ఇంగ్లండ్ మహిళల జట్టు కెప్టెన్, ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ నాట్ స్కివర్ బ్రంట్ సరికొత్త చరిత్ర సృష్టించింది. మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)లో సెంచరీ సాధించిన తొలి ప్లేయర్‌గా నాట్ స్కివర్ రికార్డులెక్కింది. డబ్ల్యూపీఎల్-2026లో భాగంగా సోమవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో స్కివర్ ఈ అరుదైన ఫీట్ సాధించింది.
నాట్ స్కివర్ అద్భుతమైన సెంచరీతో చెలరేగింది. 57 బంతులు ఎదుర్కొన్న స్కివర్ 16 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 100 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. గతంలో సోఫీ డివైన్, జార్జియా వోల్ వంటి వారు 99 పరుగుల వద్ద ఆగిపోయినప్పటికి.. స్కివర్ మాత్రం సెంచరీ మార్క్‌ను అందుకుని తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకుంది.
ముంబై ఘన విజయం..
ఈ మ్యాచ్‌లో ఆర్సీబీపై 15 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. ఈ విజయంతో ముంబై తమ ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా నిలుపునుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగుల భారీస్కోరు చేసింది. ముంబై ఇన్నింగ్స్‌లో నాట్ స్కివర్‌తో పాటు హేలీ మాథ్యూస్ (39 బంతుల్లో 56; 9 ఫోర్లు) హాఫ్ సెంచరీతో రాణించింది.
తర్వాత బెంగళూరు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసి ఓడింది. రిచా ఘోష్ (50 బంతుల్లో 90; 10 ఫోర్లు, 6 సిక్స్‌లు) మాత్రమే చివరి వరకు వీరోచిత పోరాటం చేసింది. 35/5 నుంచి ఆమె జట్టును గెలుపు దిశగా తీసుకెళ్లినా ఆమె శ్రమ వృథా అయింది. నేడు జరిగే మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతుంది.


