ఇరాన్, ఉక్రెయిన్ యుద్ధాలను, వీటిలో యూఎస్‌ఏ పాత్రను విస్తృత అంతర్జాతీయ జియో పొలిటికల్ క్రీడలో భాగంగా చూడాలి. 2035లో ప్రపంచ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారబోతున్నది. ఈ పరిణామంలో భాగమే ఈ యుద్ధాలు. గత 250 సంవత్సరాల అమెరికా చరిత్ర పూర్తిగా యుద్ధాలతోనే ముడిపడి ఉన్నది. గత శతాబ్దంలో ప్రతి 20 సంవత్సరాలకు కనీసం ఒక పెద్ద యుద్ధానికి తెరతీసింది. పద్దెనిమిది,పందొమ్మిది శతాబ్దాలలో దేశ విస్తరణకు బ్రిటన్, ఫ్రాన్స్, స్పెయిన్, మెక్సికోలతో యుద్ధం చేసింది. ఇరవయ్యవ శతాబ్దంలో ఫిలిప్ఫైన్, రెండు ప్రపంచ యుద్ధాలు, కొరియా, వియత్నాం, బోస్నియా, గల్ఫ్ యుద్ధాలలో నిమగ్నమైంది.
ఇరవయ్యొకటవ శతాబ్దంలో అఫ్గాని స్తాన్, ఇరాక్, లిబియా, యెమెన్, సిరియా, సోమాలియాలలో యుద్ధాలను లేవనెత్తింది. గత 250 ఏళ్లలో యూఎస్‌ఏ కేవలం 1865–1898 (33 సం‘‘లు), 1918–1945 (27 సం‘‘లు) మధ్య మాత్రమే యుద్ధానికి దూరంగా ఉన్నది. శాంతి కోసం యుద్ధం, సుభిక్షానికి యుద్ధం, సుస్థిరతకు యుద్ధం అనేది అమెరికా పాలనా విధానం. శక్తిని చాటి చెప్పటానికి యుద్ధాన్ని ఒక పరికరంగా పరిగణిస్తుంది. ఈ యుద్ధ తంత్రానికి ప్రజాస్వామ్యం, మానవ హక్కులు, ఉదారవాద విధానాల ముసుగు కప్పుతుంది.
కథ అడ్డం తిరిగింది!
సోవియెట్ యూనియన్ విచ్ఛిన్నం తరువాత ప్రపంచంపై తన ఏకచ్ఛత్రాధిపత్యాన్ని నిలబెట్టుకోవటానికి అమెరికా సర్వశక్తులు ఒడ్డింది. ప్రత్యర్థి రష్యాను పూర్తిగా అణచివేయాలని నాటోను విస్త రించింది. 2010కల్లా రష్యా ఆర్థికంగా పుంజుకొని అమెరికాకు సవా లుగా తయారైంది. ఇదే సమయంలో అనూహ్యంగా చైనా బలమైన ప్రత్యర్థిగా ఎదిగింది. 2020కల్లా భారత్, బ్రెజిల్, దక్షిణ ఆఫ్రికాలు కూడా బలమైన శక్తులుగా రూపుదిద్దుకున్నాయి. బ్రిక్స్ రూపంలో కూటమిగా చేరి, అమెరికన్ ఆర్థిక వ్యవస్థకు ప్రత్యామ్నాయాలను సంకల్పించటంతో కథ అడ్డం తిరిగింది.
బహుళ ధ్రువ ప్రపంచం ఏర్పడటం ఖాయమనే విశ్లేషకుల జోస్యాన్ని తప్పుగా నిరూపించాలని కృతనిశ్చయంతో ఉన్నది. అమెరికా ముందు మూడు ప్రత్యామ్నాయాలున్నాయి. 1. ప్రత్యర్థు లను నిర్వీర్యం చేసి ఏకైక ప్రపంచ శక్తిగా కొనసాగటం. 2. ప్రత్య ర్థులతో రాజీపడి పరిమిత ధ్రువ (లిమిటెడ్ పోలార్) ప్రపంచంలో ప్రధాన శక్తిగా కొనసాగటం. 3. ప్రత్యర్థులతో రాజీపడి బహుళ ధ్రువ (మల్టీ పోలార్) ప్రపంచంలో ప్రధాన శక్తిగా కొనసాగటం.
