పట్టువదలని ట్యారిఫ్‌ విక్రమార్కుడు | Sakshi Guest Column On USA Donald Trump | Sakshi
Sakshi News home page

పట్టువదలని ట్యారిఫ్‌ విక్రమార్కుడు

Jul 29 2026 12:22 AM | Updated on Jul 29 2026 12:22 AM

Sakshi Guest Column On USA Donald Trump

అభిప్రాయం

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పట్టువదలని విక్రమార్కునివలె ఈ నెల 24న భారత్‌ సహా మొత్తం 60 దేశాలపై మరో విడత దిగుమతి సుంకాలను పెంచారు. అవి అదే రోజు నుంచి అమ లుకు కూడా వచ్చాయి. ఈసారి ఆయన చెప్పిన కారణం: ఈ దేశాలు కార్మికులతో బలవంతపు చాకిరీ చేయించి ఉత్పత్తి చేస్తున్న సరకులను తమ దేశానికి ఎగు మతి చేస్తున్నాయని! ట్రంఫ్‌ ట్యారిఫ్‌ల పరంపర ఎప్పుడు మొదలై ఎట్లా సాగుతున్నదో, అందుకు తను చెప్తూ వస్తున్న ఛప్పన్నారు కారణాలేమిటో తెలిసినవే. 

అత్యవసర చట్టం నెపంతో...
2025 జనవరిలో అధ్యక్షునిగా బాధ్యత స్వీకరించిన వెంటనే, ‘అమెరికా ఫస్ట్‌ ట్రేడ్‌ పాలసీ మెమోరాండం’ పత్రంపై సంతకం చేశారు. తర్వాత వారం రోజులకు సమస్త దేశాలపై 10 శాతం నుంచి 25 శాతం దిగుమతి సుంకాలు పెంచారు. అందులో చిన్న దేశాలు, పెద్ద దేశాలు, మిత్ర దేశాలు, శత్రు దేశాలనే తేడాలు చూప లేదు. ఇతరులతో అమెరికాకు గల వాణిజ్య లోటు ఈ చర్యకు కారణ మన్న ఆయన, తమకు వాణిజ్య మిగులు ఉన్న దేశాలనూ మినహా యించలేదు. ఒక్క మానవ మాత్రుడైనా నివసించక పెంగ్విన్స్‌ మాత్రమే ఉండే దీవులనూ తన జాబితాలో చేర్చారు. ఆయన విధానాలను, తీరును చూడగా తన పదవీ కాలం ముగిసే 2029 జనవరి వరకు ఈ ధోరణి ముగియక పోవచ్చునని పిస్తున్నది. ఆ చర్చలోకి వెళ్లే ముందు ఈ నెల 24 నాటి సుంకాల గురించి చెప్పుకోవాలి. 

సుంకాలను మొదట భారీగా పెంచినప్పుడు, అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టాన్ని (ఇంటర్నేషనల్‌ ఎమర్జెన్సీ ఎకనమిక్‌ పవర్స్‌ యాక్ట్‌) ఉపయోగించారు. ఇతర దేశా లతో వాణిజ్య లోటు అమెరికా ఆర్థిక వ్యవస్థకే ముప్పు కలిగించగల స్థాయికి పెరిగిందనీ, కనుక ఇటువంటి అత్యవసర చర్యలను అమెరి కన్‌ కాంగ్రెస్‌ ఆమోదం లేకుండానే తీసుకునే అధికారం ఆ చట్ట ప్రకారం అధ్యక్షునికి ఉందనీ అన్నారు. కానీ, అటువంటి పరిస్థి తులు లేవనీ, కనుక ఆ చర్యలు చెల్లవనీ అక్కడి సుప్రీంకోర్టు ఈ సంవత్సరం ఫిబ్రవరిలో కొట్టివేసింది. అంతవరకు ప్రపంచ దేశాల నుంచి వసూలు చేసిన వందలకొద్ది బిలియన్ల అదనపు సుంకాలను వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని ఆదేశించింది.

