భారత్‌లో జులై నెల దాదాపు సాధారణ వర్షపాతంతో ముగిసే అవకాశం ఉన్నప్పటికీ, నైరుతి రుతుపవనాల సీజన్ మొత్తం మీద వర్షపాత లోటు 15 శాతం వద్దే కొనసాగనుంది. జులైలో వర్షపాతం తీవ్ర హెచ్చుతగ్గులు చూసింది. తొలి వారం అత్యధిక వర్షాలు, రెండో వారం పొడి వాతావరణం, జూలై 21 నుంచి 24 మధ్య మరోసారి భారీ వర్షాలు కురవడంతో నెలవారీ వర్షపాత లోటు తొలగిపోయింది.
"జులైలో ఇప్పటివరకు వర్షపాతం స్వల్పంగా సాధారణ స్థాయిలోనే ఉంది. నెల ముగిసే నాటికి దాదాపు సాధారణ వర్షపాతంతో ముగిసే అవకాశం ఉంది. నెలాఖరు వరకు రోజుకు 9-9.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది" అని స్కైమెట్ వాతావరణ సంస్థ తెలిపింది.
జూలై తొలి వారంలో భారీ వర్షాలతో మాన్సూన్ బలంగా ప్రారంభమైంది. దీంతో సీజనల్ వర్షపాత లోటు 40 శాతం నుంచి 14 శాతానికి తగ్గింది. అయితే రెండో వారంలో దీర్ఘకాలం పొడి వాతావరణం కొనసాగడంతో సీజనల్ లోటు మళ్లీ 24శాతానికి పెరిగింది.
జులై 21 నుంచి 24 మధ్య దేశవ్యాప్తంగా విస్తృతంగా వర్షాలు కురవడంతో పరిస్థితి మళ్లీ మెరుగుపడింది. జూలై నెల వర్షపాత లోటు పూర్తిగా తొలగిపోయి, సీజనల్ లోటు 15 శాతానికి తగ్గింది. నెలాఖరుకు కూడా ఇదే స్థాయిలో ఉండే అవకాశం ఉంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం, రాజస్థాన్‌పై ఉన్న చక్రవాత ప్రసరణ ప్రభావంతో నెల చివరి రోజుల్లో పెద్ద స్థాయిలో వర్షపాత లోటు ఏర్పడే అవకాశం లేదని సంస్థ తెలిపింది. జులైలో వర్షపాతం మెరుగుపడినప్పటికీ, వర్షాకాలం మొత్తం మీద ఉన్న 15 శాతం లోటు సీజన్ రెండో భాగంలో భర్తీ అవుతుందనే స్పష్టమైన సంకేతాలు కనిపించడం లేదని స్కైమెట్ పేర్కొంది.
భవిష్యత్ వర్షపాత పరిస్థితి ప్రధానంగా బలపడుతున్న ఎల్‌నినో, ఇండియన్ ఓషన్ డైపోల్ (ఐఓడీ) పరిణామాలపై ఆధారపడి ఉంటుందని సంస్థ తెలిపింది. ఇవి భారత వర్షాకాలంపై భారీగా ప్రభావం చూపే రెండు ప్రధాన వాతావరణ కారకాలు. "సీజనల్ వర్షపాత పరిస్థితిపై మరింత స్పష్టత ఆగస్టు తొలి వారంలో వచ్చే అవకాశం ఉంది" అని స్కైమెట్ తెలిపింది.
రానున్న 10 రోజుల్లో తూర్పు, ఈశాన్య, వాయవ్య భారత ప్రాంతాల్లో విస్తృతంగా, సమయానుకూలంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే మహారాష్ట్ర, గుజరాత్‌తో పాటు మధ్య భారత ప్రాంతాల్లో మాన్సూన్ బలహీన దశ కొనసాగే అవకాశం ఉంది. దక్షిణ ద్వీపకల్ప భారతదేశంలో, ముఖ్యంగా అంతర్గత ప్రాంతాలు, ఆగ్నేయ ప్రాంతాల్లో వర్షాల కొరత కొనసాగనుంది. ఈ కాలంలో గణనీయమైన వర్షాలు కురిసే సూచనలు కనిపించడం లేదు.


