అమెరికా ‘హెవీ వేవ్‌’ దాడులు.. విస్తరిస్తున్న యుద్ధం! | Middle East on Fire: US Strikes Iran as Regional War Expands | Sakshi
Sakshi News home page

అమెరికా ‘హెవీ వేవ్‌’ దాడులు.. విస్తరిస్తున్న యుద్ధం!

Jul 30 2026 9:17 AM | Updated on Jul 30 2026 9:30 AM

Middle East on Fire: US Strikes Iran as Regional War Expands

మిడిల్‌ ఈస్ట్‌లో యుద్ధ మేఘాలు మరింత కమ్ముకుంటున్నాయి. అమెరికా–ఇరాన్‌ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఇప్పుడు ప్రాంతీయ యుద్ధం దిశగా సాగుతున్నాయి. ఇరాన్‌ నుంచి అమెరికా స్థావరాలపై జరిగిన క్షిపణి దాడులకు ప్రతీకారంగా అమెరికా భారీ వైమానిక దాడులు చేపట్టింది. దక్షిణ ఇరాన్‌లోని కీలక ప్రాంతాలపై ‘హెవీ వేవ్‌’ పేరుతో దాడులు నిర్వహించినట్లు అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ ప్రకటించింది. ఈ దాడులతో పాటు ఇరాక్‌లో ఇరాన్‌ అనుకూల మిలీషియాలపై అమెరికా, సౌదీ అరేబియా సంయుక్త చర్యలు చేపట్టడం, యెమెన్‌లో హౌతీల కదలికలు, హర్ముజ్‌ జలసంధిలో ఉద్రిక్తతలు పెరగడం.. మొత్తం ప్రాంతాన్ని యుద్ధ వాతావరణంలోకి నెట్టాయి.

ఇరాన్‌లోని రెవల్యూషనరీ గార్డ్‌ (IRGC)కు చెందిన స్థావరాలే లక్ష్యంగా తాజాగా అమెరికా దాడులు జరిపింది. సైనిక కమాండ్‌ కేంద్రాలు, మిసైల్‌, డ్రోన్‌ సదుపాయాలు, తీర రక్షణ వ్యవస్థలు, సముద్ర కార్యకలాపాలకు సంబంధించిన కేంద్రాలను టార్గెట్‌ చేసినట్లు అమెరికా వెల్లడించింది. అబాదాన్‌, బుషెహర్‌, కిష్‌, క్విష్మ్‌ దీవులు, ఖుజెస్తాన్‌ ప్రావిన్స్‌లోని పలు ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్‌ మీడియా తెలిపింది. కిష్‌ దీవిలోని కజెరూన్‌ ప్రాంతంలోనూ పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు సమాచారం.

క్విష్మ్‌లో నివాస భవనంపై మిసైల్‌.. రెస్క్యూ కొనసాగింపు
అమెరికా దాడుల్లో క్విష్మ్‌ దీవిలోని ఓ నివాస భవనం దెబ్బతింది. మిసైల్‌ దాడితో భవనం కూలిపోవడంతో పలువురు శిథిలాల కింద చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. సహాయక బృందాలు రంగంలోకి దిగి ఇద్దరు చిన్నారులను రక్షించి ఆస్పత్రికి తరలించాయి. మరో ముగ్గురి కోసం శిథిలాల తొలగింపు, రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతోంది. ఈ ఘటన యుద్ధంలో పౌర ప్రాంతాలు కూడా ప్రభావితమవుతున్నాయన్న ఆందోళనలను పెంచింది.

‘ఇప్పుడు మా వంతు’.. ట్రంప్‌ హెచ్చరికల తర్వాతే దాడులు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇరాన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమెరికా బలగాలపై దాడులకు ప్రతిస్పందన తప్పదని స్పష్టం చేసిన ఆయన.. “ఇప్పుడు కొట్టే వంతు మాది” అనే సంకేతాలు ఇచ్చారు. ఇరాన్‌ నుంచి దాడులను ఆపాలని కోరినా అమెరికా చర్యలు తప్పవని ట్రంప్‌ వ్యాఖ్యానించిన కొద్దిసేపటికే వైమానిక దాడులు ప్రారంభమయ్యాయి.

జోర్డాన్‌లో అమెరికా స్థావరాలపై ఇరాన్‌ దాడులు
ఇటీవల జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్‌ క్షిపణి దాడులు చేసినట్లు అమెరికా ఆరోపించింది. దీనికి ప్రతీకారంగానే తాజా ఆపరేషన్‌ చేపట్టినట్లు వాషింగ్టన్‌ వెల్లడించింది. మరోవైపు ఇరాన్‌ మాత్రం తమ చర్యలను అమెరికా బెదిరింపులకు ప్రతిస్పందనగా సమర్థించుకుంది. అమెరికా ఒత్తిడి కొనసాగితే ప్రతిఘటన కూడా కొనసాగుతుందని ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్‌ హెచ్చరించింది.

