Hyderabad: బిర్యానీ ఆర్డర్‌ చేసుకుంటున్న వారికి షాక్‌ | Hyderabad Banjara Hills Stale Biryani Case Hotel Seized | Sakshi
Sakshi News home page

Hyderabad: బిర్యానీ ఆర్డర్‌ చేసుకుంటున్న వారికి షాక్‌

Apr 7 2026 9:17 AM | Updated on Apr 7 2026 12:47 PM

Hyderabad Banjara Hills Stale Biryani Case Hotel Seized

హైదరాబాద్: మూడు రోజుల క్రితం తయారుచేసిన బిర్యానీని ఫ్రిడ్జ్‌లో భద్రపరిచి ఆర్డర్‌ రాగానే ఓవెన్‌లో వేడి చేసి డెలివరీ చేస్తున్న హోటల్‌ యజమానిపై బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్‌ కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌–2లోని వెంకటరమణకాలనీలో నివసించే కొండారెడ్డి ఆదివారం ఉదయం జొమాటోలో చికెన్‌ బిర్యానీ ఆర్డర్‌ చేశాడు. రోడ్‌ నెంబర్‌–2లోనే ఉన్న లక్కీ బిర్యానీ షవర్మ రెస్టారెంట్‌ నుంచి డెలివరీబాయ్‌ చికెన్‌ బిర్యానీ తీసుకుని కొండారెడ్డికి అందించాడు.  పొట్లం విప్పి చూడగా బిర్యానీ నుంచి దుర్వాసన వచి్చంది. 

పరిశీలించగా కొంత కుళ్లిపోయి కనిపించింది. వెంటనే ఆయన బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు లక్కీ బిర్యానీ సెంటర్‌కు వెళ్లి తనిఖీలు నిర్వహించగా ఫ్రిడ్జ్‌లో 80 బిర్యానీ ప్యాకెట్లు ఉన్నాయి. జీడిమెట్లలో సదరు హోటల్‌ యజమాని ఇర్ఫాన్‌  ఈ బిర్యానీని తయారుచేసి ఇక్కడి అవుట్‌లెట్‌లో భద్రపరుస్తూ ఆర్డర్‌ రాగానే ఓవెన్‌లో వేడి చేసి ప్యాక్‌ చేసి సరఫరా చేస్తున్నట్లు తేలింది. అంతేకాకుండా ఒక ఫ్రిడ్జ్‌ను తెరిచి చూడగా అందులో ఎలుకలు తిరగడం కూడా పోలీసులు గుర్తించారు. జీడిమెట్లలో మూడు రోజుల క్రితం తయారుచేసిన బిర్యానీని ఇర్ఫాన్‌ ప్యాకెట్లుగా తయారుచేసి బంజారాహిల్స్‌లోని తనకు చెందిన లక్కీ బిర్యానీ సెంటర్‌లో భద్రపరుస్తున్నట్లుగా తేలింది. 

దుర్వాసనలతో కూడిన బిర్యానీని సరఫరా చేసిన ఇర్ఫాన్‌పై పోలీసులు కేసు నమోదు చేసి హోటల్‌ను సీజ్‌ చేశారు. ఈ హోటల్‌ మొత్తం ఎలుకలు, బొద్దింకలు, దుర్వాసనలు, దుర్గంధంతో అపరిశుభ్రతకు కేరాఫ్‌ అడ్రెస్‌గా ఉన్న విషయాన్ని కూడా పోలీసులు నిర్థారించారు. ఫుడ్‌సేప్టీ అధికారులు కూడా హోటల్‌లో తనిఖీలు నిర్వహించారు. బంజారాహిల్స్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement