాన్స్ మేనేజర్ భరత్ చౌధరి హత్య కేసును పోలీసులు కొన్ని గంటల్లోనే ఛేదించారు. రూ.6 లక్షల రుణం ఎగ్గొట్టడంతోపాటు తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలను తిరిగి దక్కించుకునేందుకు ఓ ప్రేమజంట ఈ హత్యకు పథకం పన్నినట్లు దర్యాప్తులో వెల్లడైంది. మాణసా బ్రాంచ్ మేనేజర్‌గా పనిచేస్తున్న భరత్ చౌధరి సెప్టెంబర్ 2న అదృశ్యమయ్యారు. అనంతరం లిమ్లా గ్రామం నుంచి వడవాసా వెళ్లే మార్గంలో ఓ కారులో ఆయన మృతదేహం కనిపించింది. ఆయన మెడపై పదునైన ఆయుధంతో దాడి చేసిన ఆనవాళ్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
డిప్యూటీ ఎస్పీ ఏకే పటేల్ వివరాల ప్రకారం.. సాంకేతిక ఆధారాలు, కాల్ డేటాను పరిశీలించిన పోలీసులు భావన అలియాస్ భావూ ఠాకోర్, ఆమె ప్రియుడు యోగేశ్ ఠాకోర్‌లపై అనుమానం వ్యక్తం చేశారు. భావనను అదుపులోకి తీసుకుని విచారించడంతో హత్య వెనుక కుట్ర వెలుగులోకి వచ్చింది. భావన ఐఐఎఫ్‌ఎల్ ఫైనాన్స్ నుంచి రూ.1.50 లక్షలు, యోగేశ్ రూ.4.50 లక్షలు రుణంగా తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మొత్తం రూ.6 లక్షల రుణాన్ని చెల్లించకుండా ఉండటంతోపాటు తాకట్టు పెట్టిన బంగారాన్ని తిరిగి పొందేందుకు ఇద్దరూ మేనేజర్‌ను హతమార్చాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడైంది.
పథకంలో భాగంగా భావన.. డబ్బులు ఇస్తాననే నెపంతో భరత్‌ను ప్రాంటిజ్‌కు రప్పించింది. అనంతరం యోగేశ్ ఆయనను కారులో మాణసా నుంచి తీసుకెళ్లాడు. వడవాసా సమీపంలో కారులోనే పదునైన ఆయుధంతో భరత్‌పై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. తర్వాత మృతదేహాన్ని, కారును నిర్మానుష్య ప్రాంతంలో వదిలివేయాలని ఇద్దరూ భావించారు. అయితే లిమ్లా వైపు వెళ్తుండగా కారును రివర్స్ చేసే సమయంలో రహదారి పక్కన ఉన్న గుంతలో ఇరుక్కుపోయింది. ఎంత ప్రయత్నించినా కారు బయటకు రాకపోవడంతో పోలీసులకు చిక్కుతామనే భయంతో మృతదేహంతోపాటు కారును అక్కడే వదిలి ఇద్దరూ పరారయ్యారు.
భావన, యోగేశ్ సుమారు ఏడేళ్లుగా ప్రేమలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. భావనను అరెస్టు చేయగా, యోగేశ్ పరారీలో ఉన్నాడు. అతడి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: కాంగ్రెస్‌లో భారీ మార్పులు.. 120 మంది యువ నేతలకు పగ్గాలు!


