మాతా, శిశు సంరక్షణ కేంద్రం హుళక్కేనా?
సిరిసిల్లటౌన్: రాజన్నసిరిసిల్ల జిల్లా ఆస్పత్రిలో ప్రసూతి వైద్యం, అత్యవసర పరిస్థితుల్లో చిన్నారులకు వైద్యసేవలు భేషుగ్గా అందుతున్నాయి. స్థలాభావంతో మాతా, శిశు సంరక్షణ కేంద్రం నిర్వహణకు ఇబ్బందిగా ఉంది. నిరుపేద వర్గాలు ఎక్కువగా ఉన్న జిల్లా కావడంతో సర్కారు వైద్యం కోసం నిత్యం 800 మంది వరకు వస్తుంటారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల అనుబంధ ఆస్పత్రి కావడంతో 300 పడకల ఆస్పత్రిలో అన్ని వింగ్స్ నిర్వహణకు స్థలాభావం నెలకొంది.
సరిపడే సిబ్బంది
జిల్లా ఆస్పత్రిలో ప్రసూతి వైద్యానికి ప్రత్యేకంగా 45 పడకలు, సిక్ న్యూ బర్న్ కేర్ సెంటర్‌కు 10 పడకలు, పిడియాట్రిక్స్ వింగ్‌కు 30 పడకలు ఏర్పాటు చేశారు. మెటర్నటీవార్డులో నిత్యం మూడు షిఫ్టుల్లో ప్రొఫెసర్స్ 2, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ నలుగురిలో ఇద్దరు దీర్ఘకాలిక సెలవులో ఉన్నారు. సీనియర్ రెసిడెంట్స్ నలుగురిలో ముగ్గురు విధులు నిర్వర్తిస్తున్నారు. అసోసియేట్ ప్రొఫెసర్స్ ఒక్కరు ఉండగా వేములవాడ ఆస్పత్రికి డిప్యూటేషన్‌పై పంపించారు. ఇక వైద్యసహాయక సిబ్బంది మూడు షిఫ్టుల్లో మొత్తం 24 మంది పని చేస్తున్నారు.
స్థలాభావంతో..
సిరిసిల్ల జిల్లా ఆస్పత్రికి ప్రసూతి వైద్యం కోసం వస్తున్న గర్భిణీలకు మెరుగైన చికిత్స అందించేందుకు ప్రత్యేకంగా మాతా, శిశు సంరక్షణ కేంద్రం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ వచ్చినా స్థలాభావంతో ఏర్పాటు చేయలేదు. పెద్దూరు శివారులో మెడికల్ కాలేజీ సొంత భవనంలో కొనసాగుతుండగా.. ప క్కనే జిల్లా ఆసుపత్రి భవనం నిర్మిస్తున్నారు. అయి తే ఆ భవన పనులు ముందుకు సాగడం లేదు.


