స్వస్థలాలకు చేరిన భారత మహిళా క్రికెటర్లు
మహారాష్ట్ర ప్లేయర్లు ఒక్కొక్కరికి రూ.2.25 కోట్లు
ముంబై: తొలిసారి వన్డే వరల్డ్ కప్‌ను గెలుచుకొని చరిత్ర సృష్టించిన భారత మహిళా క్రికెటర్లపై ప్రశంసల వర్షం కొనసాగుతోంది. దేశ రాజధానిలో వరుసగా ప్రధాని, రాష్ట్రపతిలను కలిసిన తర్వాత శుక్రవారం ఈ ప్లేయర్లంతా తమ స్వస్థలాలకు చేరుకున్నారు. ఆయా నగరాల్లో ఘన స్వాగతాలు లభించడంతో పాటు నగదు ప్రోత్సాహకాల అందజేత కొనసాగుతోంది. టీమ్‌లో మహారాష్ట్రకు చెందిన ముగ్గురు ప్లేయర్లు స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, రాధ యాదవ్ ఉన్నారు.
టోర్నీ విజయంలో కీలక పాత్ర పోషించిన ఈ ముగ్గురికి మహారాష్ట్ర ప్రభుత్వం తలా రూ.2.25 కోట్లు ప్రకటించింది. దీనికి సంబంధించిన చెక్‌లను శుక్రవారమే ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ క్రికెటర్లకు అందజేశారు. ప్లేయర్లను చూస్తుంటే తమకు చాలా గర్వంగా ఉందని ఫడ్నవీస్ అన్నారు. మహారాష్ట్రకే చెందిన భారత హెడ్ కోచ్ అమోల్ మజుందార్‌కు కూడా ప్రభుత్వం రూ.22 లక్షల 50 వేల నగదు పురస్కారాన్ని అందించింది.
టీమ్ సహాయక సిబ్బందిలో భాగంగా ఉన్న అనిరుధ దేశ్‌పాండే, అపర్ణ గంభీర్‌రావు, మిహిర్ ఉపాధ్యాయ్, పూర్వ కాటే, మమత షిరురుల్లాలతో పాటు మాజీ క్రికెటర్ డయానా ఎడుల్జీలకు కూడా తలా రూ.11 లక్షలను సీఎం బహుమతిగా అందించారు. భారత జట్టులోని ఇతర సభ్యులు క్రాంతి గౌడ్ (మధ్యప్రదేశ్), అమన్‌జోత్ కౌర్, హర్లీన్ డియోల్ (పంజాబ్), రిచా ఘోష్ (బెంగాల్), అరుంధతి రెడ్డి (తెలంగాణ)లకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఘన స్వాగతం పలికాయి.

రిచా స్వస్థలం సిలిగురిలో ఓపెన్ టాప్ జీప్‌లో ఆమె విజయోత్సవ ర్యాలీని నిర్వహించగా... భోపాల్‌లో క్రాంతి గౌడ్‌ను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్... అరుంధతి రెడ్డిని తెలంగాణ క్రీడల మంత్రి వాకిటి శ్రీహరి సత్కరించారు.


