రియాద్ : నిన్న బంగారం నిక్షేపాలతో చైనాకు జాక్‌పాట్ తగిలింది. ఇప్పుడు సౌదీ అరేబియా వంతు వచ్చింది. ఆ దేశ తలరాతను మార్చే భారీ యురేనియం నిధి వెలుగు చూసింది.
పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలో చైనాకు చెందిన పరిశోధక నౌక ‘జియాంగ్ యాంగ్ హాంగ్ 10’ చేపట్టిన సముద్ర గర్భ అన్వేషణలో సంచలన నిజాలు వెలుగుచూశాయి. సముద్రం అడుగున ఉన్న హై-టెంపరేచర్ హైడ్రోథర్మల్ ఫీల్డ్ ప్రాంతంలో శాస్త్రవేత్తలు సేకరించిన నమూనాలు విస్తుపోయేలా చేశాయి. ఇక్కడ లభించిన ఖనిజ నమూనాలలో టన్ను ముడి ఖనిజానికి ఏకంగా 15.4 గ్రాముల బంగారం, అలాగే 1,271 గ్రాముల వెండి ఉన్నట్లు తేలింది. సాధారణంగా భూమిపై దొరికే గనుల కంటే సముద్రం అడుగున ఈ విలువైన లోహాల గాఢత చాలా ఎక్కువగా ఉండటం గమనార్హం.
దశాబ్దాలుగా నల్ల బంగారం (ముడి చమురు) మాత్రమే తమ తలరాతను మారుస్తుందని సౌదీ అరేబియా నమ్ముతూ వచ్చింది. ప్రపంచ దేశాల ఇంధన అవసరాలను తీరుస్తూ ఆర్థికంగా అగ్రస్థానానికి దూసుకెళ్లింది. కానీ, రేపు చమురు నిల్వలు కరిగిపోతే పరిస్థితి ఏమిటి? భవిష్యత్తు తరాల ఆర్థిక భద్రత మాటేమిటి? అనే ఆలోచనే సౌదీ పాలకులను ప్రత్యామ్నాయ వనరుల వేటలో పడేలా చేసింది. ఆ అన్వేషణే ఇప్పుడు ఒక అద్భుతమైన నిధిని వెలికితీసేలా చేసింది.
సౌదీ అరేబియాలోని పవిత్ర మదీనా ప్రాంతం ఇప్పుడు కేవలం ఆధ్యాత్మిక కేంద్రంగానే కాదు.. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించే సరికొత్త శక్తి కేంద్రంగా మారుతోంది. ఆ దేశ ఇంధన మంత్రి ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సల్మాన్ ఇటీవల వెల్లడించిన వివరాలు ప్రపంచాన్ని విస్మయానికి గురిచేశాయి. ఆ ప్రాంతంలో ఏకంగా 110 మిలియన్ టన్నుల (11 కోట్ల టన్నులు) భారీ యురేనియం నిల్వలు ఉన్నట్లు ఆయన ప్రకటించారు. ఇది కేవలం ఒక మైనింగ్ అన్వేషణ మాత్రమే కాదు.. సౌదీ భవిష్యత్తు కలలకు దక్కిన అసలైన బలం.
జాక్‌పాట్ ఎందుకంటే?
చమురు ఎగుమతులపైనే పూర్తిగా ఆధారపడిన ఆర్థిక వ్యవస్థను మార్చడానికి, భవిష్యత్తులో రాబోయే ఇంధన సవాళ్లను ఎదుర్కొనేందుకు ఈ యురేనియం నిల్వలు సౌదీకి పెద్ద ఆసరాగా నిలుస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. భూమి పొరల్లో దాగున్న ఈ ముడి ఖనిజం అంతర్జాతీయ మార్కెట్‌లో ఆ దేశ ఆర్థిక శక్తిని ఊహకందని స్థాయికి తీసుకెళ్లే అస్త్రం కానుంది. రేపు సౌదీ గడ్డపై పౌర అణు విద్యుత్ కేంద్రాలు ఏర్పాటవుతాయి. దేశీయ అవసరాలు తీరగా మిగిలిన శుద్ధి చేసిన యురేనియంను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తూ.. గ్లోబల్ న్యూక్లియర్ మార్కెట్‌లో ఆ దేశం తిరుగులేని శక్తిగా అవతరించే అవకాశాలున్నాయి.
అయినా ఇది అంత సులభం కాదు..
భూగర్భంలో కోట్లాది టన్నుల ఖనిజం దొరికినంత మాత్రాన అది వెంటనే ఇంధనంగా మారిపోదు. ఈ ముడి ఖనిజం నుంచి యురేనియంను వేరుచేసి, వాణిజ్యపరంగా వినియోగించే స్థాయికి తీసుకురావడానికి కొన్ని సంవత్సరాల సమయం పడుతుంది. దీనికోసం అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానం, భారీ పెట్టుబడులు అవసరం. అయినప్పటికీ, మున్ముందు ప్రపంచాన్ని శాసించబోయే అణు శక్తి రంగంలో అడుగుపెట్టడానికి సౌదీ వేసిన ఈ తొలి అడుగు.. ఆ దేశ చరిత్రలో మైలురాయిగా నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు!


