పాస్‌పోర్ట్ నిబంధనల్లో భారత ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ పాస్‌పోర్ట్ నిబంధనలు, 1980లో సవరణలు చేసింది. కొత్త నిబంధనల ప్రకారం.. 15 ఏళ్లలోపు పిల్లలకు జారీ చేసే 36 పేజీల సాధారణ పాస్‌పోర్ట్.. జారీ చేసిన తేదీ నుంచి ఐదేళ్ల వరకు లేదా ఆ పిల్లలకు 18 ఏళ్లు నిండే వరకు చెల్లుబాటులో ఉంటుంది. ఈ రెండింటిలో ఏది ముందుగా వస్తే అదే చెల్లుబాటు గడువుగా పరిగణిస్తారు.
పాస్‌పోర్ట్ నిబంధనలు, 1980లోని రూల్ 12కు కొత్తగా చేర్చిన సబ్-రూల్ (1A)లో ఈ విషయాన్ని పేర్కొన్నారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ, చీఫ్ పాస్‌పోర్ట్ ఆఫీసర్ బీఎస్ ముబారక్ సంతకం చేసిన ఈ నిబంధనలు సెప్టెంబర్ 15న అధికారిక గెజిట్‌లో ప్రచురితమైన వెంటనే అమల్లోకి వచ్చాయి. ఈ ఏడాది జూన్‌లో నిబంధనలను చివరిసారిగా సవరించిన తర్వాత తాజాగా మరోసారి మార్పులు చేశారు.
అన్ని కేటగిరీల్లో పాస్‌పోర్ట్ ఫీజుల మార్పు
పాస్‌పోర్ట్ నిబంధనల్లోని షెడ్యూల్-IVలో పేర్కొన్న సవరించిన రుసుములనే అన్ని రకాల పాస్‌పోర్ట్ దరఖాస్తులకు వర్తింపజేయాలని తాజా సవరణలు స్పష్టం చేస్తున్నాయి. పాస్‌పోర్ట్ జారీ, పునరుద్ధరణ, తత్కాల్ సేవలు, పోగొట్టుకున్న లేదా దెబ్బతిన్న పాస్‌పోర్టుల స్థానంలో కొత్తవి జారీ చేయడం, పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ (PCC) వంటి సేవలకు ఈ ఫీజులు వర్తిస్తాయి.
జూలై 1 నుంచి అమల్లోకి వచ్చిన సవరించిన ఫీజుల ప్రకారం, సాధారణ కేటగిరీలో 36 పేజీల పాస్‌పోర్ట్ రుసుము రూ.1,500 నుంచి రూ.2,500కు పెరిగింది. 60 పేజీల పాస్‌పోర్ట్ ఫీజు రూ.2,000 నుంచి రూ.3,500కు చేరింది.
తత్కాల్ సేవల రుసుములూ పెరిగాయి. 36 పేజీల పాస్‌పోర్ట్‌కు తత్కాల్ ఫీజు రూ.3,500 నుంచి రూ.5,000కు, 60 పేజీల పాస్‌పోర్ట్‌కు రూ.4,000 నుంచి రూ.6,000కు పెరిగింది. తత్కాల్ కింద 60 పేజీల పాస్‌పోర్ట్ భర్తీకి గతంలో రూ.5,500గా ఉన్న ఫీజు ఇప్పుడు రూ.8,500కు చేరింది.
మైనర్లకు కొత్త ఫీజులు
మైనర్లకు సాధారణ కేటగిరీలో 36 పేజీల కొత్త పాస్‌పోర్ట్ ఫీజు రూ.1,000 నుంచి రూ.1,750కు పెరిగింది. తత్కాల్ కేటగిరీలో మైనర్లకు 36 పేజీల పాస్‌పోర్ట్ కోసం రూ.3,000 రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
డిస్కౌంట్ కొనసాగింపు
అయితే 8 ఏళ్లలోపు పిల్లలు, 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు కొత్త పాస్‌పోర్ట్ దరఖాస్తులపై లభిస్తున్న 10 శాతం రాయితీని ప్రభుత్వం కొనసాగించింది. తాజా ఫీజు నిర్మాణంలోనూ ఈ మినహాయింపు వర్తిస్తుంది.


