తొలి టి20లో భారత్ ఘనవిజయం
8 వికెట్లతో శ్రీలంక పరాజయం
రేపు విశాఖలోనే రెండో టి20
మహిళల వన్డే ప్రపంచకప్ ట్రోఫీ చేజిక్కించుకున్న తర్వాత తొలిసారి మైదానంలో అడుగుపెట్టిన భారత జట్టు చాంపియన్ ఆటతీరు కనబర్చింది. శ్రీలంకతో తొలి టి20లో టీమిండియా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. మొదట కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ప్రత్యర్థి ని తక్కువ స్కోరుకే పరిమితం చేసిన హర్మన్‌ప్రీత్ బృందం... స్వల్ప లక్ష్యాన్ని మరో 32 బంతులు మిగిలి ఉండగానే ఛేదించి సిరీస్‌లో బోణీ కొట్టింది. వరల్డ్‌కప్ సెమీఫైనల్ స్టార్ జెమీమా రోడ్రిగ్స్ అజేయ అర్ధశతకంతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది.
సాక్షి, విశాఖపట్నం: వన్డే ప్రపంచకప్ విజయం సాధించిన నెల రోజుల విరామం తర్వాత మైదానంలో అడుగు పెట్టిన భారత మహిళల జట్టు సమష్టి ఆటతీరుతో మెరిపించింది. శ్రీలంకతో ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో భాగంగా విశాఖపట్నం వేదికగా ఆదివారం జరిగిన తొలి పోరులో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది.
విశ్మీ గుణరత్నే (43 బంతుల్లో 39; 1 ఫోర్, 1 సిక్స్) టాప్ స్కోరర్ కాగా... హాసిని పెరీరా (20; 2 ఫోర్లు), హర్షిత (21; 2 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో క్రాంతి గౌడ్, దీప్తి శర్మ, నల్లపురెడ్డి శ్రీచరణి తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో భారత జట్టు 14.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 122 పరుగులు చేసింది.
‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జెమీమా రోడ్రిగ్స్ (44 బంతుల్లో 69 నాటౌట్; 10 ఫోర్లు) అజేయ అర్ధశతకంతో దుమ్మురేపగా... వైస్ కెపె్టన్ స్మృతి మంధాన (25; 4 ఫోర్లు), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (15 నాటౌట్) ఆమెకు అండగా నిలిచారు. ఈ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేసిన లెఫ్టార్మ్ స్పిన్నర్ వైష్ణవి శర్మ వికెట్ పడగొట్టకపోయినా పొదుపుగా బౌలింగ్ చేసి ఆకట్టుకుంది. ఇరు జట్ల మధ్య రెండో టి20 మంగళవారం ఇక్కడే జరగనుంది.
శుభారంభం లభించకున్నా...
స్వల్ప లక్ష్యఛేదనలో టీమిండియాకు శుభారంభం దక్కలేదు. తొలి ఓవర్‌లో రెండు ఫోర్లు కొట్టిన షఫాలీ వర్మ (9) మరుసటి ఓవర్‌లో అవుట్ కాగా.. స్మృతి, జెమీమా ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. చమరి ఓవర్‌లో స్మృతి రెండు ఫోర్లు కొట్టగా ... శషిని ఓవర్‌లో జెమీమా వరుసగా రెండు ఫోర్లు బాదింది. దీంతో పవర్ ప్లే ముగిసేసరికి భారత్ 55/1తో లక్ష్యం దిశగా సాగింది. కాసేపటికి స్మృతి అవుటైనా... హర్మన్‌ప్రీత్ అండతో జెమీమా దూసుకెళ్లింది.
శషిని వేసిన ఇన్నింగ్స్ 12వ ఓవర్‌లో జెమీమా నాలుగు ఫోర్లు కొట్టడం విశేషం. ఈ క్రమంలో 34 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్న ఆమె... చివరి వరకు అజేయంగా నిలిచి జట్టును గెలిపించింది. స్మృతితో రెండో వికెట్‌కు 54 పరుగులు జోడించిన జెమీమా... హర్మన్‌తో మూడో వికెట్‌కు అజేయంగా 55 పరుగులు జత చేసింది.
బౌలర్లు అదుర్స్...
శ్రీలంక ఇన్నింగ్స్‌లో పెద్దగా మెరుపులు కనిపించలేదు. ఆరంభం నుంచే మన బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో లంకేయులు స్వేచ్ఛగా ఆడలేకపోయారు. మూడు ఫోర్లతో మంచి టచ్‌లో కనిపించిన కెపె్టన్ చమరి (15) మూడో ఓవర్‌లోనే వెనుదిరగగా... విశ్మీ, హాసిని, హర్షిత తలా కొన్ని పరుగులు సాధించారు. అయితే వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టిన టీమిండియా... లంకను భారీ స్కోరు చేయకుండా అడ్డుకుంది.
ఈ మ్యాచ్‌లో మూడు రనౌట్‌లు చేసిన మన అమ్మాయిలు ఫీల్డింగ్‌లో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా 15వ ఓవర్ చివరి బంతికి హర్షిత కొట్టిన బంతిని అందుకునే క్రమంలో జెమీమా అమాంతం గాల్లోకి ఎగిరిన విధానం అబ్బురపరిచింది.
2 మహిళల టి20 క్రికెట్‌లో 4000 పరుగులు పూర్తి చేసుకున్న రెండో ప్లేయర్‌గా స్మృతి మంధాన (154 మ్యాచ్‌ల్లో 4007) నిలిచింది. న్యూజిలాండ్ ప్లేయర్ సుజీ బేట్స్ (177 మ్యాచ్‌ల్లో 4716) అగ్రస్థానంలో... హర్మన్‌ప్రీత్ కౌర్ (183 మ్యాచ్‌ల్లో 3669) మూడో స్థానంలో ఉన్నారు.
89 భారత్ తరఫున మహిళల అంతర్జాతీయ టి20ల్లో అరంగేట్రం చేసిన 89వ ప్లేయర్‌గా వైష్ణవి శర్మ గుర్తింపు పొందింది. శ్రీచరణి, క్రాంతి గౌడ్ తర్వాత టి20 ఫార్మాట్‌లో భారత్ నుంచి ఈ ఏడాది అరంగేట్రం చేసిన మూడో ప్లేయర్‌గా వైష్ణవి నిలిచింది.
స్కోరు వివరాలు
శ్రీలంక ఇన్నింగ్స్: విశ్మీ గుణరత్నే (రనౌట్) 39; చమరి ఆటపట్టు (బి) క్రాంతి 15; హాసిని (సి) క్రాంతి (బి) దీప్తి 20; హర్షిత (బి) శ్రీచరణి 21; నీలాక్షిక (రనౌట్) 8; కవిశ (రనౌట్) 6; కౌశిని (నాటౌట్) 9; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు)121. వికెట్ల పతనం: 1–18, 2–49, 3–87, 4–103, 5–108, 6–121. బౌలింగ్: క్రాంతి గౌడ్ 3–0–23–1; అరుంధతి రెడ్డి 4–0–23–0; దీప్తి శర్మ 4–1–20–1; వైష్ణవి శర్మ 4–0–16–0; శ్రీచరణి 4–0–30–1; అమన్‌జ్యోత్‌కౌర్ 1–0–8–0.
భారత్ ఇన్నింగ్స్: స్మృతి (సి) నీలాక్షిక (బి) ఇనోక 25; షఫాలీ (సి) శషిని (బి) కావ్య 9; జెమీమా (నాటౌట్) 69; హర్మన్‌ప్రీత్ (నాటౌట్) 15; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (14.4 ఓవర్లలో 2 వికెట్లకు) 122. వికెట్ల పతనం: 1–13, 2–67. బౌలింగ్: మల్కి మదార 2–0–19–0; కావ్య 3–0–20–1; చమరి 2–0–16–0; శషిని 2–0–32–0; ఇనోక 3.4–0–17–1; కవిశ 2–0–18–0.


