దుబాయ్ వేదికగా జరుగుతున్న ఏసీసీ మెన్స్ అండర్-19 ఆసియా కప్-2025 ఫైనల్లో భారత్, పాకిస్తాన్ అమీతుమీ తేల్చుకుంటున్నాయి. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ టాస్ ఓడి టీమిండియా ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ సమీర్ మిన్హాస్ (113 బంతుల్లో 172; 17 ఫోర్లు, 9 సిక్సర్లు) భారీ శతకంతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 347 పరుగులు చేసింది.
పాక్ ఇన్నింగ్స్‌లో సమీర్ మినహా ఎవరూ పెద్ద స్కోర్లు చేయలేదు. సమీర్ ఒక్కడే వన్ మ్యాన్ షో చేశాడు. అహ్మద్ హుసేన్ (56) సమీర్‌కు అండగా నిలిచాడు. ఉస్మాన్ ఖాన్ (35) పర్వాలేదనిపించాడు. ఓ దశలో పాక్ 400 పరుగుల మార్కు దాటుందని అనిపించింది. అయితే భారత బౌలర్లు పుంజుకోవడంతో పాక్ ఆఖర్లో త్వరితగతిన 5 వికెట్లు కోల్పోయింది. ఇదే సమయంలో స్కోర్ కూడా నెమ్మదించింది.
చివరి మూడు ఓవర్లలో పాక్ టెయిలెండర్లు నికాబ్ షఫీక్ (12 నాటౌట్), మొహమ్మద్ సయ్యమ్ (13 నాటౌట్) మరో వికెట్ పడకుండా జగ్రత్తగా ఆడి జట్టు స్కోర్‌ను 350 పరుగుల మార్కు వరకు తీసుకెళ్లారు. భారత బౌలర్లలో దీపేశ్ దేవేంద్రన్ 3 వికెట్లు పడగొట్టగా.. హెనిల్ పటేల్, ఖిలన్ పటేల్ తలో 2, కనిష్క్ చౌహాన్ ఓ వికెట్ తీశారు. కాగా, ఈ టోర్నీ సెమీఫైనల్లో భారత్ శ్రీలంకను.. పాక్ బంగ్లాదేశ్‌ను ఓడించి ఫైనల్స్‌కు చేరాయి.
చదవండి: చరిత్ర సృష్టించిన డెవాన్ కాన్వే.. తొలి న్యూజిలాండ్ బ్యాటర్‌గా