మూడింట్లో మొదటి దారి
ప్రస్తుతం అమెరికా ఏకైక ప్రపంచ శక్తిగా కొనసాగాలనే పట్టు దలతోనే ఉన్నట్లుగా కన్పిస్తున్నది. ఇందులో భాగంగానే ఇంధన వనరులు, ఇంధన రవాణా మార్గాలపై పెత్తనానికి సర్వశక్తులు ఒడ్డు తున్నది. రష్యాపై తీవ్రస్థాయిలో ఆంక్షలు విధించి ఉక్రెయిన్ యుద్ధపు పద్మవ్యూహంలోనికి రష్యాను లాగింది. రష్యానుండి చమురు, గ్యాస్ ఎవరూ కొనగూడదని ఐరోపా, భారత్‌లను కట్టడి చేసింది. దీర్ఘకాలిక యుద్ధంలో ఉక్రెయిన్ వెనుక నిలబడి రష్యా అలసిపోయి నిర్వీర్యమవటానికి దీర్ఘకాలిక ప్రణాళికను అమలు పరుస్తున్నది. అందుకే నెల లోపున ముగుస్తుందనుకున్న ఉక్రెయిన్ యుద్ధం నాలుగన్నర సంవత్సరాలకు కూడా కొనసాగుతున్నది.
ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం చైనా చేతిలో పడకుండా చూడటం ద్వారా చైనాను కట్టడి చేయాలనేది అమెరికా వ్యూహం. ‘చిప్ 4’ అలయన్స్‌లో భాగంగా అమెరికా, తైవాన్, ద.కొరియా, జపాన్‌లు చైనాకు అత్యాధునిక సెమీకండక్టర్ చిప్‌లు అందుబాటు లోనికి రాకుండా ప్రయత్నిస్తున్నాయి. ఆకస్ కూటమిలో భాగంగా ఆస్ట్రేలియా, యూకే, యూఎస్‌ఏలు ఏఐ, క్వాంటమ్ మెకానిక్స్ హైపర్‌సోనిక్ టెక్నాలజీని చైనాకు అందకుండా చేయటానికి ప్రయ త్నిస్తున్నాయి. జీ7, యూరోపియన్ యూనియన్‌ల ద్వారా అత్యాధు నిక చిప్స్ తయారు చేసే యంత్రాలను ఏఎస్‌ఎంఎల్ (నెదర్లాండ్స్), టోక్యో ఎలక్ట్రానిక్ (జపాన్) కంపెనీలు చైనాకు ఎగుమతి చేయకుండా ఆంక్షలు పెట్టాయి. తైవాన్‌ను సమర్థించటం ద్వారా కూడా చైనాకు చెక్ పెట్టటానికి అమెరికా ప్రయత్నిస్తున్నది.
విశేషంగా ఇంధన వనరులున్న ఇరాన్, ఇరాక్, సౌదీ, యూఏఈ, కువైట్ మొదలైన గల్ఫ్ దేశాలపై నియంత్రణకు అమెరికా దీర్ఘకాలికంగా వ్యూహాలను అమలుపరుస్తున్నది. సైనిక స్థావరాల ద్వారా గల్ఫ్ దేశాలలో అమెరికా ఇప్పటికే పాగా వేసింది. ఈ ఇంధన వనరుల నియంత్రణలో అమెరికాకు కొరకరాని కొయ్యగా మారింది ఇరాన్. అందుకే హార్మూజ్, బాబెల్ మాండెబ్ జలసంధులపై పెత్తనానికి అమెరికా ప్రయత్నిస్తున్నది.
ఆసియాలో భారత్ ఆధిపత్యం?
