స్టార్ట్‌ .. యాక్షన్‌ మళ్లీ 100 రోజుల ప్లాన్‌ | - | Sakshi
Sakshi News home page

స్టార్ట్‌ .. యాక్షన్‌ మళ్లీ 100 రోజుల ప్లాన్‌

Feb 19 2026 11:02 AM | Updated on Feb 19 2026 11:02 AM

స్టార

స్టార్ట్‌ .. యాక్షన్‌ మళ్లీ 100 రోజుల ప్లాన్‌

మళ్లీ ‘100 రోజుల ప్లాన్‌’

వివిధ సమస్యల పరిష్కారమే లక్ష్యం

ప్రజల భాగస్వామ్యంతో.. 3 కార్పొరేషన్ల పరిధిలో కార్యక్రమాలు

ఈ నెల 23 నుంచి ప్రారంభం

సాక్షి, సిటీబ్యూరో

త ప్రభుత్వాల హయాంలో జీహెచ్‌ఎంసీలో అమలు చేసిన 100 డేస్‌ యాక్షన్‌ప్లాన్‌కు ప్రస్తుత సర్కారు సిద్ధమైంది. మున్సిపల్‌ పాలన మరింత సమర్థంగా ఉండాలనే లక్ష్యంతో ముందుకెళ్లనుంది. కోర్‌ అర్బన్‌ రీజియన్‌ (క్యూర్‌) వరకు ఈ కార్యక్రమం నిర్వహించేందుకు రోజువారీ ప్రణాళికలు రూపొందించాల్సిందిగా స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జయేశ్‌ రంజన్‌ జీహెచ్‌ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ కమిషనర్లకు సూచించారు. ఈమేరకు మెమో జారీ చేశారు. ప్రజా భాగస్వామ్యంతో ప్రజలకు సదుపాయాలు మెరుగుపరచాలనే తలంపుతో ప్రభుత్వం ఇందుకు సిద్ధమైంది. ముగ్గురు కమిషనర్ల నుంచి అందిన ప్రణాళికలతో ప్రభుత్వం యాక్షన్‌ప్లాన్‌ ఖరారు చేయనుంది. ఈ నెల 23 నుంచే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. పారిశుద్ధ్యానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అత్యంత ప్రాధాన్యమివ్వడంతో యాక్షన్‌ ప్లాన్‌లో ఈ అంశానికి ప్రాముఖ్యత ఇవ్వనున్నారు. దీంతో పాటు దోమల నివారణ, రోడ్లు, మౌలిక వసతులకు ప్రాధాన్యమివ్వనున్నట్లు సమాచారం.

గతంలో ఇలా..

గతంలో కాంగ్రెస్‌ హయాంలో కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రెండు దఫాలు 100 డేస్‌ యాక్షన్‌ప్లాన్‌లో భాగంగా రూ. 500 కోట్ల మేర పనులు చేశారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో 2015, 2016, 2023లలోనూ 100 డేస్‌ యాక్షన్‌ప్లాన్‌ అమలు చేశారు.

సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న సీఎస్‌ రామకృష్ణారావు

ప్రస్తుతం కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు కావడంతో వికేంద్రీకరణతో ప్రజలకు సదుపాయాలు మెరుగుపడతాయని చెప్పాలనేది ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. అందుకు 100 డేస్‌ యాక్షన్‌ ప్లాన్‌ ఉపకరించగలదని భావిస్తోంది. ఇది నాణేనికి ఓవైపు కాగా, వేసవి ముగిసేలోగా ఎన్నికలు నిర్వహించాలనే యోచనలో సైతం ఉన్నట్లు తెలుస్తోంది. తాజా మున్సిపోల్స్‌ విజయంతో అదే ఊపుతో మూడు కార్పొరేషన్ల ఎన్నికలు నిర్వహించాలనే తలంపుతో ఉన్నట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఆలోగా ప్రజలకు కొత్త కార్పొరేషన్లలో పాలన కనిపించాలంటే సరైన యాక్షన్‌ ప్లాన్‌ అవసరమని, దీన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

గతంలో 2016 జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు ముందు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం స్వచ్ఛ హైదరాబాద్‌ పేరిట మరో కార్యక్రమాన్ని నిర్వహించింది. మంత్రులు ప్యాట్రన్లుగా, గవర్నర్‌ ఐఏఎస్‌, ఐపీస్‌ అధికారులు, ఆయా ప్రభుత్వ విభాగాల హెచ్‌ఓడీలు మెంటార్లుగా నగరాన్ని 425 లొకేషన్లుగా విభజించి కొన్ని రోజులపాటు నిర్వహించారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు, గవర్నర్‌ నరసింహన్‌లు సైతం స్వచ్ఛ హైదరాబాద్‌లో పాల్గొన్నారు. ప్రజల్నీ భాగస్వాములను చేశారు.

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌ హైదరాబాద్‌, సైబరాబాద్‌, మల్కాజిగిరి మున్సిపల్‌ కార్పొరేషన్ల పరిధిలో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. బుధవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో అధికారులు నగర పరిశుభ్రతపై ఇప్పటి వరకు తీసుకుంటున్న చర్యలపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా సీఎస్‌కు వివరించారు. చెత్త సేకరణ విధానం, పరిశుభ్రతా చర్యలు, ప్రజా ఆరోగ్య పరిరక్షణపై తీసుకుంటున్న చర్యలను సీఎస్‌ సమగ్రంగా పరిశీలించారు. మున్సిపల్‌ విభాగం ప్రభుత్వంలో కీలకమని, ప్రజల అవసరాలకు తగినట్లుగా బాధ్యతలు నిర్వర్తించాలని, అధికారులు విధులలో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించబోమని హెచ్చరించారు. చెత్త సేకరణ (డ్రై, వెట్‌ వేస్ట్‌), ప్లాస్టిక్‌ వ్యర్థాల నియంత్రణ, మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. నగరంలో పారిశుద్ధ్య పనుల పురోగతిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ కర్ణన్‌ మాట్లాడుతూ.. జీహెచ్‌ఎంసీ పరిధిలో 4500 స్వచ్ఛ ఆటోలు ఇంటింటికి తిరిగి చెత్త సేకరిస్తున్నాయని, 18 వేల 557 మంది శానిటేషన్‌ విభాగంలో పనిచేస్తున్నారని తెలిపారు. నగర పరిధిలో రోజుకు 7,800 టన్నుల మేరకు గార్బేజ్‌ సేకరణ చేస్తున్నామన్నారు.

స్టార్ట్‌ .. యాక్షన్‌ మళ్లీ 100 రోజుల ప్లాన్‌ 1
1/1

స్టార్ట్‌ .. యాక్షన్‌ మళ్లీ 100 రోజుల ప్లాన్‌

Advertisement
 
Advertisement
Advertisement