క్రీడలపై దృష్టి సారించాలి
పాల్వంచరూరల్: గ్రామీణ ప్రాంతాల్లో యువత క్రీడలపై దృష్టిసారించాలని జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి ఎం.పరంధామరెడ్డి అన్నారు. మండలంలోని లక్ష్మీదేవిపల్లి సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల కళాశాలలో జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లాస్థాయి సబ్ జూనియర్స్ అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాస్థాయి క్రీడాపోటీలను గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించడం ద్వారా క్రీడాకారులు వెలుగులోకి వస్తారని అన్నారు. జిల్లా వ్యాప్తంగా అథ్లెటిక్స్ పోటీలకు 150మంది క్రీడాకారులు హాజరుకాగా, ప్రతిభచూపిన 30మంది బాలబాలికలను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశామన్నారు. వీరు ఈ నెల 18న నిజామాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. విజేతలకు కళాశాల ప్రిన్సి పాల్ ఎం.అన్వేష్, పీడీ మల్లేష్ పతకాలను అందజేశారు. జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి మహీందర్, కోచ్ పి.నాగేంద్ర, మల్లికార్జునరావు, ఎర్రయ్య, పవన్ పాల్గొన్నారు.
జిల్లా యువజన, క్రీడల అధికారి
పరంధామరెడ్డి


