టీమిండియా- సౌతాఫ్రికా (IND vs SA 1st Test) మధ్య కోల్‌కతా వేదికగా తొలి టెస్టు నేపథ్యంలో ఈడెన్ గార్డెన్స్ పిచ్ చర్చనీయాంశమైంది. బౌలర్ల విజృంభణతో బ్యాటర్లు విలవిల్లాడుతున్నారు. పరుగులు రాబట్టేందుకు ఎంత ప్రయత్నించినా సఫలం కాలేకపోతున్నారు.
సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో ఓపెనర్ ఐడెన్ మార్క్రమ్ 31 పరుగులతో టాప్ రన్ స్కోరర్‌గా నిలిస్తే.. టీమిండియా మొదటి ఇన్నింగ్స్‌లో ఓపెనర్ కేఎల్ రాహుల్ (KL Rahul- 39) టాప్. ఇటు స్పిన్.. అటు పూర్తి బౌన్సీగా కాకుండా ఉన్న ఈడెన్ గార్డెన్స్ పిచ్ వల్ల ఇప్పటికి మూడు ఇన్నింగ్స్‌లో కలిపి రెండు జట్లు ఒక్కసారి కూడా కనీసం రెండు వందల మార్కు చేరుకోలేకపోయాయి.
మూడో రోజు హాఫ్ సెంచరీ
అయితే, ఆదివారం నాటి మూడో రోజు ఆటలో భాగంగా సౌతాఫ్రికా కెప్టెన్ తెంబా బవుమా (Temba Bavuma) తమ రెండో ఇన్నింగ్స్‌లో 55 పరుగులతో సత్తా చాటడం ప్రేక్షకులకు కనువిందు చేసింది. ఈ మ్యాచ్‌లో మూడో రోజైనా కనీసం హాఫ్ సెంచరీ చూసే భాగ్యం దక్కిందని బ్యాటింగ్ అభిమానులు సంబరపడుతున్నారు.
టెస్టు క్రికెట్‌ను చంపేస్తారా?
ఇదిలా ఉంటే.. ఈడెన్ గార్డెన్స్ పిచ్‌పై మాజీ క్రికెటర్లు మైకేల్ వాన్, హర్భజన్ సింగ్ తదితరులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. భజ్జీ అయితే.. ‘‘టెస్టు క్రికెట్‌ను చంపేస్తారా? మూడు రోజుల్లోనే మ్యాచ్ ముగిసిపోతుందా?’’ అంటూ క్యూరేటర్ తీరును తప్పుబట్టాడు.
అస్సలు ఊహించలేదు
మరోవైపు.. రెండు రోజుల్లోనే ఏకంగా పదహారు వికెట్లు కూలడంతో టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ కూడా క్యూరేటర్ పనితీరును విమర్శించాడు. ‘‘తొలిరోజు వికెట్ కాసేపు బాగానే ఉంది. కానీ ఆ తర్వాత చెత్తగా మారిపోయింది. ఇది మేము అస్సలు ఊహించలేదు’’ అని ఘాటు వ్యాఖ్యలు చేశాడు.
తప్పు మీరు చేసి.. మమ్మల్ని అంటారా?
ఈ పరిణామాల నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ భారత జట్టు యాజమాన్యానికి దిమ్మదిరిగేలా కౌంటర్ ఇచ్చాడు. ‘‘టీమిండియా కోరుకున్న పిచ్ ఇదే. వాళ్లే ఇలా కావాలని అడిగారు.
నాలుగు రోజుల పాటు పిచ్‌పై నీళ్లు చల్లకుంటే ఇలాగే ఉంటుంది. ఇందులో క్యూరేటర్ సుజన్ ముఖర్జీని తప్పుబట్టడానికి ఏమీ లేదు. వాళ్లు కోరిందే ఇది’’ అని దాదా.. పరోక్షంగా హెడ్‌కోచ్ గౌతం గంభీర్‌దే తప్పంతా అంటూ ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశాడు.
టీమిండియా ఓటమి
సౌతాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా ఓటమి పాలైంది. పర్యాటక ప్రొటిస్ జట్టు చేతిలో 30 పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది. 124 పరుగుల లక్ష్యాన్నిఛేదించే క్రమంలో భారత్ 93 పరుగులకే కుప్పకూలింది.
చదవండి: ఈడెన్ గార్డెన్స్‌లో అత్యధిక లక్ష్య ఛేదన ఎంతో తెలుసా?


