యాషెస్ సిరీస్ 2025-26ను మరో రెండు మ్యాచ్‌లు మిగిలూండగానే 3-0 తేడాతో ఇంగ్లండ్ కోల్పోయింది. అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో 82 పరుగుల తేడాతో ఓటమి చవిచూసిన ఇంగ్లండ్ జట్టు.. ఈ ఘోర పరభావాన్ని మూట కట్టుకుంది. 435 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ తమ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 352 రన్స్‌కు ఆలౌటైంది.
లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలే (85) అద్భుతంగా పోరాడినప్పటికీ.. మిడిలార్డర్ నుంచి ఆశించిన సహకారం లభించలేదు. ఆఖరిలో జామీ స్మిత్(60), విల్ జాక్స్(47), కార్స్(39 నాటౌట్) జట్టును గెలిపించేందుకు తమ వంతు ప్రయత్నం చేశారు. ఆసీస్ బౌలర్లలో ప్యాట్ కమ్మిన్స్, మిచెల్ స్టార్క్, లియోన్ తలా మూడు వికెట్లతో ఇంగ్లీష్ జట్టు ఓటమిని శాసించారు.
"సిరీస్‌ను ఎలాగైనా కాపాడుకోవాలనే లక్ష్యంతో అడిలైడ్‌లో అడుగుపెట్టాము. కానీ మా కల ఇప్పుడు చెదిరిపోయింది. ఈ ఓటమి జట్టులోని ప్రతీ ఒక్కరిని ఎంతో బాధకు గురి చేస్తోంది. చాలా చాలా ఎమోషనల్‌గా ఉన్నారు. ఆస్ట్రేలియాకు కచ్చితంగా క్రెడిట్ ఇవ్వాల్సిందే. గెలుపు అనేది మూడు విభాగాల్లో రాణించడంపై ఆధారపడి ఉంటుంది.
ఈ మ్యాచ్‌లో ఆసీస్ మాకంటే మెరుగైన ప్రదర్శన చేసింది. వారు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ మూడింటిలోనూ మాపై పైచేయి సాధించారు. నాలుగో ఇన్నింగ్స్‌లో మా ముందు భారీ లక్ష్యం ఉన్నప్పటికి మేము ఆఖరివరకు పోరాడాము. విల్ జాక్స్, జేమీ స్మిత్ ఆడిన తీరు చూసి మేము గెలుస్తామని భావించాను. కానీ అది సాధ్యం కాలేదు.
టాస్ ఓడినప్పటికి ఆసీస్‌ను తొలి ఇన్నింగ్స్‌లో ఓ మోస్తార్ స్కోర్‌కే కట్టడి చేయడంలో మేము విజయవంతమయ్యాము. అయితే ఆ తర్వాత మేము భారీ స్కోర్ చేయడంలో విఫలమయ్యాము. రెండో ఇన్నింగ్స్‌లో కూడా కేవలం 60 పరుగుల వ్యవధిలో 6 వికెట్లు పడగొట్టాము. మాకు చాలా సానుకూల ఆంశాలు ఉన్నాయి.
ముఖ్యంగా మా లోయర్ ఆర్డర్ బ్యాటర్లు చూపిన పోరాటపటిమ నిజంగా అద్బుతం. నేను ఆశించిన పట్టుదల వారిలో కన్పించింది. సిరీస్ కోల్పోయినప్పటికి మిగిలిన రెండు టెస్టుల్లో విజయం సాధించించేందుకు ప్రయత్నిస్తాము" అని పోస్ట్ మ్యాచ్ కాన్ఫరెన్స్‌లో స్టోక్స్ పేర్కొన్నాడు.
చదవండి: సంజూ శాంసన్ కీలక నిర్ణయం


