దుబాయ్‌ భారత కాన్సులేట్‌లోకి ఇక నేరుగా నో ఎంట్రీ! | Indian Consulate Dubai Ends Walk-In Services: New Passport Visa Appointment Rules UAE | Sakshi
Sakshi News home page

దుబాయ్‌ భారత కాన్సులేట్‌లోకి ఇక నేరుగా నో ఎంట్రీ!

Jul 7 2026 12:32 AM | Updated on Jul 7 2026 1:19 AM

Indian Consulate Dubai Ends Walk-In Services: New Passport Visa Appointment Rules UAE

 

దుబాయ్‌లోని భారత కాన్సులేట్ పాస్‌పోర్ట్, వీసా, అటెస్టేషన్ తదితర కాన్సులర్ సేవల కోసం వాక్-ఇన్ ప్రవేశాన్ని నిలిపివేసింది. ఇకపై ముందస్తుగా ఆన్‌లైన్‌లో అపాయింట్‌మెంట్ బుక్ చేసుకున్నవారికే కాన్సులేట్‌లో ప్రవేశం కల్పించనున్నట్లు కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. కొత్తగా ప్రారంభించిన book.passportindiauae.com పోర్టల్ ద్వారా ధ్రువీకరించిన అపాయింట్‌మెంట్ తప్పనిసరిగా ఉండాలి.

అబుదాబిలోని భారత రాయబార కార్యాలయంలో మాత్రం పరిమిత స్థాయిలో వాక్-ఇన్ సేవలు కొనసాగుతాయి. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ఇటీవల దరఖాస్తుదారుల సంఖ్య భారీగా పెరగడంతో సేవలను క్రమబద్ధీకరించేందుకు ఈ మార్పులు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

అపాయింట్‌మెంట్ స్లాట్లు ప్రతి రోజు రాత్రి 8 గంటలకు విడుదల చేయబడతాయి. అవి తదుపరి రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట మధ్య సేవల కోసం చెల్లుబాటు అవుతాయి. అపాయింట్‌మెంట్ సమయానికి 15 నిమిషాల కంటే ముందుగా ప్రవేశం ఉండదని కాన్సులేట్ స్పష్టం చేసింది.

రద్దీని తగ్గించేందుకు సాధారణంగా దరఖాస్తుదారులకే ప్రవేశం ఉంటుంది. అయితే ఇద్దరు తల్లిదండ్రులు హాజరు కావాల్సిన మైనర్ పిల్లల దరఖాస్తుల విషయంలో మినహాయింపు ఉంటుంది. దుబాయ్ కాన్సులేట్‌లో ప్రవేశం గేట్ నంబర్-1 ద్వారా కల్పించనున్నారు.

నవజాత శిశువుల పాస్‌పోర్ట్ దరఖాస్తులు, అలాగే అత్యవసర ప్రయాణ పత్రం (ఎమర్జెన్సీ సర్టిఫికేట్) కోసం వచ్చే వారికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు వెల్లడించారు.

దరఖాస్తుదారులు పూర్తిగా నింపిన ఫారమ్‌లు, అవసరమైన పత్రాలు, స్పష్టమైన ఫోటోలు, సంతకాలు/బొటనవేలు ముద్రలను ముందుగానే అప్‌లోడ్ చేసి రావాలని సూచించారు. పాస్‌పోర్ట్ దరఖాస్తులు అధికారిక పోర్టల్ mportal.passportindia.gov.in/mission లో సమర్పించవచ్చు.

మరోవైపు, జూలై 1, 2026 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త పాస్‌పోర్ట్ ఫీజు నిర్మాణాన్ని కూడా కాన్సులేట్ గుర్తుచేసింది. ప్రస్తుతం వర్తించే ఫీజులు నగదు రూపంలో మాత్రమే స్వీకరిస్తున్నందున ఖచ్చితమైన చిల్లరతో రావాలని దరఖాస్తుదారులకు సూచించింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement