సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: దేవస్థానాన్ని నమ్ముకుని వచ్చే భక్తుల విశ్వాసాన్ని దుర్వినియోగం చేస్తూ బట్టల అక్రమ వ్యాపారం చేసిన ఘటన భద్రాచలం సీతా రామాలయంలో(Bhadrachalam Sita Ramachandraswamy temple) వెలుగులోకి వచ్చింది. భక్తి ముసుగులో జరుగుతున్న ఈ రహస్య వ్యాపారాన్ని దేవస్థానం అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని అక్రమార్కులను నిలువరించారు.
సాధారణంగా భక్తులు స్వామివారికి సమర్పించిన వస్త్రాలను తిరిగి కొనుగోలు చేసే విధానం దేవస్థానాలలో ఉంటుంది. అయితే ఈ వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ స్వామివారికి సమర్పించిన వస్త్రాలు కాకుండా మార్కెట్‌లోని దుకాణాల నుంచి కొనుగోలు చేసిన బట్టలను భక్తులకు అమ్మేందుకు సిద్ధం చేసినట్లు అధికారులు గుర్తించారు.
ఈ విషయంపై సమాచారం అందుకున్న దేవస్థానం అధికారులు అక్రమంగా నిల్వచేసిన వస్త్రాలను తనిఖీ చేసి అక్కడికక్కడే ఈ అవకతవకలను బయటపెట్టారు. భక్తుల నమ్మకాన్ని వ్యాపారంగా మలచడం దారుణం. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి సంబంధిత కాంట్రాక్టర్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని దేవస్థానం కార్యనిర్వహణాధికారి దామోదర్ రావు స్పష్టం చేశారు.
జరిగిన ఘటనపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి అక్రమాలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా కఠిన పర్యవేక్షణ చేపట్టాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి: బోరబండ కార్పొరేటర్ బాబా సంచలన వ్యాఖ్యలు