ఇరాక్‌లో అమెరికా–సౌదీ దాడులు.. తీవ్ర ఉద్రిక్తత
యుద్ధ ప్రభావం ఇరాక్‌కు కూడా చేరింది. ఇరాన్‌కు అనుబంధంగా ఉన్న మిలీషియా గ్రూపుల స్థావరాలపై అమెరికా, సౌదీ అరేబియా సంయుక్త దాడులు జరిపాయి. ఈ దాడుల్లో పాపులర్‌ మొబిలైజేషన్‌ ఫోర్సెస్‌ (PMF)కు చెందిన పలువురు సభ్యులు మరణించినట్లు సమాచారం. కనీసం 20 మంది మృతి చెందినట్లు ఆ సంస్థ ప్రకటించింది. అయితే ఇరాక్‌ ప్రభుత్వం ఈ చర్యలను తీవ్రంగా ఖండించింది. తమ దేశ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించారని, అమాయకులు ప్రాణాలు కోల్పోయారని ఆరోపించింది.

రంగంలోకి హౌతీలు.. యెమెన్‌ నుంచి మరో ముప్పు
ఇరాన్‌కు మద్దతుగా వ్యవహరిస్తున్న యెమెన్‌లోని హౌతీ గ్రూపు కూడా ఈ ఘర్షణలో కీలక పాత్ర పోషిస్తోంది. సౌదీ అరేబియా చమురు రవాణా వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని హౌతీలు దాడులు చేసినట్లు సమాచారం. దీనికి ప్రతిగా హోడెయిడా ప్రావిన్స్‌లోని హౌతీ స్థావరాలపై దాడులు జరిగినట్లు తెలుస్తోంది. దీంతో యుద్ధ ప్రభావం గల్ఫ్‌ ప్రాంతం దాటి యెమెన్‌ వరకు విస్తరించింది.

హర్ముజ్‌ జలసంధిలో పెరుగుతున్న టెన్షన్‌
ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్ముజ్‌ జలసంధి మరోసారి యుద్ధ కేంద్రంగా మారింది. ఈ మార్గంలో ప్రయాణించే నౌకలపై ఇరాన్‌ ఆంక్షలు విధించడం, అనుమతి లేని మార్గాల్లో వెళ్లే ట్యాంకర్లను అడ్డుకుంటామని హెచ్చరించడం ఉద్రిక్తతలకు కారణమైంది. ఇరాన్‌ నౌకాదళం మూడు చమురు ట్యాంకర్లను లక్ష్యంగా చేసుకున్నట్లు ప్రకటించింది. మరోవైపు అమెరికా మాత్రం అంతర్జాతీయ నౌకాయానానికి ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తోంది. హర్ముజ్‌లో అమెరికా ఆంక్షలను దిక్కరించిన లావిన్‌ ట్యాంకర్‌పై దాడి జరిగింది. ఇంజిన్‌ రూమ్‌పై కాల్పులు జరపడంతో  నౌక దెబ్బతింది. 

ఈజిప్ట్‌ పోర్టులో డ్రోన్‌ దాడి కలకలం?
యుద్ధం కొత్త ప్రాంతాలకు విస్తరిస్తోందన్న సంకేతంగా ఈజిప్ట్‌లోని డమియెట్టా పోర్టులో అమెరికాకు చెందిన ఎల్‌ఎన్‌జీ ట్యాంకర్‌పై డ్రోన్‌ దాడి ఘటన కలకలం రేపింది. దాడి తర్వాత నౌకలో మంటలు చెలరేగాయి. మంటలు మరో నౌకకు కూడా వ్యాపించాయి. అత్యవసర సిబ్బంది రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ఇది ఇరాన్‌ జరిపిన డ్రోన్‌ దాడియేనా?.. లేదంటే అగ్నిప్రమాదమా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. 

చమురు ధరలకు యుద్ధ సెగ
మిడిల్‌ ఈస్ట్‌లో పెరుగుతున్న ఉద్రిక్తతల ప్రభావం అంతర్జాతీయ చమురు మార్కెట్లపై పడుతోంది. యుద్ధ భయాలతో క్రూడాయిల్‌ ధరలు మళ్లీ పెరిగాయి. ఏకంగా సెంచరీ దాటేశాయి. ఇరాన్‌ చమురు స్థావరాలు, హర్ముజ్‌ జలసంధి భద్రతపై అనిశ్చితి కొనసాగితే ప్రపంచ ఇంధన సరఫరాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ప్రాంతీయ యుద్ధంగా మారుతున్న ఘర్షణ
అమెరికా–ఇరాన్‌ మధ్య మొదలైన పోరు ఇప్పుడు ఇరాక్‌, యెమెన్‌, సౌదీ అరేబియా, సముద్ర మార్గాల వరకు విస్తరించింది. ఒకవైపు ప్రతీకార దాడులు.. మరోవైపు చమురు మార్గాలపై ముప్పు.. ఇంకోవైపు మిత్ర దేశాల జోక్యం.. ఇవన్నీ కలిసి మిడిల్‌ ఈస్ట్‌లో పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మార్చుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement