రెండేళ్ల కిందట ఓ భారత ఆటగాడు బీసీసీఐ ఆదేశాలను దిక్కరించినందుకు ఊహించని పరిణామాలు ఎదుర్కొన్నాడు. జట్టులో చోటుతో పాటు సెంట్రల్ కాంట్రాక్ట్‌నూ కోల్పోయాడు. అతడిపై ఎన్నో విమర్శలు కూడా వచ్చాయి. కానీ సదరు ఆటగాడు ఎక్కడా తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. ఎటువంటి బహిరంగ వ్యాఖ్యలు చేయకుండా.. మైదానంలోనే తన ప్రతాపం చూపాలని నిర్ణయించుకున్నాడు.
ఎప్పటికైనా జాతీయ జట్టులోకి రీ ఎంట్రీ ఇవ్వాలన్నదే తన లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఎట్టకేలకు అతడి శ్రమకు ఫలితం దక్కింది. తిరిగి భారత జెర్సీ ధరించేందుకు ఆ ఆటగాడు సిద్దమయ్యాడు. అతడే పాకెట్ డైనమైట్, స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్. టీ20 ప్రపంచకప్-2026కు ఎంపిక చేసిన జట్టులో కిషన్ చోటు దక్కించుకున్నాడు. కెరీర్ ముగిసిపోయిందన్న స్టేజి నుంచి ప్రపంచకప్ జట్టులోకి రావడం అతడు ప్రయాణం నిజంగా ఒక అద్భుతం. ఈ క్రమంలో అతడి కమ్‌బ్యాక్ స్టోరీపై లుక్కేద్దాం.
బీసీసీఐ అగ్రహం..
ఇషాన్ కిషన్ 2023 ఏడాది ఆఖరిలో భారత జట్టుతో పాటు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లాడు. కానీ ఇషాన్ ‘మానసికంగా ఇబ్బందిపడుతున్నా’ అంటూ మధ్యలోనే స్వదేశానికి వచ్చేశాడు. అయితే స్వదేశానికి వచ్చేసిన కిషన్ విశ్రాంతి తీసుకోకుండా ఐపీఎల్ కోసం ప్రాక్టీస్ చేస్తూ కన్పించాడు. దీంతో అతని ప్రవర్తనపై బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. జాతీయ జట్టులో లేనప్పుడు దేశవాళీ క్రికెట్‌లో ఆడాల్సిందేనని బీసీసీఐ ఆదేశాలు జారీ చేసింది.
కానీ కిషన్ మాత్రం బీసీసీఐ ఆదేశాలను ధిక్కరించాడు. దీంతో అతడిని సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి బోర్డు తప్పించింది. ఆ తర్వాత దేశవాళీ క్రికెట్ కిషన్ ఆడాడు. రంజీ ట్రోఫీతో పాటు విజయ్ హాజారే, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో జార్ఖండ్‌కు సారథ్యం వహించాడు.
అడపాదడపా పరుగులు చేస్తూ రాణించినా జాతీయ జట్టు నుంచి పిలుపు రాలేదు. కానీ సెంట్రల్ కాంట్రాక్ట్ మాత్రం తిరిగి దక్కించుకున్నాడు. అయితే ఇంగ్లండ్ పర్యటనలో రిషబ్ గాయపడడంతో కిషన్‌కు అవకాశం వస్తుందని అంతా భావించారు. కానీ అదే సమయంలో కిషన్ కూగా గాయం బారిన పడడంతో ఛాన్స్ మిస్సయ్యాడు.
ఎట్టకేలకు..
అయితే దాదాపు రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కిషన్ నిరీక్షణ ఫలింది. ఏకంగా ఇప్పుడు టీ20 వరల్డ్‌కప్ వంటి మెగా టోర్నీలో ఆడేందుకు ఇషాన్ సిద్దమయ్యాడు. సెకెండ్ వికెట్ కీపర్ బ్యాటర్‌గా ఈ జార్ఖండ్ డైన్‌మైట్‌ను జట్టులోకి తీసుకున్నారు. ఇషాన్ కిషన్ రీఎంట్రీకి ప్రధాన మార్గం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ -2025 నిలిచింది. ఈ టోర్నీలో కిషన్ దుమ్ములేపాడు. కెప్టెన్‌గా, ఒక ఆటగాడిగా జార్ఖండ్‌కు తొలిసారి ముస్తాక్ అలీ ట్రోఫీ టైటిల్‌ను అందించాడు. ఈ టోర్నీలో 10 ఇన్నింగ్స్‌ల్లో 517 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్‌గా కిషన్ నిలిచాడు. ఈ ప్రదర్శనల కారణంగానే కిషన్‌ను భారత జట్టుకు ఎంపిక చేశారు.
స్పందించిన కిషన్..
తన రీ ఎంట్రీపై కిషన్ స్పందించాడు. తిరిగి జట్టులోకి రావడం చాలా సంతోషంగా ఉంది. అందుకోసం గతేడాదిగా చాలా కష్టపడ్డాను. జార్ఖండ్‌కు ముస్తాక్ అలీ ట్రోఫీ టైటిల్ వచ్చినందుకు కూడా ఆనందంగా ఉంది. వరల్డ్ కప్ కోసం ఆతృతగా ఎదుచూస్తున్నాను అని ఎఎన్‌ఐతో కిషన్ పేర్కొన్నాడు. బ్యాకప్ ఓపెనర్‌గా కిషన్ జట్టులో ఉండనున్నాడు.
టీ20 వరల్డ్ కప్ 2026 - భారత జట్టు:
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ ( వికెట్ కీపర్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), రింకూ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, ఇషాన్ కిషన్ (కీపర్), వరుణ్ చక్రవర్తి.


