బడిగంట – 5
స్కూల్ మొదలైంది. టీచర్లు కొత్త ఉత్సాహంతో హోమ్‌వర్క్ అసైన్ చేస్తారు. ఇక ఇళ్లల్లో టెన్షన్. సాయంత్రం ఆరు కాగానే ‘హోంవర్క్ చేశావా?’ అమ్మ అరుపు.‘ఇంకా టైం ఉంది’ పిల్లాడి టీవీ చూపు. రాత్రి తొమ్మిదికి ‘అవలేదు... రేపే సబ్మిట్ చేయాలి’ పిల్లాడి మాటకు నాన్న బీపీ చెక్ చేసుకుంటాడు. హోంవర్క్ ‘పనిష్మెంట్’ కాదు. దాని ఉద్దేశం క్లాస్‌లో విన్నది ఇంటిదగ్గర ‘రీప్లే’ చేసి మెదడులో ‘సేవ్’ చేసుకోవడం. మరి హోంవర్క్‌ను హ్యాపీవర్క్‌గా ఎలా చేయాలి?
స్కూళ్లు తెరిచాక పిల్లలకే కాదు, పేరెంట్స్‌కి కూడా సాయంత్రం ఆరు నుంచి తొమ్మిది దాకా ‘హోంవర్క్ అవర్స్’ అంటే హారర్ మూవీ. ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చిన నాన్నకి లెక్కలు చెప్పాల్సిన టెన్షన్, వంటింట్లోంచి బయటకొచ్చిన అమ్మకి స్పెల్లింగ్స్ దిద్దాల్సిన టెన్షన్. చివరికి ‘చదువు నీ కోసమా, మా కోసమా’ అనే దగ్గరికి వస్తుంది. నిజానికి హోంవర్క్ పిల్లల బాధ్యత. దాన్ని ‘ఫ్యామిలీ ప్రాజెక్ట్’ చేయకుండా, ‘సెల్ఫ్ ప్రాజెక్ట్’గా మార్చి, పిల్లలే ఇష్టపడి చేసేలా మలచాలి.
25 నిమిషాల రూల్
సైకాలజీ లెక్క ప్రకారం పిల్లాడి వయసు X 2 నిమిషాలు = అటెన్షన్ స్పాన్. అంటే 7 ఏళ్ల పిల్లాడికి 14 నిమిషాలు. అంతే. ఆ తర్వాత బుర్ర ‘రిఫ్రెష్’ అవాలి. అందుకే రెండు గంటల పాటు హోంవర్క్ అంటే బిక్కమొహం పెడతారు. దీనికి 25 నిమిషాల రూల్ ఉంది.
అదేంటంటే 25 నిమిషాలు ఫుల్ ఫోకస్‌తో హోంవర్క్ చేయాలి. మ్యాథ్స్ కావచ్చు, ఇంగ్లిష్ నోట్స్ రాయడం కావచ్చు. టైం అయ్యాక ఐదు నిమిషాలు బ్రేక్ ఇవ్వాలి. ఆ ఐదు నిమిషాల్లో వాటర్ తాగడం, చిరుతిండి, బాల్కనీలోకి వెళ్లి రావడం. మళ్లీ 25 నిమిషాలు హోంవర్క్ చేయాలి. ఇలా 4 రౌండ్లు చేస్తే 100 నిమిషాల హోంవర్క్ అయిపోతుంది. పిల్లలకు ‘2 గంటలు’ అనే భయం ఉండదు. ‘జస్ట్ 25 నిమిషాలు’ అనిపిస్తుంది. ఫోన్ లో అలారం పెట్టి 25 నిమిషాలకు ‘టింగ్’ అనగానే పెన్సిల్ పడేయాలి. ఇది గేమ్‌లా మారితే పిల్లలు ఎగబడి చేస్తారు.
హోంవర్క్ మెనూ
పిల్లలకు ‘ఇవాళ మొత్తం చెయ్యాలి’ అంటేనే సగం ఎనర్జీ పోతుంది. అందుకే హోంవర్క్‌ని ‘మెనూ కార్డ్’లా మార్చండి.
