మాస్కో: టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్‌కు రష్యా అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఉగ్రవాద కార్యకలాపాలకు సహకరించారని రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ (ఎఫ్‌ఎస్‌బీ) అభియోగాలు మోపింది. దేశంలో విధ్వంసకర, తీవ్రవాద, సైబర్ మోసాల కార్యకలాపాలను సమన్వయం చేయడానికి ఉపయోగించినట్లు ఆరోపణలున్న కంటెంట్‌ను తొలగించడంలో మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ విఫలమైందని ఆరోపించింది.
రష్యాలో దాడులు, విధ్వంసాలకు పాల్పడేందుకు ఉక్రెయిన్ నిఘా వర్గాలు, ఉగ్రవాద సంస్థలు టెలిగ్రామ్‌ను వాడుకుంటున్నాయని ఎఫ్‌ఎస్‌బీ ఆరోపించింది. రష్యా క్రిమినల్ కోడ్ కింద దురోవ్‌పై క్రిమినల్ కేసు నమోదు చేశారు. దీనిపై పావెల్ దురోవ్ (Pavel Durov) గానీ, టెలిగ్రామ్ గానీ వెంటనే స్పందించలేదు.
డిజిటల్ వేదికలపై నియంత్రణను కఠినతరం చేయడానికి రష్యా చాలాకాలంగా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే ఈ చర్యలు తీసుకుంది. దేశంలో టెలిగ్రామ్ వాడకాన్ని నియంత్రించేందుకు ఇప్పటికే పలు ఆంక్షలు విధించడంతో పాటు, స్వదేశీ మెసెంజర్ ‘ఎమ్‌ఏఎక్స్’ (మ్యాక్స్)ను ప్రోత్సహిస్తోంది. రష్యాలోనే జన్మించి, ప్రస్తుతం దుబాయ్‌లో నివసిస్తున్న దురోవ్‌కు యూఏఈ, ఫ్రాన్స్ పౌరసత్వం ఉంది.
చదవండి: వెలుగులోకి ఘోరాలు, రష్యాపై షాకింగ్ ఆరోపణలు
ఫ్రాన్స్‌లోనూ టెలిగ్రామ్ ప్రస్తుతం పరిశీలనను ఎదుర్కొంటోంది. నేర కార్యకలాపాలను అరికట్టడంలో టెలిగ్రామ్ విఫలమైందని, చట్ట అమలు సంస్థల అభ్యర్థనలకు తగినంతగా సహకరించలేదని వచ్చిన ఆరోపణలపై ఫ్రెంచ్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.


