ప్రతీకాత్మక చిత్రం (ఏఐ ఫోటో)
దేవతలు తాగే అమృతం కావాలంటే, మందర పర్వతాన్ని మోసుకొచ్చి, దాన్ని కవ్వంగా చేసి, క్షీర సాగరాన్ని చేతులు పడిపోయేలా చిలకాలి. అది మహామహులకే తప్ప, మామూలు మనుషులకు సాధ్యమయ్యే పని కాదు. అలాగని దిగులు అక్కర్లేదు. భక్త కవీంద్రుడు లీలాశుకుడు తన కవితాశక్తి అనే కవ్వంతో, నుడి కడలిని మథించి వెలికి తీసిన ‘కృష్ణ కర్ణామృతం’ ఉంది.
వీనుల విందు చేసే ఈ అమృతాన్ని, అభిరుచి ఉన్నవారెవరయినా, ఉచితంగా, తనివి తీరా ఆస్వాదించవచ్చు. లీలాశుకుడు ఈ కావ్యంలో తన ఇష్టదైవమైన బాలగోపాల కృష్ణుడిని ఎన్నెన్నో శబ్దాలంకారాలతో, అర్థాలంకారాలతో, చమత్కారాలతో అలంకరించి తరించాడు. ఆ కర్ణామృత కలశంలో ఒక్క చుక్క పట్టి చూసినా, అమృతం నాణ్యత అర్థమైపోతుంది.
మన్మథుడు తుంట వింటివాడే కాదు. తుంటరివాడు కూడా. ఎంతో ప్రయత్నంతో, ఎన్నో సాధనలతో కష్టపడి, శుద్ధి చేసుకొన్న మహాభక్తుడి మనసులోకి ఎలాగో చొచ్చుకుపోతాడు. మదన వికారాల మాలిన్యంతో దాన్ని మళ్లీ మైల పడేస్తాడు. అలాంటి ఆగడాలు తన దగ్గర సాగవని లీలాశుకుడు మృదుమధురంగా, సొగసుగా, గడుసుగా మంద లిస్తూ..
‘మార! మా రమ మదీయ మానసే,
మాధవైక నిలయే యాదృచ్ఛయా!’
అంటాడు. ‘‘మదనుడా! నా మనసులో దూరి అల్లరి చేయకు. ఇది మాధవుడు ఒక్కడి కోసం అచ్చంగా ఏర్పరచిన మందిరం. ఇక్కడ స్వేచ్ఛా విహారం చేస్తూ, ‘రమించ’కు. మా రమ!’ అని. అలా రమిస్తూ, ఆగం చేస్తే ఏమౌతుంది? కొంప మునుగుతుంది.
ఎందుకంటే, 'శ్రీ రమాపతిః – ఇహ – ఆగమేత్ – అసౌ’ ఇల్లుగలాయన అయిన ‘రమాధవుడు ఇప్పుడో, ఇంకాసే పట్లోనో ఇక్కడికి వస్తాడు.’ ఆయన నీ గోల చూస్తే నీ వీపు విమానం మోత మోగిస్తాడో, తాట ఒలిచేస్తాడో!
కః సహేత నిజ వేశ్మ లంఘనమ్? ‘తన ఇంట్లో పరులు స్వేచ్ఛగా జొరబడితే, ఎవరు సహిస్తారు?’ అందులో ఆయన సామాన్యుడా? సకల శక్తిశాలి. ఏమయినా చేయగలడు. ‘కనుక బతుకు మీద తీపి ఉంటే, నా నుంచి దూరంగా పారిపో!’’ అని పంచశరుడిని భక్తాగ్రణి హెచ్చరిస్తున్నాడు.
– ఎం. మారుతి శాస్త్రి


