ఒక్కసారి ఓకే అన్నందుకు.. | Beyond One Time Consent Building a Smarter Anti Spam System | Sakshi
Sakshi News home page

ఒక్కసారి ఓకే అన్నందుకు..

Sep 15 2026 2:36 PM | Updated on Sep 15 2026 3:02 PM

Beyond One Time Consent Building a Smarter Anti Spam System

హైదరాబాద్‌కు చెందిన రవి కొన్నేళ్ల క్రితం ఓ బ్యాంకులో క్రెడిట్‌ కార్డు కోసం దరఖాస్తు చేశాడు. ఆ సందర్భంగానే బ్యాంకు, దాని భాగస్వామ్య సంస్థల నుంచి అడ్వర్టైజ్‌మెంట్‌ మెసేజీలు అందుకేనేందుకు ఓకే అన్నాడు. కాలం గడిచింది. రవి ఆ క్రెడిట్‌ కార్డును మూసివేశాడు. ఇంకో బ్యాంకుకు మారాడు. కొత్తగా ఎలాంటి రుణాలు లేదా క్రెడిట్‌ కార్డు ఆఫర్లు అవసరం లేదని నిర్ణయించుకున్నాడు. అయినాసరే.. ఏళ్ల తరువాత కూడా రవి ఫోన్‌కు బ్యాంకింగ్‌, రుణాలు, క్రెడిట్‌ కార్డు ఆఫర్ల ఎస్‌ఎంఎస్‌లు, ఫోన్‌కాల్స్‌, వాట్సాప్‌ మెసేజీలు వస్తూనే ఉన్నాయి. ఎందుకిలా అని రవి తన టెలికాం ఆపరేటర్‌ను ప్రశ్నిస్తే... ఏళ్ల క్రితం ఒక్కసారి ఓకే అన్న ఫలితమిది అని తెలిసింది. ఈ సమస్యకు పరిష్కారం?

సమ్మతి శాశ్వతం కాదు
ఒక వినియోగదారుడికి ఇష్టం లేని ప్రచార మెసేజీలు రావడానికి కారణం.. గతంలో ఎప్పుడో ఒకసారి ఓకే అని ఉంటాడన్న భావన. ఖాతా తెరిచేటప్పుడు, సర్వీస్‌ రిజిస్ట్రేషన్‌, యాప్‌ డౌన్‌లోడ్‌, లేదా ఫామ్‌ నింపేటప్పుడు ఓకే అని ఉండవచ్చు. అయితే వినియోగదారుల అభిరుచులు, అవసరాలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కొత్త విషయాలపై ఆసక్తి పెరగవచ్చు, కొన్ని ఉత్పత్తులను వినియోగించడం మానేయవచ్చు, సర్వీస్‌ ప్రొవైడర్‌ను మార్చుకోవచ్చు లేదా ఒక సంస్థ నుంచి ఇకపై ఎలాంటి మెసేజీలు వద్దని నిర్ణయించుకోవచ్చు. 

అందువల్ల గతంలో ఇచ్చిన అనుమతి.. ప్రస్తుతం వినియోగదారుడి అభీష్టాన్ని ప్రతిబింబించకపోవచ్చు. ‘ఒకానొక సందర్భంలో వినియోగదారుడి ఆసక్తికి అతడిచ్చిన ఒకే అద్దం పట్టవచ్చు. అయితే సందర్భం మారినప్పుడు ఈ సమ్మతి కూడా మారగలగాలి. ఇంకోలా చెప్పాలంటే సమ్మతిని శాశ్వతమైన చారిత్రక రికార్డుగా కాకుండా.. వినియోగదారుడు ఎప్పటికప్పుడు మార్చుకోగలిగే ఎంపికగా చూడాలి.’’ అంటారు భారతి ఎయిర్‌టెల్‌ గ్రూప్‌ కార్పొరేట్‌ అఫైర్స్‌ చీఫ్‌ రెగ్యులేటరీ ఆఫీసర్‌, డైరెక్టర్‌ రాహుల్‌ వత్స్‌. రవి విషయంలో జరిగింది ఇదే. ఒక్కసారి ఓకే అన్నందుకు.. ఆ తర్వాత కూడా మెసేజీలు వస్తూనే ఉండాలా?

ఎవరి బాధ్యత?
వాణిజ్య సమాచార నియంత్రణకు సంబంధించి భారత్‌ పటిష్టమైన నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. టెలికాం కమర్షియల్‌ కమ్యూనికేషన్స్‌ కస్టమర్‌ ప్రిఫరెన్స్‌ రెగ్యులేషన్స్‌ (టీసీసీసీపీఆర్‌), డిస్ట్రిబ్యూటెడ్‌ లెడ్జర్‌ టెక్నాలజీ (డీఎల్‌టీ), సంస్థల రిజిస్ట్రేషన్‌ నిబంధనలు, మెసేజీల టెంప్లేట్‌ ధ్రువీకరణ విధానాలు, డిజిటల్‌ కన్సెంట్‌ అక్విజిషన్‌ (డీసీఏ) వ్యవస్థ.. ఇవన్నీ కలసి సమగ్ర యాంటీ-స్పామ్‌ నియంత్రణ వ్యవస్థను రూపొందించాయి. నియంత్రణకు అవసరమైన పునాది ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఎదురవుతున్న సవాలు.. మెసేజింగ్‌ ప్రక్రియలో సమ్మతిని ఏ దశలో, ఎవరు అమలు చేయాలన్నదే.

