జాతీయస్థాయి పవర్ లిఫ్టింగ్‌లో ప్రతిభ
మణుగూరు రూరల్: హరియాణాలో ఈనెల 9వ తేదీన జరిగిన జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ బెంచ్ ప్రెస్ పోటీల్లో మాస్టర్స్ టు 93 కేజీల విభాగంలో మణుగూరుకు చెందిన స్కై జిమ్ నిర్వాహకుడు కొమిరెడ్డి రవీంద్రారెడ్డి అత్యుత్తమ ప్రతిభ కనబర్చాడు. ఈ పోటీల్లో దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల క్రీడాకారులు పాల్గొనగా.. రవీంద్రారెడ్డి 120 కేజీల బరువు ఎత్తి ఐదో స్థానాన్ని కై వసం చేసుకున్నాడు. జాతీయ స్థాయిలో ప్రతిభచాటిన రవీంద్రారెడ్డిని పలువు రు అభినందించారు.
సర్కారు బడుల
మూసివేతకు కుట్ర
ప్రొఫెసర్ కె.లక్ష్మీనారాయణ
భద్రాచలంటౌన్: రేషనలైజేషన్ సాకుతో ప్రభుత్వ పాఠశాలలను మూసివేసేందుకు సర్కారు ప్రయత్నిస్తోందని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ప్రొఫెసర్ కె.లక్ష్మీనారాయణ అన్నారు. భద్రాచలంలో శనివారం నిర్వహించిన జిల్లా కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. నిధుల కోత, ఖాళీల భర్తీ చేపట్టకుండా పేదలకు విద్యను దూరం చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రం తీసుకొచ్చిన వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ – 2025 బిల్లుతో విద్యను కాషాయీకరణ చేసేందుకు చూస్తున్నారని విమర్శించారు. విద్యా వ్యవస్థ ప్రైవేటీకరణను ప్రతీ ఒక్కరు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం టీపీటీఎఫ్ జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షుడిగా ఎం.రామాచారి, అధ్యక్షుడిగా జి.హరిలాల్, ప్రధాన కార్యదర్శిగా వి.వినోదిని, అసోసియేట్ అధ్యక్షుడిగా డి.శ్రీనివాస్ ఎన్నికయ్యారు. కార్యక్రమంలో నాయకులు వై.అశోక్‌కుమార్, ఎ.సోమయ్య,కె.రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.
అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు
ఎస్పీ రోహిత్ రాజ్
సూపర్‌బజార్(కొత్తగూడెం): పేకాట, కోడి పందేలు వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ రోహిత్ రాజ్ శనివారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. వాటిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న పోలీస్‌స్టేషన్ అధికారులకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశామని పేర్కొన్నారు. అసాంఘిక చర్యలకు పాల్పడేవారి సమాచారం అందించాలని కోరారు. వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
ఊరెళ్తున్నారా..
సమాచారం ఇవ్వండి
సంక్రాంతి పండుగ సందర్భంగా ఇళ్లకు తాళం వేసి దూరప్రాంతాలకు వెళ్లేవారు సమీప పోలీసులకు సమాచారం అందించాలని ఎస్పీ సూచించారు. సెలవులకు చాలామంది కుటుంబ సమేతంగా వెళ్తుంటారని, ఆ సమయంలో దొంగలు చోరీలకు పాల్పడే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ముందుగా సమాచారం అందిస్తే పెట్రోలింగ్ చేసే పోలీసులు ఆ ఇళ్లపై ప్రత్యేక దృష్టి సారిస్తారని వెల్లడించారు. ఇళ్లకు తాళం వేసేప్పుడు నగదు, బంగారం, ఇతర విలువైన వస్తువులను బ్యాంకు లాకర్లలో లేదా ఇతర సురక్షిత ప్రాంతాల్లో భద్రపరుచుకోవాలని సూచించారు. అత్యవసర సమయంలో డయల్ 100కు ఫోన్‌చేయాలని తెలిపారు.


