టీ20 వరల్డ్‌కప్-2026కు ముందు ఇంగ్లండ్ జట్టు అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తోంది. శుక్రవారం పల్లెకెలె వేదికగా జరిగిన తొలి టీ20లో 11 పరుగుల తేడాతో(డక్ వర్త్ లూయిస్) ఇంగ్లండ్ విజయం సాధించింది. తొలుత వర్షం కారణంగా మ్యాచ్‌ను 17 ఓవర్లకు కుదించారు. ఈ క్రమంలో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 16.2 ఓవర్లలో 133 పరుగులకు ఆలౌటైంది.
శ్రీలంక బ్యాటర్లలో కుశాల్ మెండిస్(37) టాప్ స్కోరర్‌గా నిలవగా.. పాతుమ్ నిస్సంక (23), షనక(20) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో సామ్ కరన్ హ్యాట్రిక్ వికెట్లతో మెరిశాడు. 16 ఓవర్ వేసిన కరన్ దాసున్ షనక, మహీష్ తీక్షణ, మతీష పతిరాణ వికెట్లు తీసి హ్యాట్రిక్ నమోదు చేశాడు. టీ20ల్లో హ్యాట్రిక్ సాధించిన రెండో ఇంగ్లండ్ బౌలర్‌గా నిలిచాడు.
అతడితో పాటు అదిల్ రషీద్ మూడు, డాసన్ రెండు, ఓవర్టన్ తలా రెండు వికెట్లు సాధించారు. అనంతరం లక్ష్య చేధనలో ఇంగ్లండ్ 15 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. అయితే 15 ఓవర్ల తర్వాత భారీ వర్షం పడటంతో ఆట సాధ్యం కాలేదు.
అప్పటికే డక్‌వర్త్ లూయిస్ పార్ స్కోర్ కంటే ఇంగ్లండ్ 11 పరుగులు ముందంజలో ఉండటంతో విజేతగా ప్రకటించారు. ఇంగ్లండ్ బ్యాటర్లలో ఓపెనర్ ఫిల్ సాల్ట్ (46) టాప్ స్కోరర్‌గా నిలవగా.. టామ్ బాంటన్ (29), బట్లర్(17) రాణించాడు. శ్రీలంక బౌలర్లలో ఇషాన్ మలింగ రెండు వికెట్లు సాధించాడు.