ఒక మెనూ పిల్లాడి ఎదురుగా పెట్టండి
స్టార్టర్: ఇంగ్లీష్ వర్డ్ మీనింగ్స్ – 5 నిమిషాలు
మెయిన్ కోర్స్: మ్యాథ్స్ సమ్స్ – 15 నిమిషాలు
డెజర్ట్: తెలుగు పోయెమ్ కంఠస్థం – 10 నిమిషాలు
‘ముందు ఏది తింటావ్?’ అని పిల్లల్ని అడగండి. ‘ఛాయిస్’ ఇచ్చినట్టు ఉంటుంది. కష్టమైన మ్యాథ్స్‌ని ‘మెయిన్ కోర్స్’ అన్నాం కాబట్టి ముందు ఈజీ ఉన్న ‘స్టార్టర్’ కంప్లీట్ చేస్తారు. కాన్ఫిడెన్స్ వస్తుంది. ఒకో ఐటమ్ అయ్యాక టిక్ పెట్టండి. ‘మెనూ కంప్లీట్’ అని స్టిక్కర్ ఇవ్వండి. హోంవర్క్ అయిపోయిన ఫీలింగ్ కాకుండా ‘రెస్టారెంట్‌లో ఫుల్ మీల్స్ తిన్నాం’ అనే ఫీలింగ్ వస్తుంది.
పిల్లాడే టీచర్
హోంవర్క్ బోర్ ఎందుకంటే పిల్లాడు ఎప్పుడూ ‘స్టూడెంట్’. అప్పుడప్పుడు వాడిని ‘టీచర్’ని చేయండి. మ్యాథ్స్ హోంవర్క్ చేసిన తర్వాత వాడు టీచర్‌లా మారి బోర్డు లేదా పేపర్ మీద ఆ సమ్ ఎలా చేశాడో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. మీరు కావాలని ఒకచోట తప్పు అడగండి. వాడు మిమ్మల్ని కరెక్ట్ చేయాలి.
‘ఎదుటివారికి చెప్పడం’ అనేది నేర్చుకోవడంలో అత్యంత బలమైన పద్ధతి. దీన్ని ‘ఫెయిన్ మన్ టెక్నిక్’ (నోబెల్ లారియేట్, భౌతిక శాస్త్రవేత్త రిచర్డ్ ఫెయిన్ మన్ సూచించిన పద్ధతి) అంటారు. పిల్లవాడు టీచర్ అవ్వగానే వాడికి సబ్జెక్ట్ మీద పట్టు వస్తుంది, ఆత్మవిశ్వాసం వస్తుంది. ఆ కిక్ వాడిని మరుసటి రోజు హోంవర్క్ వైపు లాగుతుంది.
పేరెంట్స్‌కి హెచ్చరిక
మీరే చేయకండి: హెల్ప్ చేయండి, కానీ ఆన్సర్ మీరు రాయకండి.
‘మూడ్’ చూడండి: హోంవర్క్ చేస్తూ పిల్లవాడు నవ్వుతున్నాడా, ఏడుస్తున్నాడా? నవ్వుతూ చేస్తే 5 మార్కులైనా చాలు. ఏడుస్తూ 10 మార్కులు వచ్చినా వేస్ట్.
టీవీ, ఫోన్ బంద్: ‘నువ్వు చదువు, నేను రీల్స్ చూస్తా’ అంటే పిల్లాడికి కడుపు మండుతుంది. హోంవర్క్ టైమ్‌లో మీరు పేపర్ చదవండి, పుస్తకం చదవండి.
మార్కుల పంట
హోంవర్క్ శిక్ష కాదు. ‘స్కూల్‌కి ఇంటికి మధ్య వేసే చిన్న వంతెన’. ఆ వంతెన మీద పిల్లలు నవ్వుతూ నడవాలి, ఏడుస్తూ కాదు. టీచర్ క్లాస్‌లో విత్తనం వేస్తే, హోంవర్క్ అనే నీళ్లు ఇంటిదగ్గర పోయాలి. అప్పుడే మార్కులు అనే పంట పండుతుంది.
– కె.