ప్రతిపాదిత డీసీఏ వ్యవస్థలో సమ్మతి సేకరణ, నమోదు, ధ్రువీకరణ వంటి ప్రక్రియలు ప్రధానంగా ప్రారంభ దశలోనే జరుగుతాయి. ఆరిజినేటింగ్‌ యాక్సెస్‌ ప్రొవైడర్లు (ఓఏపీలు), మెసేజింగ్‌ వ్యవస్థలోని ఇతర భాగస్వాములు సంస్థలను నమోదు చేయడం, సమ్మతి వివరాలను నిర్వహించడం, మెసేజీల పంపిణీకి వీలు కల్పించడం వంటి కీలక బాధ్యతలను నిర్వర్తిస్తారు. అయితే, మెసేజీని స్వీకరించే వినియోగదారుడితో కొనసాగుతున్న సంబంధాన్ని నిర్వహించే బాధ్యత మాత్రం టెర్మినేటింగ్‌ యాక్సెస్‌ ప్రొవైడర్‌ (ట్యాప్‌)పై ఉంటుంది. అంటే.. వినియోగదారుడు ఉపయోగిస్తున్న టెలికాం ఆపరేటర్‌పైనే ఉంటుంది.

ట్యాప్‌ నేరుగా చందాదారుడికి సేవలు అందిస్తుంది. వినియోగదారుల ప్రాధాన్యతలను పర్యవేక్షిస్తుంది. స్పామ్‌పై వచ్చే ఫిర్యాదులను స్వీకరిస్తుంది. వినియోగదారుల విశ్వాసాన్ని కాపాడే బాధ్యతను కూడా భరిస్తుంది. అనవసరమైన మెసేజీలు వచ్చినప్పుడు చందాదారులు సాయం కోసం ముందుగా సంప్రదించేది తమ సొంత టెలికాం ఆపరేటర్‌నే. అయినా, ఒక వాణిజ్య మెసేజీని చందాదారుడికి పంపాలా వద్దా అని నిర్ణయించే సమ్మతి ధ్రువీకరణ వ్యవస్థపై ట్యాప్‌కు పూర్తి నియంత్రణ లేదు.“వినియోగదారుడి సమ్మతిని సేకరించి, నిర్వహించే సంస్థ.. ఆ సందేశాన్ని స్వీకరించే చందాదారుడితో కొనసాగుతున్న సంబంధాన్ని కలిగి ఉండకపోవచ్చు. కానీ చందాదారుడి ప్రాధాన్యతలు, ఫిర్యాదులు, విశ్వాసాన్ని నిర్వహించే బాధ్యత ట్యాప్‌పైనే ఉంటుంది. బాధ్యత ఒకరి వద్ద, నిర్ణయాధికారం మరొకరి వద్ద ఉండటం వ్యవస్థలో అంతరాన్ని సృష్టిస్తుంది.” అంటారు రాహుల్‌ వత్స్‌.

ఈ విభజన ప్రభావం డీఎల్‌టీ వ్యవస్థలో స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ప్లాట్‌ఫారమ్‌లో గుర్తించిన 32,095 బ్లాక్‌లిస్ట్‌ సంస్థల్లో దాదాపు 87 శాతం కేవలం రెండు ఓఏపీ-మాత్రమే టెలికాం ఆపరేటర్లతో సంబంధం కలిగి ఉన్నాయి. వీటిలో ఒక ఆపరేటర్‌కు సుమారు 53 శాతం, మరో ఆపరేటర్‌కు దాదాపు 34 శాతం బ్లాక్‌లిస్ట్‌ సంస్థలు అనుబంధంగా ఉన్నాయి. 2026 మార్చితో ముగిసిన త్రైమాసికంలో నమోదైన మొత్తం బ్లాక్‌లిస్ట్‌ టెంప్లేట్లలో దాదాపు 40 శాతం ఒకే ఆపరేటర్‌కు సంబంధించినవే.

సమ్మతి ధ్రువీకరణను వినియోగదారుడితో నేరుగా సంబంధం లేని సంస్థల వద్ద ఉంచినప్పుడు ఎదురయ్యే సమస్యను ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. ఇలాంటి సందర్భాల్లో మెసేజీల పంపిణీ.. చందాదారుడి ప్రస్తుత అభిరుచులను ప్రతిబింబించని రికార్డులపై ఆధారపడే ప్రమాదం ఉంది.

