పోతిరెడ్డిపాడు నుంచి 3.5 టీఎంసీల నీటిని తీసుకునే అవకాశం ఉంది
కేవలం 8 వేల క్యూసెక్కులు మాత్రమే తీసుకోవడం దారుణం
రాయలసీమ మేధావుల ఫోరం సమన్వయకర్త పురుషోత్తమరెడ్డి
తిరుపతి (అన్నమయ్య సర్కిల్): చంద్రబాబు ప్రభుత్వం రాజకీయ కోణంలో తీసుకుంటున్న నిర్ణయాల వల్ల రాయలసీమ, నెల్లూరు, వెలిగొండ ప్రాజెక్టు పరిధిలో తాగునీటికి ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయని రాయలసీమ మేధావుల ఫోరం సమన్వయకర్త మాకిరెడ్డి పురుషోత్తమరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం తిరుపతిలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం శ్రీశైలం రిజర్వాయర్‌లో 119.5 టీఎంసీల నీరు ఉండగా, ఇన్‌ఫ్లో పూర్తిగా ఆగిపోయిందన్నారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా ఆదివారం కూడా అర టీఎంసీ నీటిని తీసుకుని విద్యుత్ ఉత్పత్తి చేసిందన్నారు. ఏపీ పోతిరెడ్డిపాడు నుంచి 3.5 టీఎంసీల నీటిని తీసుకునే అవకాశం ఉన్నా కేవలం 8 వేల క్యూసెక్కుల నీటిని మాత్రమే తీసుకోవడం సరికాదన్నారు.
బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ నుంచి ఎస్‌ఆర్‌బీసీ, తెలుగు గంగ, నిప్పుల వాగు ద్వారా నీటిని రాయలసీమలోని ప్రధాన ప్రాజెక్టులకు, సోమశిలకు నీరు విడుదల చేయాలన్నారు. నెల్లూరు జిల్లా రైతులకు సాగునీరు, తాగునీరు, చెన్నైకి ఇవ్వడానికి సరిపడా నీరు సోమశిలలో లేదన్నారు. ఈ పరిస్థితుల్లో తిరుపతి, తిరుమలకు కూడా నీరు ఇవ్వడం దుర్భరంగా మారనుందన్నారు.
గత ప్రభుత్వం రూపొందించిన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చి ఉంటే శ్రీశైలంలో 800 అడుగుల నుంచే నీటిని లిఫ్ట్ చేసే అవకాశం ఉంటుందన్నారు. పోతిరెడ్డిపాడు నుంచి నీరు తీసుకోలేని పరిస్థితులు ఏర్పడినప్పుడు 90 టీఎంసీల నుంచి 30 టీఎంసీల వరకు పడిపోయినా నీటిని తీసుకోవడానికి రాయలసీమ లిఫ్ట్ ఉపయోగపడుతుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ అవసరాన్ని గుర్తించాలని డిమాండ్ చేశారు.
తిరుపతిలోనే ‘నైలిట్’ కార్యాలయం పెట్టాలి
తిరుపతి నైలిట్ సెంటర్ భవితవ్యంపై ప్రభుత్వం, అధికారులు చేస్తున్న ప్రకటనలు సమస్యను పరిష్కరించకపోగా మరింత గందరగోళానికి గురి చేస్తున్నాయని పురుషోత్తమరెడ్డి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏపీకి కేటాయించిన నైలిట్ విశ్వవిద్యాలయ క్యాంపస్‌ను అమరావతిలో ఏర్పాటు చేస్తే తిరుపతి నైలిట్ సెంటర్ తన ప్రాధాన్యత కోల్పోతుందన్నారు. విశ్వవిద్యాలయ క్యాంపస్ కార్యాలయాన్ని తిరుపతిలోనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.