దానితో ఆందోళనకు గురైన అమెరికా అధ్యక్షుడు ఆ నష్టాన్ని పూడ్చుకోవటానికి కొత్తదారులు వెతకటం మొదలు పెట్టారు. సుప్రీం తీర్పు నుంచి తప్పించుకునేందుకు తనకు ప్రత్యామ్నా యాలు ఉన్నాయని వెంటనే ప్రకటించిన ఆయన, కాంగ్రెస్‌ అను మతి వెంటనే అక్కరలేని 1974వ సంవత్సరపు వాణిజ్య చట్టాన్ని ఆశ్రయించారు. అందులోని 301వ నిబంధన మేరకు వేర్వేరు దేశాలపై 10 శాతం నుంచి 12.5 శాతం వరకు ట్యారిఫ్‌లు ప్రకటించారు. అయితే ఆ నిబంధన ఒక పరిమిత కాలం వరకే అమలులో ఉంటుంది. ఆ గడువు తీరటంతో ఈ నెల 24న అదే స్థాయి శాతా లతో ట్యారిఫ్‌లను శాశ్వతంగా మార్చారు. ఆ ప్రకారం ఇండియాపై రేటు 10 శాతం అయింది.

సుంకాల మజిలీలు
ఈ ట్యారిఫ్‌ల యాత్రలో భారత దేశానికి, ఇతరులకు సంబంధించి కూడా పలు మజిలీలు ఉన్నాయి. 2025 ఫిబ్రవరిలో మొదటి విడత సుంకాలలో భాగంగా ఇండియాపై 25 శాతం విధించిన ఆయన, మనం రష్యా చమురును ఖరీదు చేస్తున్నందుకు ఆగ్రహించి మరో 25 శాతం పెంచారు. అట్లా అది 50 శాతం అయింది. ఇతరత్రా డబ్ల్యూటీవోతో నిమిత్తం లేకుండా, ఇంకా చెప్పాలంటే ఆ నిబంధనలను ఉల్లంఘిస్తూ, వేర్వేరు దేశాలతో వేర్వేరు వాణిజ్య ఒప్పందాలను తమకు అనుకూలంగా చేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అందుకోసం చర్చల పద్ధతిని గాక ఒత్తిడులు, బ్లాక్‌మెయిలింగ్‌ను ఎంచుకున్నారు. అది తట్టుకోలేని దేశాలు విడిగా ఒప్పందాలకు ఒప్పుకోగా ట్యారిఫ్‌ల శాతం అపుడు కొంత తగ్గించారు. ఆ విధంగా ఇండియాపై సుంకాలు 50 శాతం నుంచి 18 శాతానికి తగ్గాయి. ఇపుడు 10 శాతంతో కలిపి 28 శాతం అవుతున్నాయి.

జపాన్, దక్షిణ కొరియా వంటి బలమైన ఆర్థిక వ్యవస్థలు కూడా ఇందుకు మినహాయింపు కాలేదు, అమెరికాకు సన్నిహిత రాజ్యాలై నప్పటికీ– కెనడా, యూరప్‌ వంటి మిత్ర దేశాలు ఒకమేర రాజీ పడుతూ ప్రత్యామ్నాయ వాణిజ్య సంబంధాల కోసం అన్ని ఖండా లలో అన్వేషణలు మొదలు పెట్టాయి. రష్యాకు అమెరికాతో గల వాణిజ్య సంబంధం అతి స్వల్పం అయినందున ఇరువురి మధ్య వచ్చేదీ పోయేదీ ఏమీ లేకపోయింది. ఆంబోతులు పోట్లాడితే లేగదూడల కాళ్లు విరిగాయన్నట్లుగా రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం వల్ల రష్యా చమురు కొనుగోలు చేసే దేశాలపై భారీ సుంకాలను అమెరికా విధించటంతో ఇతరులతో పాటు ఇండియా చాలానే నష్టపోయింది. ఆ ట్యారిఫ్‌లకు ప్రతిగా తాము కూడా అమెరికాపై ఎదురు సుంకాలు వేయగలమని కెనడా, యూరప్‌ హెచ్చరికలు చేసి ఆ పని కొంత మేర చేశాయి గానీ, పూర్తిగా ధిక్కరించి నిలిచింది చైనా ఒక్కటే.

