యథేచ్ఛగా తవ్వకాలు
రాత్రయితే చాలు
చర్ల జూనియర్ కళాశాల స్థలంలోని గ్రావెల్ తరలింపు
అభివృద్ధి పేరుతో అనుమతులు
సాధించిన టీజీఎండీసీ
ఈ వంకతో కాలేజీ జాగాలో
ఇష్టారీతిగా తవ్వకాలు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: చర్ల మండలం పరిధిలో సర్వే నంబరు 117లో మూడు వందల ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది. ఇది గ్రావెల్ మట్టితో నిండిన ఎత్తైన కొండ ప్రాంతం. ఇందులో 25 ఎకరాలను ప్రభుత్వ జూనియర్ కాలేజీకి గతంలో కేటాయించారు. మరో పదెకరాలను సీఆర్‌పీఎఫ్ క్యాంపు కోసం కేటాయించారు. కొండ దిగువ ప్రాంతంలో జూనియర్ కాలేజీతోపాటు అనుబంధంగా హాస్టళ్లను నిర్మించారు. కాలేజీ తరగతులు, హాస్టళ్ల భవనాలన్నీ కలిసి దాదాపుగా ఐదు ఎకరాల స్థలంలోనే ఉన్నాయి. కాలేజీకి చెందిన మరో పదెకరాల స్థలం నిరుపయోగంగా మారింది. వాజేడు నుంచి భద్రాచలం వరకు మధ్యలో ఎక్కడా డిగ్రీ కాలేజీ లేకపోవడంతో చర్ల జూనియర్ కాలేజీకి సంబంధించిన పదెకరాల ఖాళీ స్థలంలో డిగ్రీ కాలేజీ నిర్మించాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది.
ముందుగా ఎన్‌ఓసీ
ఇసుక లారీలు తిరిగేందుకు వీలుగా రోడ్లు నిర్మించేందుకు చర్ల జూనియర్ కాలేజీ స్థలంలో ఉన్న గ్రావెల్ తీసుకునేందుకు అవకాశం కల్పించాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్‌ను గతేడాది తెలంగాణ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కొత్తగూడెం ప్రాజెక్టు అధికారి శంకర్ నాయక్ కోరారు. ఇక్కడ గ్రావెల్ తీసుకున్నందుకు బదులుగా కాలేజీ అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని, కొండ ప్రాంతాన్ని చదునుగా చేసి మైదానంగా మార్చి కాలేజీకి ఇస్తామని హామీ ఇచ్చారు. టీజీఎండీసీ పీవో నుంచి వచ్చిన ప్రతిపాదన సబబుగా ఉండటంతో కలెక్టర్ కార్యాలయం నుంచి డీఈవో ఆఫీసు మీదుగా సంబంధిత దస్త్రం కాలేజీకి చేరింది. చివరకు గతేడాది నవంబరులో గ్రావెల్ తీసుకునేందుకు అభ్యంతరం లేదంటూ ఎన్‌ఓసీ (నో అబ్జెక్షన్ సర్టిఫికెట్) జారీ చేశారు.
అనుమతులు లేకుండానే మైనింగ్
చర్ల జూనియర్ కాలేజీ నుంచి ఎన్‌ఓసీ రావడమే ఆలస్యం ఇసుక వ్యాపారులు భారీ యంత్రాలను పెట్టి కాలేజీ క్యాంపస్ స్థలంలో గ్రావెల్‌ను తోడటం మొదలెట్టారు. రాత్రి వేళలో లారీల్లో వందలాది ట్రిప్పుల్లో మట్టిని తరలించారు. దీనిపై మరోసారి విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో తవ్వకాలు ఆపేశారు. అనంతరం అలువాల జ్యోతి పేరుతో మైనింగ్ శాఖకు మొరం కోసం దరఖాస్తు వచ్చింది. పరిశీలించిన మైనింగ్ శాఖ, కాలేజీకి కేటాయించిన సర్వే నంబరు 117లో 4.77 హెక్టార్ల స్థలం నుంచి గరిష్టంగా 2,000 మెట్రిక్ టన్నుల గ్రావెల్ మైనింగ్‌కు అనుమతి వచ్చింది. 2026 జనవరి 3 నుంచి మార్చి 3 వరకు ఈ పర్మిట్ చెల్లుబాటులో ఉంటుంది. రూ. 52,000ను. సీనరేజ్ చార్జీగా పేర్కొంది.
సైంటిఫిక్ అప్రోచ్ ఏది ?
ముందుగా ఇచ్చిన హామీ ప్రకారం కాలేజీ స్థలంలో గ్రావెల్ (మొరం) తవ్వకం ద్వారా ఎత్తైన కొండ ప్రాంతాన్ని చదును చేసి మైదానంగా మార్చాల్సి ఉంది. అంటే ప్రస్తుతం కాలేజీ ఉన్న సహజ ఎత్తును అనుసరించి మైనింగ్ జరిగే ప్రాంతం ఎఫ్‌ఎఫ్‌ఎల్ (ఫైనల్ ఫ్లోర్ లెవల్) సరితూగాలి. ఈ మేరకు సర్వే చేపట్టి, ఏ ప్రాంతంలో ఎంత మేరకు మైనింగ్ చేయాలనేది నిర్ధారించాల్సి ఉంటుంది. అందుకు తగ్గట్టే పనులు జరగాలి. అలా కాకుండా ఇష్టారీతిగా మొరాన్ని తవ్వితే కాలేజీ స్థలంలో పెద్ద గోతుల ఏర్పడతాయి. గతంలో అనుమతులు లేకుండా ఇక్కడ మొరం తవ్వడం వల్ల కాలేజీ పక్కనే చెరువును తలపించే విధంగా పెద్ద నీటి మడుగు ఏర్పడింది. దోమల కారణంగా విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అనుమతులు ఉన్నాయనే వంకతో సైంటిఫిక్ అప్రోచ్ లేకుండా కాలేజీ స్థలంలో మట్టిని తవ్వేస్తున్నారు. రాత్రి 8 గంటలు దాటిందంటే చాలు భారీ యంత్రాలు కాలేజీ స్థలంలోకి వచ్చి చిమ్మచీకట్లో మట్టిని తోడేస్తున్నారు. ఈ మైనింగ్ ఇలాగే కొనసాగితే కాలేజీకి మైదానం అందుబాటులోకి రావడం సంగతి అటుంచితే భవిష్యత్‌లో పూడ్చుకోలేని నష్టం జరిగే అవకాశముంది. ఏజెన్సీ డిగ్రీ కాలేజీ ఆశలకు ఎసరు వచ్చే ఆస్కారం ఉంది. గతంలో రోడ్లు బాగు చేయిస్తామని మణుగూరు, దుమ్ముగూడెం, బూర్గంపాడు మండలాల్లో టీజీఎండీసీ ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలు కాలేదు. లాభాపేక్ష తప్ప ప్రజా సంక్షేమం, సామాజిక బాధ్యతలను పట్టించుకోని ఇసుక వ్యాపారుల దూకుడుకు అడ్డుకట్ట వేయాల్సిన ప్రభుత్వ విభాగాలు మౌనంగా ఉండటం విమర్శలకు తావిస్తోంది.


