హైదరాబాద్‌ వేదికగా...  | Hyderabad to host Womens 2026 FIH Hockey World Cup | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ వేదికగా... 

Jan 13 2026 6:12 AM | Updated on Jan 13 2026 6:12 AM

Hyderabad to host Womens 2026 FIH Hockey World Cup

మార్చిలో మహిళల హాకీ ప్రపంచకప్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీ 

తెలంగాణ ప్రభుత్వంతో అంతర్జాతీయ హాకీ సమాఖ్య ఒప్పందం 

సాక్షి, హైదరాబాద్‌: పలు ప్రతిష్టాత్మక క్రీడా ఈవెంట్లకు వేదికగా నిలిచిన హైదరాబాద్‌ మరో పెద్ద టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనుంది. మహిళల హాకీ వరల్డ్‌కప్‌లో భాగంగా జరిగే క్వాలిఫయింగ్‌ టోర్నీని ఇక్కడి గచ్చిబౌలి స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో నిర్వహిస్తారు. మార్చి 8 నుంచి 14 వరకు ఈ పోటీలు జరుగుతాయి. మొత్తం ఎనిమిది జట్లు ఇందులో పాల్గొంటాయి. టాప్‌–3లో నిలిచిన టీమ్‌లు నేరుగా వరల్డ్‌ కప్‌కు అర్హత సాధిస్తాయి. 

భారత్‌తోపాటు ఇంగ్లండ్, స్కాట్లాండ్, దక్షిణ కొరియా, ఇటలీ, ఉరుగ్వే, వేల్స్, ఆస్ట్రియా జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ఈ నేపథ్యంలో అర్హత టోర్నీ నిర్వహణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వంతో అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్‌) ఒప్పందం చేసుకుంది. ఎఫ్‌ఐహెచ్‌ అధ్యక్షుడు తయ్యబ్‌ ఇక్రామ్‌ ఇందులో పాల్గొని టోర్నీ నిర్వహణపై ముఖ్యమంత్రితో చర్చించారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందనే విషయాన్ని పునరుద్ఘాటించారు.

 హాకీ వరల్డ్‌ కప్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీ నిర్వహించడం తమకు గర్వకారణమని... మున్ముందు నగరాన్ని అత్యుత్తమ స్థాయి క్రీడా కేంద్రంగా మార్చే క్రమంలో ఇది మరో ముందడుగు అని ఆయన అన్నారు. టోర్నమెంట్‌కు సంబంధించిన పోస్టర్‌ను కూడా ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భారత హాకీ సమాఖ్య (హెచ్‌ఐ) అధ్యక్ష, కార్యదర్శులు దిలీప్‌ తిర్కీ, భోలానాథ్‌ సింగ్‌తో పాటు రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, సలహాదారు జితేందర్‌ రెడ్డి, క్రీడా కార్యదర్శి జయేశ్‌ రంజన్, స్పోర్ట్స్‌ అథారిటీ ఎండీ సోనీబాలాదేవి తదితరులు పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement