సాక్షి, కరీంనగర్: కాంగ్రెస్ హయాంలో కూల్చివేతలు, పేల్చివేతలు సర్వసాధారణం అయిపోయాయని బీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్‌రావు ధ్వజమెత్తారు. జమ్మికుంట మండలం తనుగుల మానేరునదిపై కూలిపోయిన చెక్ డ్యాంను ఆయన నేతృత్వంలోని బృందం మంగళవారం పరిశీలించింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రేవంత్ సర్కార్‌పై ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ హయాంలో పేల్చివేతలు సర్వసాధారణమైపోయాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇసుక మాఫియాకు పెద్దపీట వేస్తోంది. ఓదెల, జమ్మికుంట మధ్య 24 కోట్ల రూపాయలతో నిర్మించిన చెక్ డ్యామ్‌ను ఇసుక మాఫియా పేల్చివేశారు. రాత్రి వరకూ చేపలు పడితే ఎలాంటి అలజడి లేదని.. ఉదయాన్నే వచ్చి చూస్తే డ్యాం కూలిపోయిందని మత్స్యకారులు చెబుతున్నారు. తమకు ఇసుక తీయడం కష్టమవుతోందని భావించి చెక్ డ్యామ్ నే పేల్చివేశారు.
గతంలో హుసేన్ మియా వాగుపైనా ఇలాంటి ఘటనే జరిగింది. కానీ, ఈ రోజువరకూ నాటి ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. వారిని కాంగ్రెస్ పెద్దలు కాపాడుతున్నారు. భోజన్నపేట, కొత్తపల్లి రైతులే కంప్లైంట్ చేసినా హుస్సేన్ మియా ఘటనపై ఎఫ్ఐఆర్ చేయలేదు. నాడే చర్యలుంటే.. ఈరోజు ఈ తనుగుల చెక్ డ్యాంను పేల్చేందుకు భయపడేవారు. ఇరిగేషన్ ఇంజనీర్లే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినా ఇప్పటివరకూ తనుగులు చెక్ డ్యాం విషయంలో చర్యల్లేవు.
ఇసుకమాఫియా నిర్మల్, కరీంనగర్, చెన్నూరు ఇలా ప్రతీచోటా ఇసుక మాఫియా ఇష్టారాజ్యంగా రెచ్చిపోతోంది. మిషన్ కాకతీయ ద్వారా 44 వేల చెరువులను సస్యశ్యామలం చేస్తే, చెక్ డ్యాములు నిర్మిస్తే.. నేటి ప్రభుత్వం జిలెటిన్ స్టిక్స్ పేలిస్తే ఇప్పటివరకూ చర్యల్లేవు. నాణ్యతా లోపమని మాట్లాడుతున్నారు... కట్టిందెవరు..?. రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనే కదా...? అది పొంగులేటిదే కదా..? మరి మంత్రి మీద చర్యలేవి..?. రాఘవ కన్స్ట్రక్షన్ ను బ్లాక్ చేయాలని డిమాండ్.
ఓవైపు కేంద్రమంత్రి మాట్లాడతాడు. ఇంకోవైపు కాంగ్రెసోళ్లే మాట్లాడతారు. ఏది నిజం..? ఎందుకు డ్రామాలాడుతున్నారు..? రెండేళ్లైంది.. ఏడాదికి ఆరు లక్షల చొప్పున ఉత్తమ్ చెప్పినట్టు 12 లక్షలకు సాగునీరిచ్చారా..?
కాళేశ్వరంపైన కమిషన్ల పేరిట కాలాయాపన చేస్తున్నారు. విషయం గక్కుతున్నారు. కాళేశ్వరంతో లక్షల ఎకరాలకు నీరిచ్చే అవకాశముంది. కేసీఆర్ కు పేరొస్తుందని కుట్ర చేస్తున్నారు. కాల్వలు తవ్వితే కేసీఆర్ కు పేరొస్తుందని రైతుల నోట్లో మట్టిగొడుతున్నారు. రేవంత్ కాళేశ్వరం కూల్చేస్తానంటుండు. మరి మల్లన్నసాగర్ కాళేశ్వరంలో భాగంగా కట్టిందే కదా..? అక్కడి నుంచి హైదరాబాద్ కు నీరెలా తరలిస్తావు?. అది మీ తాత కట్టిందా..?
మేడిగడ్డలో ఒక్క పిల్లర్ వద్ద పగుళ్లు వస్తే రాద్ధాంతం చేశారు. జిలెటిన్ స్టిక్స్ తో చెక్ డ్యామ్ పేల్చివేత వెనుక కాంగ్రెసోళ్ల హస్తముంది. ఉన్నతస్థాయి విచారణ జరగాలి. చెక్ డ్యామ్ ను వెంటనే నిర్మించి, వర్షాకాలం వరకు పూర్తి చేయాలని డిమాండ్. కలెక్టర్, సీపీ తిమ్మినిబమ్మిని చేద్దామనుకుంటున్నారు.. జాగ్రత్త!. లక్ష క్యూసెక్కుల వరద వచ్చినా చెక్ డ్యామ్ కూలలేదే, కొట్టుకుపోలేదే.. మరిప్పుడెందుకు ఈ విధంగా కూలిపోయిందో చెప్పాలి.
కాంగ్రెస్ హయాంలో రైతులకంటే ఇసుక మాఫియాకే ప్రాధాన్యత, పెద్దపీట. టెర్రరిస్టులు కూడా చేయని పనిని ఇవాళ ఇసుక మాఫియా చేస్తోంది. ప్రపంచ దేశాల మధ్య యుద్ధాలు జరిగినా సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఓ నీతి ఉంటుంది. ఈ చర్యలపైన సరైన విచారణ జరక్కపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. అసెంబ్లీలో గట్టిగా నిలదీస్తాం అని హరీష్‌రావు అన్నారు.


