స్వదేశానికి తిరిగొచ్చిన కాన్పూర్ వాసి ఆవేదన
కాన్పూర్: రష్యా రాజధాని మాస్కోలో పోలీసులు తనను అనవసరంగా నిర్బంధించి, చిత్రహింసలకు గురి చేశారని యూపీలోని కాన్పూర్‌కు చెందిన చందన్ గుప్తా(45) ఆరోపించారు. నోయిడాలోని యూఫ్లెక్స్ అనే కంపెనీ తరఫున 2023 నుంచి భార్య, కుమారుడితోపాటు మాస్కోలో ఉంటున్నట్లు చందన్ చెప్పారు. రష్యా పోలీసుల కస్టడీలో దాదాపు 48 గంటలు గడిపిన తర్వాత మాస్కో నుంచి తిరిగి స్వదేశానికి వచ్చేశానన్నారు.
అక్కడి పోలీసులు తనను, తన స్నేహితుడిని దుర్భాషలాడటంతోపాటు, బెదిరించి, చిత్రహింసలకు గురిచేశారని ఆరోపించారు. ఈ సంఘటన తనను ఎంతో వేదనకు గురిచేసిందని, ఇకపై రష్యా ఒక్కటే కాదు, విదేశాలలో ఎన్నడూ పనిచేయరాదని నిర్ణయించుకున్నట్లు శనివారం చెప్పారు. ‘ఈ నెల 5వ తేదీ రాత్రి మిత్రుడు ఆశిష్‌తో కలిసి మాస్కోలోని కిటే గొరోడ్ మెట్రో స్టేషన్‌కు, హాంగింగ్ బ్రిడ్జి, అటు నుంచి రెడ్ స్క్వేర్ వైపు నడిచి వెళ్తుండగా పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారు.
తాము మద్యం మత్తులో ఉన్నట్లు, అంబులెన్సు కిటికీ అద్దాన్ని పగులగొట్టామని ఆరోపిస్తూ చిత్రహింసలకు గురిచేశారు. ఏవో పత్రాలపై బలవంతంగా సంతకాలు చేయించుకున్నారు. కుటుంబసభ్యులు, మిత్రులను కూడా కలవనివ్వలేదు. మా కంపెనీ లాయర్ల జోక్యంతో దాదాపు 48 గంటల తర్వాత విడిచిపెట్టారు’అని ఆరోపించారు. రెండు రోజుల క్రితం చందన్ గుప్తా భార్య స్నేహ కూడా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. తన భర్తను విడిపించేందుకు సాయం చేయాలంటూ యూపీ సీఎం యోగిని అందులో కోరారు. మాస్కోలోని భారత ఎంబసీ తమకు ఎటువంటి సాయం చేయలేదని, రష్యా పోలీసులు చేసిన ఆరోపణలనే వినిపించిందన్నారు.


