ప్రపంచాన్ని కుదిపేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ దేశంలోనూ శరవేగంగా విస్తరిస్తోంది. దీని ప్రాధాన్యాన్ని గ్రహిస్తున్న పలు సంస్థలు ఏఐపై తమ పెట్టుబడులను అమాంతం పెంచేశాయి. తాజాగా విడుదలైన సర్వీస్‌నౌ ఎంటర్‌ప్రైజ్ ఏఐ మెచ్యూరిటీ ఇండెక్స్ 2026 ప్రకారం, వ్యాపారసంస్థల ఏఐ పెట్టుబడులు గత ఏడాది ఒక్క సంవత్సరంలోనే 119% పెరిగాయి. ఇది ప్రపంచ సగటు అయిన 110% కన్నా ఎక్కువ కావడం గమనార్హం. 2027 నాటికి సగటు ఐటీ బడ్జెట్‌లో ఐదో వంతు కంటే ఎక్కువ వాటా ఏఐ మీదే ఉంటుందని అంచనా.
పెట్టుబడులు సరే.. నిర్వహణ సంగతేంటి?
ప్రపంచ స్థాయి డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు, అపారమైన ఇంజినీరింగ్ ప్రతిభలతో ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎంటర్‌ప్రైజ్ ఏఐని స్వీకరిస్తున్న దేశాల్లో భారత్ ఒకటి. అయితే, తదుపరి దశ అనేది సంస్థలు ఏఐని ఎంత వేగంగా అమలు చేస్తాయనే దానిపై కాకుండా, దానిని ఎంత విశ్వాసంతో నిర్వహించగలవు అనే దానిపైనే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం, కేవలం 22% భారతీయ సంస్థలు మాత్రమే ఏఐ టెస్టింగ్, ఆడిటింగ్, రిస్క్–అసెస్‌మెంట్ ప్రక్రియలను అమలు చేయగలుగుతున్నాయని సర్వీస్ నౌ తేల్చింది. ఈ అంతరం స్పష్టంగా కనిపిస్తోందనీ, 54% భారతీయ సంస్థలు ఏఐ ఏజెంట్లను మోహరిస్తున్నా కానీ కేవలం 11% మాత్రమే స్వయంప్రతిపత్తి కలిగిన పని విధానాలకు మారాయని వెల్లడించింది. అధ్యయనంలో పాల్గొన్న భారతీయ వ్యాపార సంస్థల ప్రతినిధుల్లో.. ఏఐకి సంబంధించిన ప్రధాన అవరోధంగా తప్పుడు సమాచారం వ్యాప్తి చెందే అవకాశాన్ని 60% మంది హైలైట్ చేశారు. అలాగే 55% మంది నియంత్రణ, నిబంధనల పాటింపులో ఉన్న సంక్లిష్టతను, మరో 50% మంది డేటా గోప్యత, భద్రతాపరమైన ఆందోళనలను వ్యక్తపరిచారు.
పారిశ్రామిక ప్రగతి లక్ష్యానికి తగ్గట్టుగా...
గత 2025లో అమల్లోకి వచ్చిన డిజిటల్ వ్యక్తిగత డేటా పరిరక్షణ చట్టం డీపీడీపీ నిబంధనల నుంచి గత ఫిబ్రవరి ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో ఆవిష్కరించిన ఏఐ గవర్నెన్స్ మార్గదర్శకాలు, ఇండియా ఏఐ మిషన్, ఇండియాఏఐ సేఫ్టీ ఇన్‌స్టిట్యూట్‌ల ఏర్పాటు వరకు ఒక సహాయక చట్రాన్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంది. ఈ విధానం ఆవిష్కరణలకు మద్దతు ఇస్తూనే వ్యాపార సంస్థలు, ప్రతిభావంతులు, వినియోగదారుల్లో విశ్వాసాన్ని పెంపొందిస్తుంది. సంస్థల విషయానికొస్తే, అంతర్గత ఏఐ పాలనను ఈ జాతీయ దిశకు అనుగుణంగా మార్చుకోవడం అనేది వేగవంతమైన సంసిద్ధతను సూచిస్తోంది.
ఇదీ చదవండి: వందల గంటల సమయాన్ని ఆదా చేసే టాప్ ఏఐ టూల్స్!
పెరగనున్న బడ్జెట్...
ప్రస్తుత భారతదేశ సగటు ఐటీ బడ్జెట్‌లో ఏఐ వాటా 16.6% కాగా, 2027 నాటికి ఇది 21.3%కి పెరుగుతుందని అంచనా. కొన్ని అంతరాలను పూడ్చడం ద్వారా ప్రస్తుతం 100కి 55గా ఉన్న భారత్ మొత్తం ఏఐ గవర్నెన్స్ స్కోర్‌ను ప్రపంచంలోని ఏఐ అగ్రగామి దేశాల స్థాయికి తీసుకెళ్లవచ్చునని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. ఈ పరిశోధనపై డెలాయిట్ ఇండియా పార్టనర్, చీఫ్ స్ట్రాటజీ ఇన్నోవేషన్ ఆఫీసర్ అశ్విన్ వెల్లోడి మాట్లాడుతూ ‘భారతదేశంలో సంస్థలు ఏఐపై దృష్టి పెంచుతున్న కొద్దీ కేవలం వ్యక్తిగత వినియోగ సందర్భాలకే పరిమితం కాకుండా, నిర్ణయాలు తీసుకోవడం, నిర్వహణ నమూనాలను రూపకల్పన చేసే దిశగా అది విస్తరిస్తోంది. దీంతో పాటు ఏఐని విశ్వసనీయంగా మార్చే క్రమంలో డేటా, జవాబుదారీతనం వంటి పునాదులపై కూడా అంతే శ్రద్ధ అవసరం. ఏఐ ఎక్కడ పనిచేయాలి? మానవ విచక్షణ ఎక్కడ? అనే అంశాలపై స్పష్టమైన నిర్ణయాలు తీసుకునే సంస్థలే దీర్ఘకాలిక విలువను సృష్టిస్తాయి’ అని అన్నారు.
- సత్యబాబు