బలవంతపు చాకిరీలు నిజమేనా?
ఇపుడు మాట్లాడుకోవలసిన ఆసక్తికరమైన విషయం ఒకటు న్నది. అది ఇండియా తదితర దేశాలు బలవంతపు చాకిరీతో ఉత్ప త్తులు చేసి అమెరికాకు విక్రయిస్తున్నాయనే ఆరోపణ. ఈ విషయమై యునైటెడ్‌ స్టేట్స్‌ ట్రేడ్‌ రిప్రజెంటేటివ్‌ (యూఎస్‌టీఆర్‌) జరిపిన విచారణలో ధ్రువీకరణలు లభించాయని ట్రంప్‌ ప్రభుత్వం చెప్తు న్నది. అమెరికా, యూరప్‌ వర్ధమాన దేశాలను ఒత్తిడి చేసేందుకు బాలకార్మికులు, మితిమీరిన పని గంటలు, బలవంతపు చాకిరీ వంటి వాదనలు ఎప్పటినుంచో చేస్తున్నాయి. విచిత్రమేమంటే, సాక్షాత్తూ అమెరికాలోనే రకరకాలుగా బలవంతపు చాకిరీ, శ్రామి కుల దోడిపీ జరుగుతున్నదని చెప్పే నివేదికలున్నాయి. కనుక, ఈ వాదన ఇతరులను ఒత్తిడి చేసే సాధనం మాత్రమే. 

ఇంతకూ జనవరి 2025తో ఆరంభించి శవం కోసం చెట్టెక్కు తూనే ఉన్న అమెరికా అధ్యక్షుని లక్ష్యాలు ఎంతవరకు నెరవేరు తున్నట్లు? అన్ని దేశాలూ తమను దోచుకుంటున్నాయంటూ సుంకాల హెచ్చింపును ఆరంభించినపుడు 900 బిలియన్ల మేర ఉండిన వాణిజ్య లోటు నేడు కూడా ఇంచుమించు అంతే ఉంది. కేవలం పారిశ్రామిక ఉత్పత్తులను తీసుకుంటే మరింత పెరిగి 1.2 ట్రిలియన్‌ డాలర్లకు పెరిగింది. ట్యారిఫ్‌ల హెచ్చింపుతో ఏమీ ఒరగ లేదు. పన్నులు పెంచుతామని హెచ్చరించినా బయటి నుంచి తిరిగి వచ్చిన అమెరికన్‌ కంపెనీలు చాలా కొద్ది. కనుక ‘మాగా’ నినాదం మేర ఉద్యోగాలూ పెరగలేదు. ఆ విధంగా విక్రమార్కుని భుజంపై శవం నిలవకుండా ఉంది.

మనమిక చూడవలసింది అమెరికాతో వాణిజ్య ఒప్పందం ఏ విధంగా జరగనున్నదనేది. అందుకోసం ఫ్రేమ్‌ వర్క్‌ అనేది కుదిరినా, తుదిరూపపు చర్చలు సాగుతున్నాయి. ప్రభుత్వం కొంత పట్టుదలగా ఉన్నమాట నిజం. అదే సమయంలో అది హానికరంగా ఉండకూడదని రైతులు, మత్స్యకారులు, జౌళి రంగం, ఇతర వర్గాలు ఒత్తిడి చేస్తున్నాయి. చివరకు ఏమయేదీ చూడాలి!

టంకశాల అశోక్‌
వ్యాసకర్త సీనియర్‌ సంపాదకుడు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement