భారత జట్టులో స్థానం కోల్పోయిన హాకీ దిగ్గజం
ప్రొ లీగ్ కోసం 33 మంది ప్రాబబుల్స్ ప్రకటన
భారత హాకీ చరిత్రలో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆటగాడు... నాలుగుసార్లు ఒలింపిక్స్‌లో పాల్గొన్న అనుభవం... ఒకసారి కెప్టెన్‌గా జట్టుకు పతకం అందించిన రికార్డు సహా రెండు ఒలింపిక్ కాంస్యాలు గెలుచుకున్న జట్లలో సభ్యుడు... అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) వార్షిక అవార్డుల్లో అత్యుత్తమ ఆటగాడిగా నిలవడంతో పాటు అర్జున, ఖేల్‌రత్న పురస్కారాల విజేత... ఈ ఘనతలన్నీ సాధించిన మన్‌ప్రీత్ సింగ్‌పై వేటు పడింది.
వచ్చేనెలలో జరిగే ఎఫ్‌ఐహెచ్ ప్రొ లీగ్ సీజన్ కోసం 33 మంది ప్రాబబుల్స్‌తో ప్రకటించిన భారత హాకీ జట్టులో మన్‌ప్రీత్‌కు చోటు దక్కలేదు. ‘విశ్రాంతి’ అని కోచ్ చెబుతున్నా... సుమారు 34 ఏళ్ల వయసు ఉన్న మన్‌ప్రీత్‌ను పక్కన పెట్టడం అంటే అతని అంతర్జాతీయ కెరీర్ ముగింపునకు చేరువైనట్లే.
న్యూఢిల్లీ: మిడ్‌ఫీల్డర్ మన్‌ప్రీత్ సింగ్ తన 14 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో భారత్ తరఫున 411 మ్యాచ్‌లు ఆడాడు. మరో మ్యాచ్ ఆడి ఉంటే మన దేశం తరఫున ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన దిలీప్ తిర్కీ (412) రికార్డును అతను సమం చేసేవాడు. అయితే అనూహ్యంగా మన్‌ప్రీత్ జట్టులో స్థానం కోల్పోయాడు. ఫిబ్రవరి 10 నుంచి 16 వరకు రూర్కెలాలో జరిగే ఎఫ్‌ఐహెచ్ ప్రొ లీగ్ హాకీ సీజన్ కోసం ఎంపిక చేసిన 33 ప్రాబబుల్స్‌లో అతనికి చోటు దక్కలేదు. గత ఐదేళ్లలో అతను టీమ్‌కు దూరం కావడం ఇదే మొదటిసారి.
మన్‌ప్రీత్‌తో పాటు సీనియర్ గోల్ కీపర్ కృషన్ బహదూర్ పాఠక్‌పై కూడా వేటు పడింది. ఇటీవల జరిగిన హాకీ ఇండియా లీగ్‌లో ప్రదర్శనను బట్టి అనేక మంది కొత్త, యువ ఆటగాళ్లను జట్టులోకి ఎంపిక చేశారు. పూవన్న చందూరా బాబీ, యశ్‌దీప్ సివాచ్, అమన్‌దీప్ లక్డాలకు అవకాశం దక్కగా, జూనియర్ ఆసియా కప్‌లో ఆకట్టుకున్న ప్రిన్స్‌దీప్ సింగ్, రోషన్ కుజూర్ కూడా తొలిసారి సీనియర్ టీమ్‌లోకి వచ్చాడు.
భారత్‌లో తొలి అంచె ప్రొ లీగ్ పోటీలతో జట్టు కొత్త సీజన్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత మన బృందం హోబర్ట్‌కు వెళ్లి స్పెయిన్, ఆ్రస్టేలియాలతో రెండేసి మ్యాచ్‌లు ఆడుతుంది. అనంతరం ప్రొ లీగ్ రెండో అంచె టోర్నీ జూన్‌లో యూరప్‌లో జరుగుతుంది.
సరైన సమయం: కోచ్ ఫుల్టన్
2026లో హాకీ వరల్డ్ కప్‌తో పాటు ఆసియా క్రీడల వంటి ప్రధాన ఈవెంట్లు ఉన్న నేపథ్యంలో జట్టులో ‘రొటేషన్’ విధానాన్ని అనుసరించనున్నామని, కొత్త నిర్ణయాలు తీసుకునేందుకు ఇదే సరైన సమయంగా భావించినట్లు భారత జట్టు హెడ్ కోచ్ క్రెయిగ్ ఫుల్టన్ అన్నారు. ‘పని భారం తగ్గించేందుకు మేం కొంత మంది సీనియర్లకు విశ్రాంతినిచ్చాం. మరికొందరు యువ ఆటగాళ్ల చక్కటి ప్రదర్శనకు గుర్తింపు కూడా దక్కింది.
ప్రొ లీగ్‌తో పాటు ఆ్రస్టేలియాలో ప్రదర్శనను బట్టి ప్రపంచ కప్, ఆసియా కప్‌లలో పాల్గొనే జట్లను ఎంపిక చేస్తాం’ అని ఆయన వెల్లడించారు. హర్మన్‌ప్రీత్ సింగ్ నాయకత్వంలోని భారత జట్టుకు ప్రొ లీగ్‌కు ముందు ఫిబ్రవరి 1 నుంచి 7 వరకు ప్రత్యేక శిక్షణా శిబిరం నిర్వహిస్తారు. ఫిబ్రవరి 11న జరిగే తొలి మ్యాచ్‌లో బెల్జియంతో భారత్ తలపడుతుంది.
భారత హాకీ ప్రాబబుల్స్: పవన్, సూరజ్ కర్కెరా, మోహిత్, ప్రిన్స్‌దీప్ సింగ్ (గోల్‌కీపర్లు), అమిత్ రోహిదాస్, జర్మన్‌ప్రీత్ సింగ్, సంజయ్, హర్మన్‌ప్రీత్ సింగ్ (కెపె్టన్), జుగ్‌రాజ్ సింగ్, సుమీత్, పూవన్న చందూరా బాబీ, యశ్‌దీప్ సివాచ్, నీలమ్ సంజీప్, అమన్‌దీప్ లక్డా (డిఫెండర్లు), రాజీందర్ సింగ్, మన్‌మీత్ సింగ్, హార్దిక్ సింగ్, రవిచంద్ర సింగ్, వివేక్ సాగర్, విష్ణుకాంత్ సింగ్, రాజ్ కుమార్ పాల్, నీలకాంత శర్మ, రోషన్ కుజూర్ (మిడ్ ఫీల్డర్లు), అభిషేక్, సుఖ్‌జీత్ సింగ్, శిలానంద్ లక్డా, మన్‌దీప్ సింగ్, అరిజీత్ సింగ్ హుండల్, అంగద్ వీర్ సింగ్, ఉత్తమ్ సింగ్, సెల్వమ్ కార్తీ, ఆదిత్య అర్జున్, మణీందర్ సింగ్ (ఫార్వర్డ్స్).
మన్‌ప్రీత్ సింగ్ కెరీర్
అంతర్జాతీయ అరంగేట్రం: 2011
మొత్తం మ్యాచ్‌లు: 411
చేసిన గోల్స్: 45
ఒలింపిక్స్‌లో రెండు కాంస్యాలు (2020 టోక్యో, 2024 పారిస్), కామన్వెల్త్ గేమ్స్‌లో 2 రజతాలు, ఆసియా క్రీడల్లో 2 స్వర్ణాలు, 1 కాంస్యం, చాంపియన్స్ ట్రోఫీలో 2 రజతాలు, ఆసియా కప్‌లో 2 స్వర్ణాలు, 1 రజతం, ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో 4 స్వర్ణాలు, 1 కాంస్యం, వరల్డ్ లీగ్‌లో 2 కాంస్యాలు గెలుచుకున్న జట్లలో సభ్యుడు. భారత్ తరఫున అతను నాలుగు ప్రపంచ కప్‌లు కూడా ఆడాడు.