అమెరికా తన ఆధిపత్యాన్ని కొనసాగించే వ్యూహంలో భాగాలే ఉక్రెయిన్, ఇరాన్ యుద్ధాలు. అందువలన ఈ రెండు ఇప్పట్లో ముగిసే అవకాశాలు లేవు. ఇరాన్ యుద్ధం వలన తీవ్రంగా నష్ట పోయేది భారత్, చైనాలని గుర్తించాలి. చైనా, రష్యా, భారత్‌లను ఈ రెండు యుద్ధాల ద్వారా కట్టడి చేయటం సాధ్యం కాని పక్షంలో అమె రికా పరిమిత ధ్రువ ప్రపంచానికి రాజీ పడాల్సి వస్తుంది. రష్యా, చైనా/భారత్‌లను ప్రపంచ శక్తులుగా అంగీకరించాల్సి వస్తుంది. క్రమంగా నాటోను రద్దుపరచి ఐరోపాపై రష్యా ఆధిపత్యానికి అంగీ కరించి ఉత్తర, మధ్య, దక్షిణ అమెరికాలకు యూఎస్‌ఏ తన ఆధిప త్యాన్ని పరిమితం చేసుకోవాల్సి ఉంటుంది.
దక్షిణ, తూర్పు ఆసి యాలలో చైనా ఆధిపత్యాన్ని అంగీకరించి గల్ఫ్ ప్రాంతంలో ఇజ్రా యెల్–యూఏఈ– సౌదీల ద్వారా నియంత్రణకు ప్రయత్నిస్తుంది. అయితే దక్షిణ, తూర్పు ఆసియాలలో ఆధిపత్యంతో చైనా సరిపెట్టుకోక పోవచ్చును. చైనా ప్రపంచాధిపత్యానికి ప్రయత్నించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా
క్రమంగా రష్యాతో ఒప్పందం ద్వారా చైనాకు వ్యతిరేకంగా భార త్‌ను ఆసియాలో ఆధిపత్యానికి ప్రోత్సహించవచ్చును.
2040 కల్లా చైనా ప్రపంచ శక్తిగా అమెరికా, రష్యాలనే సవాలు చేయవచ్చని విశ్లేషకుల అంచనా. ఈనాడు ప్రత్యర్థులుగా ఉన్న రష్యా, అమెరికాలు కలిసి చైనాను నిలువరించాల్సి రావచ్చును. రాజకీయాలలో శాశ్వత మిత్రత్వం కానీ శాశ్వత శతృత్వం కానీ ఉండదు. అమెరికా, రష్యాలు, ఆసియాలో భారత్ వైపే మొగ్గు చూప టానికి అవకాశం ఉన్నది. తైవాన్‌ను చైనా ఆక్రమించటానికి ప్రయ త్నించినప్పుడు చైనాను ఇంకొకవైపు నుండి నిలువరించటానికి భారత్ సిద్ధమవవచ్చును. ఒకవైపు హిమాలయాలలో చైనాపై దాడి చేస్తూనే భారత్ మలక్కా జలసంధిని దిగ్బంధనం చేయవచ్చు. ఆ సందర్భంలో చైనా సముద్రంలో అమెరికా, జపాన్‌లను చైనా ఎదు ర్కోవటం కష్టమవుతుంది. భారత్‌కు అమెరికా సైనిక, వ్యూహాత్మక మద్దతును అందించవచ్చును.
కాకపోతే, ఈ అమెరికన్ అంతర్జాతీయ రాజకీయ వ్యూహంలో పావుగా మారటానికి భారత్ ఒప్పుకోకపోవచ్చును. ప్రాంతీయంగా ఆసియాలో చైనాను నియంత్రించటానికి భారత్ ఒప్పుకుంటుంది. కానీ అంతర్జాతీయంగా చైనాను నిరోధించే వ్యూహంలో భారత్ భాగ స్వామిగా మారాల్సిన అవసరం భారత్‌కు లేదు. ఏది ఏమయినా ఉక్రెయిన్, ఇరాన్ యుద్ధాలు అంతర్జాతీయ రాజకీయ యవనికను నియంత్రించే కీలక ఘట్టాలనటంలో సందేహం లేదు. భారత్ ఆచి తూచి అడుగులు వేయాల్సి ఉంటుంది.
-వ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్); సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు
- గురజాల శ్రీనివాసరావు


