కృత్రిమ మేధ (ఏఐ) వేగంగా పురోగమిస్తున్న కొద్దీ సాంకేతిక ప్రపంచం రెండు భిన్నమైన సిద్ధాంతాల మధ్య తీవ్రమైన సమరానికి వేదికగా మారింది. ఒకవైపు ఏఐ అభివృద్ధిని నిరోధించకపోతే మానవాళి ఉనికికే ప్రమాదమని హెచ్చరిస్తున్న ‘డూమర్స్’ ఉంటే, మరోవైపు నియంత్రణలు లేని స్వేచ్ఛాయుత పురోగతే నూతన ఆవిష్కరణలకు మార్గమని వాదించే ‘బూస్టర్స్’ ఉన్నారు. వీరితో పాటు మధ్యస్థ మార్గాన్ని ఎంచుకుంటున్న సమతుల్య వాదులు కూడా ఈ పోరులో కీలక పాత్ర పోషిస్తున్నారు.
మానవాళి ఉనికిపై డూమర్స్ ఆందోళన
పరిశోధకులు, సైంటిస్టులు, సాంకేతిక దిగ్గజాలు కొందరు ‘డూమర్స్’ వర్గంలో ఉన్నారు. ఏఐ వల్ల మానవాళికి వినాశనం తప్పదని వీరు హెచ్చరిస్తున్నారు. ఏఐ పితామహులుగా పేరుగాంచిన జోఫ్రీ హింటన్, యోషువా బెంగియో సాంకేతికత మానవ మేధస్సును మించిపోయి స్వయంప్రతిపత్తి సాధిస్తే జరిగే నష్టాలను వివరిస్తున్నారు. శాస్త్రవేత్తలతో కలసి ఏఐ అభివృద్ధి వేగాన్ని తగ్గించాలని ఇటీవల ఆంత్రోపిక్ సీఈఓ డారియో ఆమోది తెలిపారు. వినాశకరమైన పరిణామాలను నివారించడానికి పకడ్బందీ భద్రతా ప్రమాణాలు పాటించాలని, నిబంధనలు లేకుండా ముందడుగు వేయడం తీవ్రమైన సైబర్ భద్రతా ముప్పులకు దారితీస్తుందని ఎలాన్ మస్క్, సామ్ ఆల్ట్‌మాన్ స్పష్టం చేస్తున్నారు. మానవాళి సర్వనాశనాన్ని నిరోధించాలంటే ఏఐ పరిశోధనలపై తాత్కాలిక విరామం అవసరమని కొందరు నిపుణులు చెబుతున్నారు.
అపరిమిత పురోగతిని కోరుకునే బూస్టర్స్
డూమర్స్‌కు పూర్తి భిన్నంగా ఏఐ ఆర్థిక వ్యవస్థను, సమాజాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తుందని విశ్వసించే వారు ‘బూస్టర్స్’గా నిలుస్తున్నారు. సిలికాన్ వ్యాలీ వెంచర్ క్యాపిటలిస్టులైన మార్క్ ఆండ్రీసెన్, డేవిడ్ సాక్స్ ఏఐ నిబంధనలను ప్రాణాంతకమైనవిగా అభివర్ణిస్తున్నారు. ఏఐ డేటా సెంటర్లు, హార్డ్‌వేర్ సాంకేతికత ప్రపంచ మార్కెట్‌కు వెన్నుముక అని ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ ఏఐ పురోగతిని సమర్థిస్తున్నారు.
అటు భద్రతా నిబంధనల పేరుతో పురోగతిని ఆపలేం. ఇటు నియంత్రణలు లేకుండా ముందడుగు వేస్తే మానవాళి ఉనికికే ప్రమాదం. సైబర్ భద్రత, ఆర్థిక స్థిరత్వం, సాంకేతిక విప్లవం మూడింటినీ బ్యాలెన్స్ చేస్తూ గ్లోబల్ గైడ్‌లైన్స్ రూపొందించడమే ఈ సమరానికి ఏకైక పరిష్కారమని ఇంకొందరు సూచిస్తున్నారు.
ఇదీ చదవండి: గోల్డ్ లవర్స్‌కి శుభవార్త.. ధరల పతనం