ట్యాప్‌ ఆధారిత పరిష్కారం
సమ్మతి అనేది ఒక నిర్దిష్ట సమయంలో వినియోగదారుడి ఉద్దేశాన్ని తెలియజేస్తుంది. ఆ ఉద్దేశం మారినప్పుడు సమ్మతి కూడా మారే అవకాశం ఉండాలి. డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ విస్తరిస్తున్న ప్రస్తుత కాలంలో సమ్మతి అనేది గతంలో నమోదైన స్థిరమైన రికార్డుగా కాకుండా.. వినియోగదారుడు ఎప్పుడైనా మార్చుకోగలిగే చురుకైన ఎంపికగా ఉండాలి. అందువల్ల ట్యాప్‌ ఆధారిత సమ్మతి నిర్వహణను పరిగణనలోకి తీసుకోవాలి. 

ట్యాప్‌ ఆధారిత డీసీఏ వ్యవస్థలో చందాదారుడి టెలికాం ఆపరేటర్‌ సమ్మతిని సేకరించడం, ధ్రువీకరించడం, భద్రపరచడం, అమలు చేయడం వంటి బాధ్యతలను చేపడుతుంది. రవి తన టెలికాం యాప్‌లో బ్యాంకింగ్‌, బీమా, రుణాలకు సంబంధించిన ప్రచార మెసేజీలను నిలిపివేశాడనుకుందాం. అదే సమయంలో ఒక ఆర్థిక సంస్థ వద్ద అతని పాత సమ్మతి రికార్డు ఇంకా చెల్లుబాటులో ఉన్నట్లు కనిపించవచ్చు. ట్యాప్‌ ఆధారిత వ్యవస్థలో మెసేజీ పంపే ముందు ఆపరేటర్‌ రవి తాజా ప్రాధాన్యతలను పరిశీలించి, ఆ మెసేజీని నిలిపివేయగలదు.

దీంతో గతంలో ఇచ్చిన సమ్మతి కంటే.. వినియోగదారుడి ప్రస్తుత నిర్ణయానికే ప్రాధాన్యం లభిస్తుంది. ఈ విధానం వల్ల వినియోగదారుడి ప్రయోజనాలను రక్షించే బాధ్యత ఉన్న ఆపరేటర్‌కే.. వాణిజ్య మెసేజీలపై నిర్ణయాధికారం ఉంటుంది. అలాగే... వినియోగదారుడి అభిరుచులకు తగ్గట్టు వెంటనే మార్పులు చేసే వీలు ఏర్పడుతుంది. సున్నితమైన వివరాలను స్థానికంగానే భద్రపరచవచ్చు. దీంతో గోప్యత, పర్యవేక్షణ మెరుగుపడతాయి. వినియోగదారులతో నేరుగా సంబంధం ఉన్న ఆపరేటర్లు కొత్త నియంత్రణలు, భద్రతా ఫీచర్లు, రక్షణ చర్యలను వేగంగా ప్రవేశపెట్టగలరు.

ప్రస్తుత సమ్మతికే ప్రాధాన్యం
స్పామ్‌ను నియంత్రించేందుకు భారత్‌ ఇప్పటికే బలమైన పునాదిని నిర్మించింది. ప్రస్తుత చర్యలు టెలికాం వనరుల దుర్వినియోగాన్ని గణనీయంగా తగ్గించడంతో పాటు పటిష్టమైన అనుసరణ వ్యవస్థను ఏర్పాటు చేశాయి. అయితే మోసపూరిత సమాచార ప్రసార పద్ధతులు నిరంతరం మారుతున్నాయి. అందువల్ల సమ్మతి తీసుకున్న సమయంలో మాత్రమే దాన్ని తనిఖీ చేయడం కాకుండా.. వాణిజ్య మెసేజీ వినియోగదారుడికి చేరే సమయంలోనూ సమ్మతిని అమలు చేయడంపై దృష్టి పెట్టాలి. ప్రపంచ స్థాయి డిజిటల్‌ మౌలిక వసతులను నిర్మించే సామర్థ్యం భారత్‌కు ఉందని ఇప్పటికే నిరూపితమైంది. 

ఇకపై వినియోగదారుల రక్షణ, సమ్మతి అమలు, జవాబుదారీతనాన్ని ఒకే సమగ్ర వ్యవస్థలోకి తీసుకురావాలి. డిజిటల్‌ కమ్యూనికేషన్‌ మరింత విస్తరిస్తున్న కొద్దీ.. చందాదారుడి నేటి అభీష్టాన్ని సమ్మతి ప్రతిబింబిస్తుందా, లేక గతంలో ఎప్పుడో ఇచ్చిన అనుమతినే చూపిస్తుందా అన్నదానిపైనే వినియోగదారుల విశ్వాసం ఆధారపడి ఉంటుంది. వత్స్‌ మాటల్లో చెప్పాలంటే: “సమ్మతి సేకరించినప్పుడు మాత్రమే కాదు.. మెసేజీ డెలివరీ అయ్యే సమయంలోనూ అర్థవంతంగా ఉండాలి. వినియోగదారుడి ప్రస్తుత నిర్ణయానికే ప్రాధాన్యం లభించే విధంగా వ్యవస్థను రూపొందించాలి.”

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement